Telugu Global
National

సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ బెంగాల్ జాతకాలు మారుస్తుందా..?

ఎన్నికల ఫలితాలను, ఎన్నికల కమిషన్ కానీ, ఎన్నికల కమిషనర్ కానీ ప్రభావితం చేయలేరని, కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చినా, ప్రజాబలం ఉన్న పార్టీకే ఫలితాలు అనుకూలంగా వస్తాయ‌ని ఏపీ పంచాయతీ ఎన్నికలు రుజువు చేశాయి. పంచాయతీ ఎన్నికలే కాదు, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలైనా ఇదే జరుగుతుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కూడా ఎన్నికల కమిషనర్ పక్షపాత ధోరణితో వ్యవహరించారని, అందుకే సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సీఎం […]

సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ బెంగాల్ జాతకాలు మారుస్తుందా..?
X

ఎన్నికల ఫలితాలను, ఎన్నికల కమిషన్ కానీ, ఎన్నికల కమిషనర్ కానీ ప్రభావితం చేయలేరని, కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చినా, ప్రజాబలం ఉన్న పార్టీకే ఫలితాలు అనుకూలంగా వస్తాయ‌ని ఏపీ పంచాయతీ ఎన్నికలు రుజువు చేశాయి. పంచాయతీ ఎన్నికలే కాదు, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలైనా ఇదే జరుగుతుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కూడా ఎన్నికల కమిషనర్ పక్షపాత ధోరణితో వ్యవహరించారని, అందుకే సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సీఎం మమతా బెనర్జీ వర్గం ఆరోపిస్తోంది. ఎన్నికల ప్రక్రియ ఎన్నాళ్లు జరిగినా, ఎలా జరిగినా, ప్రజాభిప్రాయం మార్పు వస్తుందా.. ? సీఈసీ ఇచ్చిన సుదీర్ఘ ప్రక్రియ వల్ల మమతాకు నష్టం కలుగుతుందా..?

దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. పశ్చిమబెంగాల్ విషయంలో మాత్రం సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియను సిద్ధం చేసింది. 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో మూడు దఫాలు పోలింగ్ జరుగుతుంది, 140 స్థానాలున్న కేరళలో ఒకే ఒక్క దశలో పోలింగ్ ముగుస్తుంది. 234 స్థానాలున్న తమిళనాడులో కూడా ఒకేదశ పోలింగ్ కి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే 294 స్థానాలున్న పశ్చిమబెంగాల్ కి మాత్రం మొత్తం 8 దశల్లో పోలింగ్ జరిగేలా షెడ్యూల్ ఇచ్చింది. దీంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల కమిషనర్ పై నిప్పులు చెరిగారు. మోదీ, అమిత్ షా కనుసన్నల్లో సీఈసీ పనిచేస్తున్నారని, అందుకే 8 దశలకు ఓకే చెప్పారని మండిపడ్డారు. ఫలితాలు తారుమారు చేసేందుకు, ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఈ సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ బీజేపీకి ఉపయోగపడుతుందని అన్నారామె.

వాస్తవాలివీ..
294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమబెంగాల్ లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా సుదీర్ఘంగానే ఆ ప్రక్రియ చేపట్టిన ఉదాహరణలున్నాయి. 2016లో ఏప్రిల్ 4న మొదలైన అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మే 5న ముగిసింది. మే 19న ఫలితాలొచ్చాయి. ఆరు దశల్లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఉన్నా కూడా మమతా బెనర్జీ రెండోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. అంతెందుకు 2011లో కూడా ఆరు దశల్లో అక్కడ ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 18న మొదలై మే10తో పోలింగ్ ముగిసింది, మే 13న వచ్చిన ఫలితాల్లో తృణమూల్ విజయకేతనం ఎగరేసింది. తొలిసారి దీదీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. మరిప్పుడు దీదీ ఎందుకు గాబ‌రా పడుతున్నారు. ఇప్పుడు కూడా మార్చి 27తో మొదలైన పోలింగ్ ఏప్రిల్ 29తో ముగుస్తుంది. నెలరోజుల ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘమైనదే అయినా, పశ్చిమబెంగాల్ రాజకీయ, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఆ విధంగా కసరత్తు చేసింది. అయితే కేంద్రం సుదీర్ఘ ప్రక్రియతో తనను దెబ్బతీయాలని చూస్తోందనేది మమత వాదన, దానికి సీఈసీ సహకరిస్తున్నారనేది ఆమె ఆరోపణ. ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. ప్రజాబలం ఉన్న పార్టీకే సీట్లు దక్కుతాయనే మాట మాత్రం వాస్తవం. 2016లో వెస్ట్ బెంగాల్ లో సింగిల్ అసెంబ్లీ సీటు సాధించలేని బీజేపీ, 2019 ఎన్నికలనాటికి 42 ఎంపీ స్థానాల్లో 18చోట్ల విజయం సాధించి సత్తా చూపించింది. అసెంబ్లీ పోరులో ఆ ఫలితాలు రిపీట్ అవుతాయా లేదా అనేది తేలాల్సి ఉంది. ఒపీనియన్ పోల్స్ చూస్తే మమతాకే కాస్త ఎడ్జ్ ఉన్నా, బీజేపీతో గట్టిపోటీ ఉంటుందనేది ఖరాఖండిగా తేలిపోయింది. ఈ దశలో ఎన్నికల ప్రక్రియలో గోల్ మాల్ చేసి బీజేపీ అధికారం చేజిక్కించుకుంటుందేమోననేది మమతా అనుమానం. మొత్తమ్మీద నెలరోజులపాటు జరిగే ఎన్నికలు, అంతకు నెలముందే విడుదలైన నోటిఫికేషన్.. వెరసి పశ్చిమ బెంగాల్ లో రెండు నెలలపాటు రాజకీయ రణక్షేత్రాన్ని ప్రజల ముందు నిలబెట్టబోతున్నాయి.

First Published:  27 Feb 2021 12:43 PM IST
Next Story