Telugu Global
NEWS

విశాఖలో గంటా కలకలం..

పార్టీతోపాటు పదవులకూ రాజీనామా చేస్తేనే వైసీపీలోకి ఎంట్రీ అని చెబుతున్నా కూడా.. ఇప్పటి వరకు నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ కి జై కొట్టారు. ఇంకొంతమంది ఆ లిస్ట్ లో ఉన్నారని అంటుంటారు. అయితే మాజీ మంత్రి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారం మాత్రం వేరు. అసలు టీడీపీలో పడే తొలి వికెట్ గంటాదే అనుకున్నారంతా, కానీ ఆయన ఇన్నాళ్లూ టీడీపీతోనే ఉన్నారు. కాదు కాదు, ఉన్నారని అనిపించుకుంటున్నారంతే. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విశాఖ […]

విశాఖలో గంటా కలకలం..
X

పార్టీతోపాటు పదవులకూ రాజీనామా చేస్తేనే వైసీపీలోకి ఎంట్రీ అని చెబుతున్నా కూడా.. ఇప్పటి వరకు నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ కి జై కొట్టారు. ఇంకొంతమంది ఆ లిస్ట్ లో ఉన్నారని అంటుంటారు. అయితే మాజీ మంత్రి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారం మాత్రం వేరు. అసలు టీడీపీలో పడే తొలి వికెట్ గంటాదే అనుకున్నారంతా, కానీ ఆయన ఇన్నాళ్లూ టీడీపీతోనే ఉన్నారు. కాదు కాదు, ఉన్నారని అనిపించుకుంటున్నారంతే. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విశాఖ వస్తే గంటా ఆ పర్యటనలో కనిపించరు, పోనీ ఆయనెప్పుడైనా నేరుగా చంద్రబాబుని కలిశారా అంటే అదీ లేదు. ఎన్నికల తర్వాత ఇంతవరకు పార్టీనాయకులతో కలసిన సందర్భాలు అరుదు. విశాఖ ఉక్కుకోసం సొంతగా రాజీనామా అంటారు, తన రాజకీయం తనదేనంటారు. మున్సిపల్ ఎన్నికల విషయంలో సైతం.. పార్టీ అధినాయకత్వంతో సంబంధం లేకుండా సభలు, సమావేశాలు పెట్టుకుంటారు. అసలింతకీ గంటా టీడీపీలో ఉన్నట్టా లేనట్టా, ఉండీ లేనట్టా అనే విషయం చంద్రబాబుకి కూడా తెలియదంటే ఆశ్చర్యం లేదు.

గంటా అనుచరుడి చేరికతో కలకలం..
గంటా శ్రీనివాసరావు అనుచరుడు కాశీ విశ్వనాథ్‌ వైసీపీలో చేరడంతో కలకలం రేగింది. ఆ చేరిక సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి.. గంటా పార్టీ మార్పుపై కూడా స్పందించారు. గంటా శ్రీనివాసరావు తమకు కొన్ని ప్రతిపాదనలు పంపారని.. జగన్‌ ఆమోదం తర్వాత పార్టీలోకి ఆయన వచ్చే అవకాశముందని చెప్పారు. వాస్తవానికి స్థానిక మంత్రి అవంతి శ్రీనివాస్ తో గంటాకు విభేదాలున్నాయి. వాటిని సరిదిద్దుకోడానికే ఇన్నాళ్లు సమయం పట్టిందని, పూర్తి స్థాయిలో ఇద్దరూ ఓ అవగాహనకు వచ్చాకే పార్టీ మార్పు ఉంటుందని రాజకీయ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలతో కలకలం మొదలైంది.

అంతలోనే సర్దుకున్న గంటా..
ఆలస్యం చేస్తే అధిష్టానానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని అనుకున్నారో, లేక మరికొన్నాళ్లు వేచి చూద్దామనుకున్నారో.. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై గంటా వెంటనే స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు చాలాసార్లు ప్రచారం జరిగిందని.. దాన్ని ఇప్పటికీ ఖండిస్తూనే ఉన్నానని చెప్పారు.

వెంటనే విజయసాయిరెడ్డి కౌంటర్..
గంటా వ్యాఖ్యల నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఆయనకు కౌంటర్‌ ఇచ్చారు. వైసీపీలో చేరతానని గంటా గతంలో ప్రతిపాదన పంపారని.. దానిపై సీఎం జగన్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. గంటా ప్రతిపాదనను సీఎం ఆమోదిస్తే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. మైండ్‌ గేమ్‌ ఆడాల్సిన అవసరం తమ పార్టీకి లేదని విజయసాయిరెడ్డి చెప్పారు. వైసీపీకి గంటా శ్రీనివాసరావు వచ్చినంత మాత్రాన ప్రభుత్వంలో మార్పులు ఉండవని స్పష్టం చేశారు. అటు గంటాని నిరుత్సాహపరచకుండా, ఇటు పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా చాకచక్యంగా వ్యవహరించారు విజయసాయిరెడ్డి. జీవీఎంసీ ఎన్నికల ముందు గంటా పార్టీ మార్పు వ్యవహారం విశాఖలో తీవ్ర కలకలంగా మారింది. ఇప్పుడు కాకపోయినా ఇంకొన్నిరోజుల తర్వాతయినా గంటా పార్టీ మారడం ఖాయమని అంటున్నారు స్థానికులు. అయితే ఆ ప్రతిపాదనలు ఏంటి? వాటిని జగన్ ఎప్పుడు ఆమోదిస్తారనేదే ప్రస్తుతానికి సస్పెన్స్.

First Published:  4 March 2021 2:34 AM IST
Next Story