ఎస్ఈసీ నిర్ణయం కోర్టులో నిలబడుతుందా..?
ఎక్కడ ఆగిపోయాయో అక్కడినుంచే మున్సిపల్ ఎన్నికలను తిరిగి నిర్వహిస్తామని చెప్పిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, నామినేష్ల విషయంలో వేలు పెట్టారు. ఏకగ్రీవాలు కావాల్సిన స్థానాల్లో కొంతమంది అభ్యర్థుల ఆందోళనను నిజం చేశారు. అయితే అతి కొద్ది వార్డుల్లోనే రీ నామినేషన్ ప్రకటించడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం 11 చోట్ల రీ నామినేషన్లకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తం వార్డులు రాయలసీమలోనే ఉండటం గమనార్హం. చిత్తూరు జిల్లాలోని తిరుపతి కార్పోరేషన్ పరిధిలో […]
ఎక్కడ ఆగిపోయాయో అక్కడినుంచే మున్సిపల్ ఎన్నికలను తిరిగి నిర్వహిస్తామని చెప్పిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, నామినేష్ల విషయంలో వేలు పెట్టారు. ఏకగ్రీవాలు కావాల్సిన స్థానాల్లో కొంతమంది అభ్యర్థుల ఆందోళనను నిజం చేశారు. అయితే అతి కొద్ది వార్డుల్లోనే రీ నామినేషన్ ప్రకటించడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం 11 చోట్ల రీ నామినేషన్లకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తం వార్డులు రాయలసీమలోనే ఉండటం గమనార్హం.
చిత్తూరు జిల్లాలోని తిరుపతి కార్పోరేషన్ పరిధిలో 6 వార్డులు, పుంగనూరు మున్సిపాలిటీలో 3 వార్డులు, కడప జిల్లా రాయచోటిలో 2 వార్డుల్లో ఏకగ్రీవాలు అవుతున్న చోట్ల రీ నామినేషన్ కు అవకాశమిచ్చారు ఎస్ఈసీ. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ కి గడువిచ్చారు. దీనిపై ఆయా వార్డుల్లో ఏకగ్రీవం అయ్యే అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారంతా కోర్టుని ఆశ్రయిస్తారని తెలుస్తోంది.
కోర్టు కేసుతో ఏం జరుగుతుంది..?
ఏకగ్రీవాలు అయిన చోట్ల తిరిగి నామినేషన్ల ప్రక్రియ చేపట్టడం సరికాదని పరిషత్ ఎన్నికల విషయంలో ఇటీవలే హైకోర్టు తేల్చి చెప్పింది. అప్పటికే రిటర్నింగ్ అధికారులు ఫామ్-10 ఇచ్చేసి ఉంటారని, అందువల్ల వారి అధికారాన్ని ప్రశ్నించడం సరికాదని, ఏకగ్రీవాల విషయంలో జోక్యం చేసుకోవద్దని ఎస్ఈసీకి సూచించింది. అయితే మున్సిపల్ ఎన్నికల విషయంలో ఇంకా నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కాలేదు. అంటే ఏకగ్రీవాలపై అధికారిక ప్రకటన లేదు. ఈ నేపథ్యంలో అక్కడి అభ్యర్థులు కోర్టుకెక్కితే ఫలితం ఉంటుందా లేదా అనేదే అసలు ప్రశ్న.
మార్చి 3న ఉపసంహరణలు జరగాల్సి ఉన్న సందర్భంలో ఒక్కరోజు గడువులో మార్చి 2న రీ నామినేషన్లకు అవకాశం ఇవ్వడం సంచలనంగా మారింది. ఏకగ్రీవాలయ్యే అభ్యర్థులు ఈ వ్యవహారంపై హైకోర్టుని ఆశ్రయిస్తే, కోర్టు ఎస్ఈసీ నిర్ణయంపై విచారణ మొదలు పెడితే.. మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే దాని ప్రభావం పడుతుంది. షెడ్యూల్ టైట్ గా ఉండేందుకు కేవలం ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఇచ్చి వ్యూహాత్మకంగా ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏకగ్రీవంతో ఒడ్డునపడతామని అనుకున్న అభ్యర్థులు, ఎన్నికల ఖర్చులు ఊహించుకుని తలలు పట్టుకున్నారు.