స్టీల్ ప్లాంట్ కోసం.. ఎందాకైనా పోరాడతాం -విజయసాయిరెడ్డి..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నిస్తోందని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. లక్ష్య సాధన కోసం అందరినీ కలుపుకొని వెళ్లడానికి వైసీపీ సిద్ధంగా ఉందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు, ఆందోళనకు గురి చేసిందని అన్నారాయన. కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. అఖిలపక్షంతోపాటు ప్రధానమంత్రిని […]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నిస్తోందని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. లక్ష్య సాధన కోసం అందరినీ కలుపుకొని వెళ్లడానికి వైసీపీ సిద్ధంగా ఉందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు, ఆందోళనకు గురి చేసిందని అన్నారాయన. కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. అఖిలపక్షంతోపాటు ప్రధానమంత్రిని కలవడమే కాకుండా, అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తామని అన్నారు. 2002 నుంచి 2015 వరకు విశాఖ ఉక్కు కర్మాగారం అత్యుత్తమ పని తీరు ప్రదర్శించి లాభాల బాటలో నడిచిందని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ కు లక్ష కోట్ల రూపాయల విలువైన 19,700 ఎకరాల భూమి ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చిన సమయంలో 2014 నుంచి సంస్థ నష్టాలబాటలో పడిందని చెప్పారు. సొంత గనులు లేకపోవడం, ఎక్కువ వడ్డీకి రుణాలు తేవడం కూడా పరోక్షంగా నష్టాలకు కారణం అని వివరించారు. సొంత గనుల కేటాయించి, రుణాలను ఈక్విటీగా మార్చాలని, స్టాక్ మార్కెట్ లో కూడా లిస్టింగ్ కి వెళ్లొచ్చని సూచించారు.
దేశంలో మిగతా స్టీల్ ప్లాంట్ లకు సొంత గనులున్నాయని, సొంత గనులు లేకపోవడం వల్ల విశాఖ ఉక్కు కర్మాగారంపై రూ.3472 కోట్ల భారం పడుతోందని అన్నారు. ఈ విషయాలన్నీ వివరించడం కోసమే సీఎం జగన్, ప్రధాని అపాయింట్ మెంట్ కోరారని అన్నారు. సీఎంతోపాటు పాటు అఖిలపక్షం బృందం, కార్మిక సంఘాల నాయకులను కూడా వెంట తీసుకెళ్తామని అన్నారు. విశాఖ స్టీల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుందని, లక్ష్య సాధనలో అందరినీ కలుపుకొని వెళ్తుందని అన్నారు.
రాజీలేని పోరాటం..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోడానికి వైసీపీ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని అన్నారు మంత్రి అంతి శ్రీనివాస్. ప్రైవేటీకరణ వ్యవహారం తమకు తెలిసి జరుగుతోందని కొన్ని పత్రికల్లో తప్పుడు కథనాలు వస్తున్నాయని ఆయన మండిపడ్డారు. విశాఖ స్టీల్ లో రాష్ట్ర ప్రభుత్వ వాటా లేదని కేంద్రం చెప్పడం సరికాదని అన్నారు. భూమి, నీరు, విద్యుత్ ఇక్కడి ప్రభుత్వం ఇవ్వకుండానే పరిశ్రమ వచ్చిందా అని ప్రశ్నించారు. రెండు దశాబ్దాల ఉద్యమంతో సాధించుకున్న సంస్థను, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదని, నష్టాల పేరుతో అమ్మేస్తామంటే కుదరదని అన్నారు అవంతి. చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మాని, కేంద్రంతో మాట్లాడాలని హితవు పలికారు. స్టీల్ ప్లాంట్ ని కాపాడుకునేందుకు గల్లీలోనే కాదు, ఢిల్లీలో సైతం పోరాడతామని అన్నారు అవంతి శ్రీనివాస్.