Telugu Global
National

ప్రభుత్వానికంటూ ఏదీ మిగలదా..?

అదీ, ఇదీ అంటూ అన్నిటినీ ప్రైవేటుపరం చేసుకుంటూ వస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా ఓడరేవుల విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రధాన ఓడరేవులను ప్రైవేటీకరించే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. మారిటైం ఇండియా సమ్మిట్-2021 దీనికి ప్రధాన వేదికగా మారింది. ప్రధాని ప్రసంగం భవిష్యత్ ప్రైవేటు ముఖ చిత్రాన్ని మరోసారి కళ్లకు కట్టింది. “సుదీర్ఘ సాగరతీరం, శ్రమించే మానవ వనరులు ప్రపంచ పెట్టుబడిదారుల కోసం ఎదురుచూస్తున్నాయి. మా పోర్టుల్లో, మా ప్రజలపై పెట్టుబడి పెట్టండి. […]

ప్రభుత్వానికంటూ ఏదీ మిగలదా..?
X

అదీ, ఇదీ అంటూ అన్నిటినీ ప్రైవేటుపరం చేసుకుంటూ వస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా ఓడరేవుల విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రధాన ఓడరేవులను ప్రైవేటీకరించే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. మారిటైం ఇండియా సమ్మిట్-2021 దీనికి ప్రధాన వేదికగా మారింది. ప్రధాని ప్రసంగం భవిష్యత్ ప్రైవేటు ముఖ చిత్రాన్ని మరోసారి కళ్లకు కట్టింది.

“సుదీర్ఘ సాగరతీరం, శ్రమించే మానవ వనరులు ప్రపంచ పెట్టుబడిదారుల కోసం ఎదురుచూస్తున్నాయి. మా పోర్టుల్లో, మా ప్రజలపై పెట్టుబడి పెట్టండి. భారత్‌ను మీ గమ్యస్థానంగా మార్చుకోండి. భారతీయ పోర్టులను మీవిగా భావించి వర్తక, వాణిజ్యాలు చేపట్టండి.” ఈ సమ్మిట్ సందర్భంగా ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు ఇది. ఆయన మాటల్నిబట్టి చూస్తే ప్రైవేటీకరణపై ఎన్డీఏ కృతనిశ్చయం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓడరేవుల ప్రైవేటీకరణ ద్వారా భారత ప్రభుత్వం 2.25లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించే లక్ష్యంతో ఉంది. సుమారు 400 ప్రాజెక్ట్ లు పీపీఏ పద్ధతి ద్వారా ప్రైవేటుపరం కాబోతున్నాయి.

విశాఖపట్నం పోర్టు సహా.. దేశంలోని పోర్టులన్నీ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ ఆధ్వర్యంలో ఇప్పటి వరకూ కొనసాగుతున్నాయి. ఈ ట్రస్టులకు అధికారాలు పరిమితంగా ఉండటంతో కేంద్రం జారీ చేసే ఉత్తర్వులు, విధాన నిర్ణయాలనే ఇవి అమలు చేయాల్సి వచ్చేది. ఈ క్రమంలో పోర్టులన్నింటికీ స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం మేజర్‌ పోర్టుల అథారిటీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలోనే ప్రైవేటు భాగస్వామ్యం కోసం పీపీఏ ప్రతిపాదన ఉంది. చట్టం తీసుకొచ్చినప్పుడు ఈ ప్రతిపాదన గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ, తాజాగా ప్రధాని వ్యాఖ్యలతో పోర్టులకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం వెనక ఎంతటి దూరాలోచన ఉందో అర్థమవుతోంది.

ప్రభుత్వ నియంత్రణలో ఉన్న పోర్టుల్లోని బెర్తులను ఈ ఏడాది ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి అప్పగించబోతున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న మేజర్‌ పోర్టులు వాటి పరిధిలోని 39 బెర్తులను సొంతంగా నిర్వహిస్తున్నాయని, వాటన్నింటినీ పీపీపీ విధానంలో నిర్వహించాలని నిర్ణయించామని, ఈ ఏడాదే వాటిని ప్రైవేటుకు అప్పగించే ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. 2024కల్లా ఈ 39 బెర్తులు పూర్తిగా పీపీపీ విధానంలోకి వెళ్లేలా ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. అదే జరిగితే ప్రస్తుతం ఎయిర్ పోర్టుల్లో ఉన్న విధానమే భవిష్యత్ లో ఓడరేవుల్లో కూడా పూర్తి స్థాయిలో అమలవుతుంది. భూమి, మౌలిక వసతులు మాత్రం పోర్టు యాజమాన్యం కిందకు వస్తాయి. దాని నిర్వహణ కార్యకలాపాలన్నీ ప్రైవేటు భాగస్వామి చేతుల్లోకి వెళ్తాయి. ఒప్పందం ప్రకారం ప్రైవేటు భాగస్వామి, పోర్టులకు మధ్య ఆదాయ పంపిణీ జరుగుతుంది. పెట్టుబడుల రూపంలో లక్షలకోట్లు రావొచ్చు కానీ, ప్రభుత్వ అధీనంలో ఉన్న పోర్టులపై ప్రైవేటు పెత్తనం పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

First Published:  2 March 2021 9:38 PM GMT
Next Story