బీజేపీ వాళ్ల డబ్బులు తీసుకోండి.. కానీ ఓట్లు మాత్రం వేయొద్దు: దీదీ
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. బెంగాల్లో ఈ సారి ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ అన్నిరకాల ప్రయత్నాలను చేస్తున్నది. పట్టు నిలుపుకోవాలని మమతా కూడా బీజేపీకి దీటుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పశ్చిమబెంగాల్లో ప్రధాని మోదీ పర్యటించారు. మరోసారి మమతను గెలిపిస్తే.. ఆమె బెంగాల్‌ను కశ్మీర్ చేస్తారంటూ ఆయన విమర్శించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను మమతా ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. ఆదివారం ఆమె […]
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. బెంగాల్లో ఈ సారి ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ అన్నిరకాల ప్రయత్నాలను చేస్తున్నది. పట్టు నిలుపుకోవాలని మమతా కూడా బీజేపీకి దీటుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పశ్చిమబెంగాల్లో ప్రధాని మోదీ పర్యటించారు. మరోసారి మమతను గెలిపిస్తే.. ఆమె బెంగాల్‌ను కశ్మీర్ చేస్తారంటూ ఆయన విమర్శించారు.
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను మమతా ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. ఆదివారం ఆమె సిలిగురిలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలంతా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని చూస్తున్నారని చెప్పారు. వాళ్లు గ్యాస్ సిలిండర్లు, పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచారని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అన్ని ధరలు పెంచుతారని విమర్శించారు. ఎలాగూ గెలవలేమని భావించిన బీజేపీ నేతలు డబ్బుతో ఓట్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజలు బీజేపీ నేతలు పంచే డబ్బు తీసుకొని ఓట్లు మాత్రం తృణమూల్ కాంగ్రెస్‌కే వేయాలని పిలుపునిచ్చారు.
ఇక పాదయాత్ర లో సీఎం మమతా బెనర్జీ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. టీఎంసీ కార్యకర్తలు గ్యాస్ సిలిండర్లు ప్రదర్శిస్తూ .. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచిందని ప్రజలకు వివరించారు. ‘ప్రధాని నరేంద్రమోదీ బెంగాల్లో పర్యటించారు. ఆయన ఏమంటున్నారంటే బెంగాల్లో మహిళలు సంతోషంగా లేరంట. అయితే నేను ఓ సవాలు విసురుతున్నాను. ప్రజలు లేదా మహిళలు బెంగాల్లో భద్రతతో ఉన్నారా? లేక రోజుకో హత్య పూటకో రేప్ జరిగే ఉత్తర్‌ప్రదేశ్‌లో సంతోషంగా ఉన్నారా’ అంటూ ఆమె ప్రశ్నించారు. నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో బెంగాల్లో రాజకీయం వేడెక్కుతున్నది.
ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు. మరోవైపు ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచనలతో మమతా బెనర్జీ ముందుకెళ్తున్నారు. ‘మీ ఇంటి ఆడపడుచును గెలిపించుకోండి’ అన్న నినాదంతో ఆమె ముందుకెళ్తున్నారు. మార్చి 27 నుంచి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి.