బీజేపీ-జనసేన.. ఎడబాటు నిజమేనా..?
బీజేపీ, జనసేన కాపురం ఎక్కువరోజులు సజావుగా సాగే అవకాశం లేదని గతంలోనే ఊహాగానాలు వినిపించాయి. ఏ పని చేసినా ఉమ్మడిగా చేస్తాం, ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తాం అని రెండు పార్టీలు పదే పదే ప్రకటిస్తున్నా.. అమలు తీరులో మాత్రం ఎవరికి వారే, యమునా తీరే. పంచాయతీ ఎన్నికల విషయంలోనే రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతోందనే విషయం స్పష్టంగా తెలిసింది. పవన్ కల్యాణ్ సహా, జనసేన కీలక నేతలు పంచాయతీల్లో తమ బలాన్ని ఘనంగా చెప్పుకుంటున్నారు. వేల […]

బీజేపీ, జనసేన కాపురం ఎక్కువరోజులు సజావుగా సాగే అవకాశం లేదని గతంలోనే ఊహాగానాలు వినిపించాయి. ఏ పని చేసినా ఉమ్మడిగా చేస్తాం, ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తాం అని రెండు పార్టీలు పదే పదే ప్రకటిస్తున్నా.. అమలు తీరులో మాత్రం ఎవరికి వారే, యమునా తీరే. పంచాయతీ ఎన్నికల విషయంలోనే రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతోందనే విషయం స్పష్టంగా తెలిసింది. పవన్ కల్యాణ్ సహా, జనసేన కీలక నేతలు పంచాయతీల్లో తమ బలాన్ని ఘనంగా చెప్పుకుంటున్నారు. వేల సంఖ్యలో పంచాయతీలు గెలిచామని, దానికంటే రెట్టింపు సంఖ్యలో రెండో స్థానంలో నిలిచామని అంటున్నారు పవన్ కల్యాణ్. అయితే ఆయా స్థానాల్లో బీజేపీ మద్దతిచ్చిందా, లేక బీజేపీకి తాము మద్దతిచ్చామా అనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ మాటకొస్తే బీజేపీ, జనసేన ఉమ్మడి విజేతలు అంటూ ఎవరూ లేరు. ఎవరి స్కోర్ వారు విడివిడిగానే చెప్పుకుంటున్నారు.
తిరుపతితో తకరారు మొదలైందా..?
తిరుపతి ఉప ఎన్నికల విషయంలో రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలున్నాయని, అందుకే ఇటీల ఉమ్మడి సమావేశాలేవీ జరగలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిపై అమరావతి జేఏసీ నేత చెప్పుతో దాడి చేసిన విషయంలో కూడా జనసేన నుంచి స్పందన శూన్యం. ఈ వ్యవహారంలో ఏబీఎన్ ఛానెల్ లో పెట్టే చర్చలకు వెళ్లొద్దంటూ బీజేపీ నేతలకు హుకుం జారీ చేశారు అధినేతలు. అదే సమయంలో జనసేన నేతలు మాత్రం సదరు టీవీ డిబేట్ లకు వెళ్తున్నారు. అంతే కాదు, విష్ణువర్ధన్ రెడ్డికి పరామర్శ కానీ, ఆ దాడిని ఖండించడం కానీ జనసేన చేయలేదు. కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా స్పందించలేదు. రెండు పార్టీల మధ్య ఎడబాటు ఉందనడానికి ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలి.
పవన్ పై విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇవ్వదా..?
అటు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం బాగా ముదిరింది. నువ్వు ఆకు రౌడీవి అంటే, నువ్వు స్టేట్ రౌడీవి అంటూ ఇద్దరూ తీవ్రంగా విమర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అటు బీజేపీ తరపున ఈ గొడవపై స్పందన శూన్యం.
వాస్తవానికి బీజేపీ-జనసేన వేరు వేరు అని చెప్పుకోడానికి, ఇలాంటి ఘటనలు ఆ రెండు పార్టీలకు అవకాశాలను ఇచ్చాయి. జనసేనపై విమర్శలు వస్తే బీజేపీ కలుగజేసుకోవడం, బీజేపీ నేతలపై దాడి జరిగితే జనసైనికులు ఖండించడం.. లాంటివి జరిగితేనే ఆ రెండు పార్టీల మధ్య స్నేహం బలంగా ఉన్నట్టు అర్థమవుతుంది. అది జరిగితేనే కార్యకర్తల మధ్య సమన్వయం పెరిగి ఉమ్మడి బలం మరింత పెరుగుతుంది. అయితే రెండు పార్టీలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.