3 రోజులు, 3 ప్రదక్షిణలు.. కుప్పంలో ఏం తేల్చారు..?
కుప్పం ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి కూడా వెళ్లనంత బిజీగా ఉండే చంద్రబాబు.. ఇప్పుడు ముచ్చటగా మూడురోజులపాటు సొంత నియోజకవర్గంలో మకాం వేశారు. నియోజకవర్గం మొత్తం కలియదిరిగారు, సభలు, సమావేశాలు, రోడ్ షో లతో అసెంబ్లీ ప్రచారానికొచ్చినంత హడావిడి చేశారు. చూసేవారికి ఇదంతా విచిత్రంగా తోచినా.. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన పరాభవమే బాబుని కుప్పం వైపుకి లాక్కొచ్చిందనేది వాస్తవం. రాష్ట్రం మొత్తం వ్యతిరేక ఫలితాలొచ్చినా దాన్ని ఎలాగోలా కవర్ చేసుకున్న చంద్రబాబుకి, కుప్పంలో వచ్చిన వ్యతిరేక ఫలితాలు బాగా […]
కుప్పం ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి కూడా వెళ్లనంత బిజీగా ఉండే చంద్రబాబు.. ఇప్పుడు ముచ్చటగా మూడురోజులపాటు సొంత నియోజకవర్గంలో మకాం వేశారు. నియోజకవర్గం మొత్తం కలియదిరిగారు, సభలు, సమావేశాలు, రోడ్ షో లతో అసెంబ్లీ ప్రచారానికొచ్చినంత హడావిడి చేశారు. చూసేవారికి ఇదంతా విచిత్రంగా తోచినా.. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన పరాభవమే బాబుని కుప్పం వైపుకి లాక్కొచ్చిందనేది వాస్తవం.
రాష్ట్రం మొత్తం వ్యతిరేక ఫలితాలొచ్చినా దాన్ని ఎలాగోలా కవర్ చేసుకున్న చంద్రబాబుకి, కుప్పంలో వచ్చిన వ్యతిరేక ఫలితాలు బాగా ఇబ్బంది పెట్టాయి. కుప్పంలో కూసాలు కదిలిపోతున్నాయి, కొత్త నియోజకవర్గం వెతుక్కోవాల్సిందేనంటూ వైరిపక్షాలు చేసిన విమర్శలు కూడా బాబులో కదలిక తెచ్చాయి. అర్జంట్ గా వెళ్లి పడిపోతున్న పార్టీ ప్రభను నిలబెట్టాలనే ఉద్దేశంతోనే బాబు కుప్పం బాట పట్టారు.
పార్టీకి కొత్త రక్తం.. నెలకోసారి నాయకులతో సమీక్ష..
కుప్పం ఫలితాలను కూడా యథావిధిగా అధికార పార్టీ అక్రమాలంటూ కొట్టిపారేశారు చంద్రబాబు. అక్కడ వైసీపీ గెలవలేదని, ప్రజాస్వామ్యం ఓడిందని చెప్పిన బాబు, పోలీసులు, ఎన్నికల సిబ్బంది.. అందరూ కలసి వైసీపీ అభ్యర్థుల గెలుపునకు కారణమయ్యారని ఆరోపించారు. అలా ఓటమికి కారణాలు వెతుక్కున్న బాబు.. పార్టీ పరిస్థితి చూసి దిగాలు పడ్డారు. పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తానని, కొత్తవారికి అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తానని చెప్పారు. ఇన్నాళ్లూ సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా రాష్ట్రంకోసం పాటుపడ్డానని అది తాను చేసిన తప్పేనంటూ క్షమాపణలు అడిగారు.
సోషల్ మీడియాలో హడావిడి చేయాలంటూ ఉపదేశం..
సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు క్రియాశీలకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. కుప్పంలో ‘ఐ టీడీపీ’ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమై దిశా నిర్దేశం చేశారు. అధికార పార్టీ నాయకులు సామాజిక మాధ్యమాల ద్వారా చేసే అసత్యాలను తిప్పికొట్టాలని చెప్పారు బాబు.
పెదబాబే కాదు, చినబాబు కూడా..
జూనియర్ ఎన్టీఆర్ ని కుప్పం కి తీసుకురావాలని కొంతమంది కార్యకర్తలు చేసిన హడావిడితో కంగారు పడిన బాబు.. ఇకపై తరచూ కుప్పం కి లోకేష్ వస్తారని వారికి భరోసా ఇచ్చారు. ముఖ్య నాయకులు కూడా నెలకోసారి కుప్పం వచ్చి సమీక్షలు చేపడతారని, కార్యకర్తలకు అండగా ఉంటారని ధైర్యం చెప్పారు. మొత్తమ్మీద మూడు రోజులపాటు కుప్పంలో పర్యటించిన చంద్రబాబు ఆత్మస్తుతి, పరనిందతోపాటు.. పార్టీపై దృష్టిపెట్టారనే విషయం స్పష్టమవుతోంది. కుప్పంలో మరింత నష్టం జరక్కముందే పార్టీని చక్కదిద్దే ప్రయత్నాలు మొదలు పెట్టారు.