Telugu Global
National

చిరపుంజిలో వర్షం వెలుస్తోంది

ప్రపంచంలోనే అత్యంత తడిగా ఉండే ప్రాంతం, అధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో ఇప్పుడు వర్షం కరువైంది. హిందూ మహాసముద్ర ఉష్ణోగ్రతలో మార్పులే ఈ ప్రాంతంలోని వర్షపాతంపై భారీ ప్రభావాన్ని చూపుతాయని పరిశోధకులు గుర్తించారు. నిశ్శబ్దంగా, నిద్రావస్థలో ఉన్నట్టు ఎప్పుడూ వర్షంతో తడుస్తూ ఉండే చిరపుంజి గ్రామానికి ప్రపంచంలోనే అత్యంత తేమతో ఉండే గ్రామంగా పేరుంది. ఇక్కడ సంవత్సరంలో 10,000 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురుస్తుంది. గత వందేళ్లలో ఇక్కడి వర్షపాత తీరును పరిశీలించిన అధ్యయన కారులు.. ఇక్కడ […]

చిరపుంజిలో వర్షం వెలుస్తోంది
X

ప్రపంచంలోనే అత్యంత తడిగా ఉండే ప్రాంతం, అధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో ఇప్పుడు వర్షం కరువైంది. హిందూ మహాసముద్ర ఉష్ణోగ్రతలో మార్పులే ఈ ప్రాంతంలోని వర్షపాతంపై భారీ ప్రభావాన్ని చూపుతాయని పరిశోధకులు గుర్తించారు.

నిశ్శబ్దంగా, నిద్రావస్థలో ఉన్నట్టు ఎప్పుడూ వర్షంతో తడుస్తూ ఉండే చిరపుంజి గ్రామానికి ప్రపంచంలోనే అత్యంత తేమతో ఉండే గ్రామంగా పేరుంది. ఇక్కడ సంవత్సరంలో 10,000 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురుస్తుంది. గత వందేళ్లలో ఇక్కడి వర్షపాత తీరును పరిశీలించిన అధ్యయన కారులు.. ఇక్కడ రానురాను వర్షపాతం తగ్గుతుందని గుర్తించారు. ఈ మార్పుకి హిందూ మహాసముద్ర ఉష్ణోగ్రతలో మార్పులే కారణమని వాళ్ల అధ్యయనంలో తేలింది.

వందేళ్లుగా వర్షపాతాన్ని స్టడీ చేస్తున్న వారు.. శాటిలైట్ డేటాను కూడా విశ్లేషించారు. అయితే గత రెండు దశాబ్దాలలో ఈశాన్య భారతదేశంలో వృక్షసంపదలో భారీ తగ్గింపు ఉందని, దీనివల్ల వర్షపాతంలోనే కాక మానవ జీవితంపై కూడా ప్రభావం ఉందని వాళ్లంటున్నారు.

ఆయా ప్రాంతాల్లో జుమ్ సాగు లేదా షిఫ్టింగ్ సాగు అని పిలువబడే సాంప్రదాయ సాగు విధానం ఇప్పుడు తగ్గింది. అలాగే రకరకాల కారణాల వల్ల అక్కడ అటవీ నిర్మూలన జరుగుతుంది. వృక్షసంపద తగ్గడం, పంట భూముల విస్తీర్ణం తగ్గడం ప్రధానంగా 2006 సంవత్సరం నుండి పెరిగింది అని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ నుండి జయనారాయణన్ కుట్టిప్పురత్ చెప్పారు. 1973–2019 కాలానికి వార్షిక సగటు వర్షపాతం దశాబ్దానికి 0.42 మి.మీ. తగ్గుతుందని స్టడీలు వెల్లడించాయని అధ్యయన బృందం గుర్తించింది. ఈ ప్రభావం అగర్తాలా, గువహతి, కైలాషాహర్, పసిఘాట్, షిల్లాంగ్, సిల్చార్.. లాంటి ప్రాంతాలపై కూడా ఉంది.

అయితే ఈశాన్య ప్రాంతం ఎక్కువగా కొండ, పెద్ద పెద్ద మైదానాల విస్తరణలతో కూడి ఉన్నందున ఈ ప్రాంతం ప్రాంతీయ, ప్రపంచ వాతావరణంలో మార్పులకు అత్యంత సున్నితమైనదని బృందం చెప్తుంది.
ఈ బృందం ప్రస్తుతం భారతదేశం అంతటా వర్షపాతం యొక్క మార్పులను పరిశీలిస్తోంది. “మేము ఈశాన్యంలోని వృక్షసంపద లేదా అటవీ ప్రాంతం, జీవవైవిధ్య ఉద్యానవనాలు, కొండలు, లోయలను పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అలాగే, నీటి వనరులు, భూగర్భ జలాల వాతావరణ-ప్రేరిత మార్పులను ఎదుర్కోవడానికి ఘన నీటి నిర్వహణ వ్యూహాలు అనివార్యం. దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం” అని ప్రొఫెసర్ కుట్టిప్పురత్ చెప్పారు.

First Published:  21 Feb 2021 8:06 AM IST
Next Story