Telugu Global
National

మీరు కేసు పెడితే, మేము సీబీఐని వదులుతాం.. రసవత్తరంగా బెంగాల్ రాజకీయం..

దేశవ్యాప్తంగా ఇప్పుడు పశ్చిమబెంగాల్ ఎన్నికలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. మమతా బెనర్జీని ఢీకొట్టడానికి, బెంగాల్ ని హస్తగతం చేసుకోడానికి బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అటు దీదీ అంతే గట్టిగా కేంద్రాన్ని ఢీకొడతానంటోంది. అయితే బెంగాల్ విషయంలో బీజేపీ చేస్తున్న రాజకీయమే తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కేంద్రం హోం మంత్రి అమిత్‌ షాకు నోటీసులు జారీ అయిన రెండు రోజులకే, అభిషేక్ భార్య, మరదలికి […]

మీరు కేసు పెడితే, మేము సీబీఐని వదులుతాం.. రసవత్తరంగా బెంగాల్ రాజకీయం..
X

దేశవ్యాప్తంగా ఇప్పుడు పశ్చిమబెంగాల్ ఎన్నికలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. మమతా బెనర్జీని ఢీకొట్టడానికి, బెంగాల్ ని హస్తగతం చేసుకోడానికి బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అటు దీదీ అంతే గట్టిగా కేంద్రాన్ని ఢీకొడతానంటోంది. అయితే బెంగాల్ విషయంలో బీజేపీ చేస్తున్న రాజకీయమే తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కేంద్రం హోం మంత్రి అమిత్‌ షాకు నోటీసులు జారీ అయిన రెండు రోజులకే, అభిషేక్ భార్య, మరదలికి సీబీఐ సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మీరు పరువునష్టం కేసు వేస్తే, నేను సీబీఐని వదులుతా అన్నట్టుంది అమిత్ షా వ్యవహారం. బొగ్గు స్మగ్లింగ్‌ కేసులో అభిషేక్‌ భార్య రుజిరా బెనర్జీ, మరదలు మేనకా గంభీర్ కి సీబీఐ సమన్లు జారీ చేసింది. బొగ్గు స్మగ్లింగ్‌ కేసులో గత ఏడాది నవంబర్‌లో కొందరు అధికారులపై కూడా ఎఫ్ఐఆర్ దాఖలైన విషయం తెలిసిందే.

వలసలతో విలువలకు తిలోదకాలు..
ప్రస్తుతం పశ్చిమబెంగాల్ బీజేపీలో సగానికి సగం మంది తృణమూల్ కాంగ్రెస్ నుంచి లాక్కున్నవాళ్లే. నయానో భయానో ఎన్నికలకు ముందే అందర్నీ తమవైపు తిప్పేసుకుంది బీజేపీ, మానసికంగా దీదీని దెబ్బ కొట్టాలని చూసింది. ఓ దశలో ఇక వలసలు చాలు, తృణమూల్ నుంచి ఇంకెవరూ మాకొద్దు అంటూ సీనియర్లు స్టేట్ మెంట్ ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అవసరం ఉన్నవారిని, లేనివారిని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని.. అందర్నీ బీజేపీలో కలిపేసుకున్నారు కేంద్ర పెద్దలు.

దీదీ తక్కువ తిన్నారా..?
కేంద్రానికి ధీటుగా బదులిస్తూ ఎక్కడా తగ్గేది లేదని అంటున్నారు దీదీ మమతా బెనర్జీ. ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్.. వంటి పథకాలకు బెంగాల్ లో ఎంట్రీ లేకుండా చేశారు. రైతుచట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ప్రత్యక్షంగానే మద్దతు తెలిపారు. బెదిరింపులకు తాను గానీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ గానీ భయపడే ప్రసక్తే లేదని అంటున్న మమతా బెనర్జీ, తన మాతృభాష బంగ్లా.. తనకు పులిలా పోరాడడమే నేర్పిందని, ఎలుకలకు తాను భయపడనని స్పష్టం చేశారు. సీబీఐ కేసులతో బీజేపీకి ఒరిగేదేమీ లేదని అన్నారామె.

లోక్ సభ ఫలితాలు రిపీట్ అవుతాయా..?
2016 అసెంబ్లీ ఎన్నికల్లో 291 సీట్లలో పోటీ చేసి కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ, 2019 సార్వత్రిక ఎన్నికలనాటికి 42 లోక్ సభ సీట్లకు గాను 18చోట్ల గెలిచి సత్తా చూపింది. బీజేపీపై టీఎంసీ కి వచ్చిన మార్జిన్ ఓట్లు కేవలం 3శాతం మాత్రమే. అప్పటినుంచీ బీజేపీకి బెంగాల్ పై నమ్మకం కుదిరింది. కమ్యూనిస్ట్ ల కంచుకోటను దీదీ బద్దలు కొట్టినట్టుగానే, ఆమె సామ్రాజాన్ని జీజేపీ చిన్నాభిన్నం చేస్తుందని అంచనా వేశారు. ఇటీవల ఒపీనియన్ పోల్స్ కూడా బీజేపీ బలం పెరిగిందని చెబుతున్నా.. మేజిక్ ఫిగర్ మాత్రం ఆ పార్టీ అందుకోలేదని, కాంగ్రెస్, వామపక్షాలు సపోర్ట్ చేస్తే మళ్లీ మమతాయే బెంగాల్ సీఎం అవుతారని తేల్చి చెప్పాయి. దీంతో బీజేపీ మరింత దూకుడు పెంచింది. తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమైంది. ఈ దశలో సీబీఐ లాంటి అస్త్రాలు బయటకు తీయడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. కేంద్రానికి ఎదురు తిరిగితే సీబీఐ ఎంక్వయిరీ అనే వ్యవహారాన్ని మొదలు పెట్టింది కాంగ్రెస్ అయితే, దాన్ని అత్యంత చాకచక్యంగా ఉపయోగించుకుంది మాత్రం బీజేపీయే. ఇప్పుడు బెంగాల్ ఎన్నికల వేళ, సీబీఐ పేరుతో తృణమూల్ నేతల్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. ఇది బీజేపీకి లాభమా, నష్టమా అనే విషయం మాత్రం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనే తెలుస్తుంది.

First Published:  21 Feb 2021 9:58 PM GMT
Next Story