స్వరం పెంచిన జగన్.. కేంద్రాన్ని ఇరుకున పెట్టారా..?
ప్రధాని అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరిగిన నీతిఆయోగ్ పాలకమండలి సమావేశంలో ఏపీ సీఎం జగన్ స్వరం పెంచారు. నీతిఆయోగ్ మీటింగ్ లో ఏపీ సీఎంతోపాటు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో జగన్ లేవనెత్తిన అంశాలు కేంద్రంపై పరోక్షంగా ఒత్తిడి పెంచేలా ఉన్నాయి. అదను చూసి ప్రత్యేక హోదా ప్రస్తావన.. రాష్ట్ర విభజనతో నవ్యాంధ్ర నష్టపోయిందని, దీనికి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక హోదా ఇస్తామని విభజన సమయంలో నాటి ప్రధాని పార్లమెంట్ సాక్షిగా […]
ప్రధాని అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరిగిన నీతిఆయోగ్ పాలకమండలి సమావేశంలో ఏపీ సీఎం జగన్ స్వరం పెంచారు. నీతిఆయోగ్ మీటింగ్ లో ఏపీ సీఎంతోపాటు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో జగన్ లేవనెత్తిన అంశాలు కేంద్రంపై పరోక్షంగా ఒత్తిడి పెంచేలా ఉన్నాయి.
అదను చూసి ప్రత్యేక హోదా ప్రస్తావన..
రాష్ట్ర విభజనతో నవ్యాంధ్ర నష్టపోయిందని, దీనికి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక హోదా ఇస్తామని విభజన సమయంలో నాటి ప్రధాని పార్లమెంట్ సాక్షిగా బేషరతుగా ప్రకటించారని, నీతి ఆయోగ్ సమావేశంలో గుర్తు చేశారు జగన్. టైర్-1 సిటీ ఏపీలో ఒక్కటి కూడా లేదని, మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పనతో పాటు, రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా పుంజుకోవాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పారు. తగినంత ఎంపీల బలం ఉంటే కేంద్రాన్ని ప్రత్యేక హోదా విషయంలో నిలదీయొచ్చని గతంలోనే ప్రకటించారు సీఎం జగన్. అయితే ఎన్డీఏకి పూర్తి స్థాయి మెజార్టీ రావడంతో ఏపీ ఎంపీల ఒత్తిడి ఫలించే అవకాశమే లేదు. దీంతో అప్పటినుంచి కేవలం విన్నపాలతోనే సరిపెట్టిన జగన్.. అదను చూసి ఇలా నీతిఆయోగ్ సమావేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాలకు కూడా ఏపీ కష్టాలను పరోక్షంగా వివరించారు, ఏపీకి జరిగిన మోసాన్ని కళ్లకు కట్టారు.
వడ్డీరేట్లు, విద్యుత్ ఛార్జీల భారం తగ్గించాలి..
ఏపీతో సహా ఇతర రాష్ట్రాలు ఎదుర్కొంటున్న కష్టాలను, కేంద్రం మరింత సహకారం అందించాల్సిన అవసరాన్ని నీతి ఆయోగ్ సమావేశంలో కుండబద్దలు కొట్టారు జగన్. దేశాన్ని ఉత్పత్తి, తయారీ రంగాలకు కేంద్రంగా మార్చాలన్న లక్ష్యానికి.. అధిక వడ్డీలు, అధిక విద్యుత్ ఛార్జీలు, భూసేకరణలో జాప్యం, అనుమతుల మంజూరులో ఇబ్బందులు అవరోధంగా మారాయని చెప్పారు జగన్. పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ వంటి సంస్థల నుంచి తీసుకున్న రుణానికి రాష్ట్ర ప్రభుత్వాలే 10-11% వడ్డీ కడుతున్నాయని, ఈ దశలో.. ప్రైవేటు రంగం పరిస్థితి అర్థం చేసుకోవచ్చని చెప్పారు. తయారీ రంగంలో ముందున్న దేశాల్లో వడ్డీ రేట్లు 2నుంచి 3శాతానికి మించి లేవని, విద్యుత్ చార్జీలు కూడా యూనిట్ కి రూ.3 కంటే తక్కువగానే ఉన్నాయని గుర్తు చేశారు. కేంద్రం భారం మోపుతూ.. ఉత్పత్తి రంగం పడకేసింది అనడం సరికాదని తేల్చి చెప్పారు.
పోలవరంపై ఒత్తిడి..
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల్ని కేంద్రం వెంటనే ఆమోదించాలని ఈ సమావేశంలో కోరారు జగన్. అటు రైతు సమస్యలను కూడా ప్రస్తావించారు. నాణ్యమైన, ధ్రువీకరించిన ఎరువులు, పురుగు మందుల్నే అందుబాటులోకి తేవాలని, రైతులు తమ పంటల్ని సరైన ధరకు పొలం వద్దే అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు తక్కువ వడ్డీకే రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు అందేలా చూడాలన్నారు. సోలార్ విద్యుత్ ఉత్తత్తి విషయంలో జాతీయ స్థానంలో ఒక విధానం రూపొందించి, రుణాలపై వడ్డీలు తగ్గించాలని కోరారు. పనిలో పనిగా.. వైద్య రంగంలో అమలు చేస్తున్న నాడు-నేడు పనులని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు జగన్. 16 మెడికల్ కాలేజీలు, 10 వేలకు పైగా విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని కోరుతూనే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే వీటన్నిటికీ ప్రత్యేక కేటాయింపులు అవసరం లేదనే విషయాన్ని కేంద్రానికి గుర్తు చేశారు జగన్.