Telugu Global
NEWS

ఎక్కడ ఆగాయో అక్కడినుంచే.. పరిషత్ ఎన్నికలపై నిమ్మగడ్డ క్లారిటీ..

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి, మార్చి 10న మున్సిపోల్స్ కి కూడా రంగం సిద్ధమైంది. ఇక ఆగిపోయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ నిర్ణయం వెలువడాల్సి ఉంది. పరిషత్ ఎన్నికలను కూడా మున్సిపోల్స్ లాగానే ఆగినచోటనుంచే ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈమేరకు ఆయన కలెక్టర్లకు ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పష్టత వచ్చింది. మున్సిపోల్స్ విషయంలో నామినేషన్ల విత్ డ్రా జరగలేదు కాబట్టి ఏకగ్రీవాల సమస్య లేదు. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీల […]

ఎక్కడ ఆగాయో అక్కడినుంచే.. పరిషత్ ఎన్నికలపై నిమ్మగడ్డ క్లారిటీ..
X

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి, మార్చి 10న మున్సిపోల్స్ కి కూడా రంగం సిద్ధమైంది. ఇక ఆగిపోయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ నిర్ణయం వెలువడాల్సి ఉంది. పరిషత్ ఎన్నికలను కూడా మున్సిపోల్స్ లాగానే ఆగినచోటనుంచే ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈమేరకు ఆయన కలెక్టర్లకు ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పష్టత వచ్చింది. మున్సిపోల్స్ విషయంలో నామినేషన్ల విత్ డ్రా జరగలేదు కాబట్టి ఏకగ్రీవాల సమస్య లేదు. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికలు ఆ స్థాయి దాటి ఏకగ్రీవాల వరకు వెళ్లాయి. రాష్ట్రంలో 2248 ఎంపీటీసీలు, 125 జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఈ ఏకగ్రీవాలపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇవన్నీ బలవంతపు ఏకగ్రీవాలని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ రద్దు చేయకుండా, ఆయా ఏకగ్రీవాలను పూర్తి స్థాయిలో ధృవీకరించకుండా ఓ మెలిక పెట్టింది. నామినేషన్లు ఉపసంహరించకున్నవారికి మరో అవకాశం ఇచ్చింది. దౌర్జన్యాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్ ఉపసంహరించుకున్నామని, తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్లను కలిసే అవకాశం కల్పించింది. ఉపసంహరించుకున్న అభ్యర్థుల్లో ఎవరైనా తగిన ఆధారాలతో కలెక్టర్లను కలిస్తే వారికి మరో అవకాశం ఇచ్చే విషయంలో తుది నిర్ణయం ఈసీ తీసుకుంటుంది. అంటే దాదాపుగా ఇది మరో నోటిఫికేషన్ అన్నమాటే. అయితే కొత్తగా నోటిఫికేషన్ ఇస్తే అందరికీ అవకాశం ఉంటుంది, పాత నోటిఫికేషన్ నే కొనసాగిస్తూ ఇలా కొత్తగా అవకాశం ఇస్తే మాత్రం. గతంలో నామినేషన్ వేసి ఉపసంహరించుకున్న అభ్యర్థులకే ప్రయోజనం. అది కూడా తమని బలవంతం చేశారని సాక్ష్యాధారాలు చూపించాలి.

ఏది సాక్ష్యం.. ఏది రుజువు..?
ఏకగ్రీవం, బలవంతపు ఏకగ్రీవం.. ఈ రెండిటికీ తేడా ఎవరూ చెప్పలేదు. అసలు ఏకగ్రీవం అంటేనే.. రెండో వ్యక్తి నయానో భయానో దారికొచ్చినట్టు లెక్క. నామినేషన్ వేసేందుకు ఉత్సాహంగా వెళ్లిన వ్యక్తి దాన్ని ఉపసంహరించుకున్నారంటే అర్థం ఏంటి..? ప్రజా ప్రయోజనాలపై ప్రేమ పొంగుకొచ్చి, ఎన్నిక అవసరం లేదని, తనకంటే ప్రత్యర్థే సరైన వ్యక్తి అని నమ్మి ఉపసంహరించుకున్నారంటే ఎవరూ నమ్మే రోజులు కావు. ప్రలోభాలకు లొంగి ఉండాలి, లేదా భవిష్యత్ పై భయమయినా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లోనే ఏకగ్రీవాలు కుదురుతాయి. ఇలాంటి వాటికి రుజువులు చూపించాలంటే ఎవరి తరం కాదు. మీడియాలో వచ్చిన వార్తల్ని ఆధారంగా తీసుకుంటామని ఈసీ ఓ ఆప్షన్ ఇచ్చినా.. అది బాబు మీడియానా, జగన్ మీడియానా అని ఆరా తీసే పరిస్థితి. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా దేన్నీ నిర్థారించుకోలేం. అంటే దాదాపుగా బలవంతపు ఉపసంహరణలు అనే వాటికి అర్థమే లేదు. ఒకవేళ ఎవరైనా అలా ఫిర్యాదు చేయడానికి వచ్చినా.. ఆ మాటపై నిలబడతారని గ్యారెంటీ కూడా లేదు. ఒకసారి భయపడి ఉపసంహరించుకున్నారు, రెండోసారి పోటీ చేస్తారని ఎలా అనుకోవాలి? అంటే కలెక్టర్లకు ఫిర్యాదులు, వాటి ఆధారంగా విచారణ అంటే సాధ్యమయ్యే పని కాదని తేలిపోతోంది. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో పంచాయతీ ఏకగ్రీవాలపై కూడా ఇలాగే కలెక్టర్లు విచారణ జరిపారు. చివరకు ఒక్క చోట కూడా బలవంతపు ఏకగ్రీవాలు లేవని తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని అంటున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకున్నవారికి మరో అవకాశం ఇచ్చినా కూడా.. యథావిధిగానే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మున్సిపోల్స్ లాగానే ఎక్కడ ఆగిందో అక్కడే అన్న ప్రాతిపదికన పరిషత్ ఎన్నికలు కూడా మొదలవుతాయి.

First Published:  18 Feb 2021 10:58 PM GMT
Next Story