కేంద్రం ప్రకటనతో రగులుతున్న విశాఖ..
నూటికి నూరు శాతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానంతో విశాఖలో ఆందోళన చిచ్చు రగులుకుంది. రాత్రికి రాత్రే కార్మిక సంఘాలు కార్యాచరణ ప్రకటించాయి. ఆందోళనతో విశాఖ అట్టుడకాలని నిర్ణయం తీసుకున్నాయి. కార్మికులకు తోడు నిర్వాసితులు జతకలిసి విశాఖలో నిరసన ప్రదర్శనల్ని ఉధృతం చేశారు. సోమవారం సాయంత్రం లోక్ సభలో ఆర్థిక మంత్రి ప్రకటన వెలువడగానే.. విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి. జాతీయ రహదారి కూర్మన్నపాలెం కూడలి ఉక్కు […]
నూటికి నూరు శాతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానంతో విశాఖలో ఆందోళన చిచ్చు రగులుకుంది. రాత్రికి రాత్రే కార్మిక సంఘాలు కార్యాచరణ ప్రకటించాయి. ఆందోళనతో విశాఖ అట్టుడకాలని నిర్ణయం తీసుకున్నాయి. కార్మికులకు తోడు నిర్వాసితులు జతకలిసి విశాఖలో నిరసన ప్రదర్శనల్ని ఉధృతం చేశారు.
సోమవారం సాయంత్రం లోక్ సభలో ఆర్థిక మంత్రి ప్రకటన వెలువడగానే.. విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి. జాతీయ రహదారి కూర్మన్నపాలెం కూడలి ఉక్కు ఫ్యాక్టరీ మెయిన్ గేట్ వద్ద, ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కార్మికులంతా మానవహారంగా ఏర్పడి హైవేని దిగ్బంధించారు. రోడ్డుమీద బైఠాయించడంతో సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఎమ్మెల్యేకు సైతం నో ఎంట్రీ..
అనకాపల్లి నుంచి విశాఖకు తన కారులో వెళ్తున్న ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తి రాజును ఆందోళనకారులు అడ్డగించారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, దారి ఇవ్వాలని ఎమ్మెల్యే కోరనా ఫలితం లేకపోవడంతో.. ఆయన తన కారు అక్కడే వదిలేసి పోలీసుల వాహనంలో మరో మార్గంలో వెళ్లిపోయారు. కూర్మన్నపాలెం కూడలిలో ఆందోళనకారులు చేపట్టిన నిరసన అర్ధరాత్రి దాటినా కొనసాగుతూనే ఉంది. కేంద్రం తీరుకు నిరసనగా నేడు విశాఖలోని ఉక్కుపరిపాలనా భవనం ముట్టడికి ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది.
రాజకీయ రచ్చ..
ఉక్కు ప్రైవేటీకరణ తప్పదని కేంద్రం స్పష్టం చేసిన వెంటనే.. ఇటు ఏపీలో అధికార, ప్రతిపక్షాలు ఒకదానిపై ఒకటి దుమ్మెత్తి పోసుకోవడం మొదలు పెట్టాయి. ఉక్కు ప్రైవేటీకరణకు కారణం మీరంటే మీరంటూ విమర్శనాస్త్రాలు సంధించుకున్నాయి. జగన్ మోసం మరోసారి బయటపడిందని, వైసీపీయే ప్రైవేటీకరణకు కారణం అని టీడీపీ అనుకూల మీడియా రచ్చ చేస్తోంది. అటు వైసీపీ నేతలు కూడా ప్రైవేటీకరణ ఆపేందుకు టీడీపీ కలసి రావడంలేదని, కేంద్రాన్ని ప్రశ్నించాల్సింది పోయి, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు. మొత్తమ్మీద కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో విశాఖ మరోసారి భగ్గుమంది. భాగస్వాములు, ఉద్యోగులు, షేర్లు కొనుగోలు చేసేలా ప్రత్యేక ప్రతిపాదనలు చేస్తున్నామని కేంద్రం ఇచ్చిన హామీ ఎంతవరకు అమలవుతుంది? ఇలాంటి హామీలతో కార్మికులు శాంతిస్తారా లేదా అనేది వేచి చూడాలి.