Telugu Global
NEWS

నామినేషన్ల తేనెతుట్టె కదుపుతున్న నిమ్మగడ్డ..

మున్సిపల్ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన‌ నిర్ణయానికి తెరతీశారు. ఏకంగా నామినేషన్ల ప్రక్రియనే పునఃప్రారంభిస్తామని అంటున్నారు. ప్రత్యర్థుల బలవంతంతో పోటీ నుంచి విరమించుకున్నవారు, ప్రత్యేక పరిస్థితుల్లో నామినేషన్లు వేయలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించే విషయాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోందని ఎస్ఈసీ నిమ్మగడ్డ వెల్లడించారు. బాధితుల అభ్యర్థనలపై ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలాంటి వారిపట్ల సానుభూతితో వ్యవహరించి బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్ కింద మరోసారి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు […]

నామినేషన్ల తేనెతుట్టె కదుపుతున్న నిమ్మగడ్డ..
X

మున్సిపల్ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన‌ నిర్ణయానికి తెరతీశారు. ఏకంగా నామినేషన్ల ప్రక్రియనే పునఃప్రారంభిస్తామని అంటున్నారు. ప్రత్యర్థుల బలవంతంతో పోటీ నుంచి విరమించుకున్నవారు, ప్రత్యేక పరిస్థితుల్లో నామినేషన్లు వేయలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించే విషయాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోందని ఎస్ఈసీ నిమ్మగడ్డ వెల్లడించారు. బాధితుల అభ్యర్థనలపై ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలాంటి వారిపట్ల సానుభూతితో వ్యవహరించి బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్ కింద మరోసారి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఉన్న విశేషాధికారాలను మొదటిసారి వినియోగించబోతున్నామని స్పష్టం చేశారు.

అభ్యర్థులు మరణిస్తే ఆయా స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడతాయి. అయితే అలాంటి చోట్ల అదే పార్టీకి చెందిన ఇతర అభ్యర్థులనుంచి నామినేషన్లు తీసుకునే కొత్త విధానం తీసుకొచ్చారు ఎస్ఈసీ. ఈ నామినేషన్ల ఘట్టం ఆదివారం ముగిసింది. ఇక మార్చి 3న నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఉంది. ఏకగ్రీవాలు ఎన్ని, ఎక్కడెక్కడ ఎన్నికలు ఉంటాయనే విషయం ఆరోజు స్పష్టమవుతుంది. అయితే ఆ లోగా.. మరోసారి నామినేషన్ల స్వీకరణకు ఎస్ఈసీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ఏకగ్రీవాలపై మొట్టికాయ పడినా..!
లాక్ డౌన్ కి ముందు మొదలైన పరిషత్ ఎన్నికల్లో 2248 ఎంపీటీసీలు, 125 జడ్పీటీసీలు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. వీటిపై గతంలోనే అభ్యంతరం తెలిపిన ఎన్నికల కమిషనర్, నామినేషన్లు వేయనివారికి మరో అవకాశం అనే సరికి ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు కోర్టుకెక్కారు. ఏకగ్రీవాలను ధృవీకరిస్తూ రిటర్నింగ్ అధికారి ఫామ్-10 ఇచ్చిన తర్వాత దానిపై మరోసారి రాద్ధాంతం వద్దంటూ కోర్టు ఎస్ఈసీకి సూచించింది. ఆర్టికల్ 243-కె పరిధిని చెబుతూ ఎస్ఈసీని నిలువరించింది. దీంతో ఏకగ్రీవాల విషయంలో ఎస్ఈసీకి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల విషయంలో ఏకగ్రీవాల ధృవీకరణ ఇంకా జరగలేదు కాబట్టి, ఎస్ఈసీ ధైర్యంగా అడుగు ముందుకేస్తున్నారు. ఎన్నికల సంఘానికి ఉన్న విశేషాధికారాలను మొదటిసారి వినియోగిస్తామని చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమైన ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటికే కలెక్టర్ల వద్ద ఉన్న వివరాలను తెప్పించుకుని నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

ఏపీలోని 75మున్సిపాల్టీలు 12 కార్పొరేషన్లకు ఈనెల 10న పోలింగ్ జరగాల్సి ఉంది. ఈనెల 14న‌ ఫలితాలు విడుదలవుతాయి.

First Published:  1 March 2021 3:07 AM IST
Next Story