ఉక్కు సంకల్పం సడలినట్టేనా..?
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు సాగర తీరంలో గర్జించాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టం చేశాయి. ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానానికి సై అంది, సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖాస్త్రాలు సంధించారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకం అంది, మోదీని ఒప్పించయినా ప్రైవేటీకరణ ఆపేస్తానని అన్నారు జనసేనాని పవన్ కల్యాణ్, ఇక వామపక్షాలు ఏకంగా ఉద్యోగ సంఘాలతో కలసిపోయి ప్రత్యక్ష […]
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు సాగర తీరంలో గర్జించాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టం చేశాయి. ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానానికి సై అంది, సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖాస్త్రాలు సంధించారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకం అంది, మోదీని ఒప్పించయినా ప్రైవేటీకరణ ఆపేస్తానని అన్నారు జనసేనాని పవన్ కల్యాణ్, ఇక వామపక్షాలు ఏకంగా ఉద్యోగ సంఘాలతో కలసిపోయి ప్రత్యక్ష కార్యాచరణకు దిగాయి. అయితే రోజులు గడిచే కొద్దీ.. విశాఖ ఉక్కు ఉద్యమం కాస్తా నీరుగారిపోతున్నట్టు అర్థమవుతోంది. నిరసనల హోరు తగ్గింది, మెల్లగా రాజకీయ పార్టీలన్నీ విశాఖ విషయం పక్కనపెట్టేసి, స్థానిక ఎన్నికల సమరంపై పూర్తిగా ఫోకస్ పెట్టాయి.
అప్పటి కమిట్ మెంట్ ఇప్పుడుఉందా..?
విశాఖలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పుతామని హామీ ఇచ్చి, పక్క రాష్ట్రాలకు తరలించుకుపోయే దిశగా కేంద్రం ఆలోచించిన సందర్భంలో.. రాష్ట్రమంతా అట్టుడికింది. ఆత్మబలిదానాలు, అల్లర్లు, నిరాహార దీక్షలు, రాజీనామాలు.. ఇలా రాష్ట్రమంతా ఏకతాటిపైకి వచ్చి కేంద్రాన్ని గడగడలాడించి మరీ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకుంది. అయితే ఇప్పుడా పరిస్థితులు లేవు. ముఖ్యంగా ప్రజలు ఉద్యమానికి దూరంగా ఉన్నారు. విశాఖలో కూడా అది కేవలం ఉద్యోగుల అరణ్యరోదనగానే మిగిలిపోయింది. రాజకీయ పార్టీలు కూడా ఎవరి అజెండా ప్రకారం వారు వేర్వేరుగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామంటూ చెప్పుకుంటున్నారు. పనిలో పనిగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు కూడా. స్థానిక ఎన్నికల పుణ్యమా అని.. రాజకీయ పార్టీలు తమ ఆధిపత్యంకోసం పావులు కదుపుతున్నాయి, ఉక్కు సంకల్పాన్ని లైట్ తీసుకున్నాయి.
కేంద్రం తేల్చేసిన తర్వాత పోరాడితే ఏమొస్తుంది..?
దాదాపు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నప్పుడు, ఒక్క ఉక్కు కర్మాగారం విషయంలో ఏపీ ప్రజల మాటను మన్నిస్తుంది అనుకోవడంలో అర్థం లేదు. ఆరు నూరైనా అన్నీ ప్రైవేటీకరిస్తాం, వ్యాపారం ప్రభుత్వం పని కాదని ప్రధాని మోదీ పదే పదే తేల్చి చెబుతున్నారు. ఈ దశలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో ఫలితం లేదని ప్రజలు కూడా ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఉద్యోగులు కూడా నమ్మకం లేకుండానా నామమాత్రంగా పోరాటంలో పాల్గొంటున్నారు. బడ్జెట్ లో కేంద్రం ప్రతిపాదన బయటకి వచ్చినప్పుడు ఉన్న వేడి ఇప్పుడు లేదు. రోజు రోజుకీ విశాఖ ఉక్కు సంకల్పం సడలిపోతోంది, చల్లారిపోతోంది.