Telugu Global
National

చమురు ధరలపై బీజేపీ చేతులెత్తేసినట్టేనా..?

యూపీఏ హయాంలో చమురు ధరలు పదిపైసలు, పావలా పెరిగితేనే రోడ్లపైకి వచ్చి నానా హంగామా చేసేవారు బీజేపీ నేతలు. ఇక గ్యాస్ సిలిండర్ల రేటు పెరిగితే బీజేపీ చేసిన హడావిడి ఇప్పటికీ ఎవరూ మరచిపోలేదు. మరి అదే బీజేపీ అధికారంలోకి వస్తే సహజంగానే రేట్లు తగ్గుతాయని ప్రజలు ఆశపడతారు. పోనీ జనం ఆశపడినట్టు తగ్గకపోయినా పర్లేదు, మరీ సామాన్యుడికి అందనంతగా పెరగడమే ఇప్పుడు విచిత్రం. పెట్రోల్ రేటు ఏకంగా 100 రూపాయలకు చేరుకుంటోంది, ఇక గ్యాస్ సిలిండర్ […]

చమురు ధరలపై బీజేపీ చేతులెత్తేసినట్టేనా..?
X

యూపీఏ హయాంలో చమురు ధరలు పదిపైసలు, పావలా పెరిగితేనే రోడ్లపైకి వచ్చి నానా హంగామా చేసేవారు బీజేపీ నేతలు. ఇక గ్యాస్ సిలిండర్ల రేటు పెరిగితే బీజేపీ చేసిన హడావిడి ఇప్పటికీ ఎవరూ మరచిపోలేదు. మరి అదే బీజేపీ అధికారంలోకి వస్తే సహజంగానే రేట్లు తగ్గుతాయని ప్రజలు ఆశపడతారు. పోనీ జనం ఆశపడినట్టు తగ్గకపోయినా పర్లేదు, మరీ సామాన్యుడికి అందనంతగా పెరగడమే ఇప్పుడు విచిత్రం. పెట్రోల్ రేటు ఏకంగా 100 రూపాయలకు చేరుకుంటోంది, ఇక గ్యాస్ సిలిండర్ ధర మూడు నెలల్లో ఏకంగా 200 రూపాయలు పెరిగింది. వంట నూనెలు, నిత్యావసరాల ధరల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. నొప్పి తెలియకుండా వారానికోసారి సవరించుకుంటూ మూడు నెలల్లోనే గ్యాస్ సిలిండర్ రేటుని 200 రూపాయలు పెంచారంటే పరిస్థితి తీవ్రతకు, ప్రజల కష్టాలకు అది అద్దం పడుతోంది. ఒక దశలో రాయితీ లేని సిలిండర్ రేటు 750 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే రాయితీ పోను సిలిండర్ రేటు 821 రూపాయలకు చేరుకుంది. సబ్సిడీ ఇస్తున్నామంటూనే సామాన్యుడి నడ్డి విరుస్తోంది ఎన్డీఏ సర్కారు.

ఎన్నికల భయం బీజేపీకి లేదా..?
తమిళనాడు, పశ్చిమబెంగాల్ సహా.. త్వరలో ముంచుకొస్తున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ భయపడటం లేదా అనేది ఇక్కడ అసలు ప్రశ్న. అసెంబ్లీ ఎన్నికల భయంతోనే ఆయా రాష్ట్రాలకు ముందుగానే బడ్జెట్ లో తాయిలాలు ప్రకటించింది కేంద్రం. తమిళనాడు పర్యటనలో ఎంజీఆర్, జయలలిత చిత్రపటాలకు ప్రధాని వంగి వంగి నమస్కారాలు పెట్టడం కూడా ఎన్నికల స్టంట్ లో అంతర్భాగమే. ఇలాంటి జిమ్మిక్కులన్నీ చేస్తున్న బీజేపీ.. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న చమురు ధరలను మాత్రం కంట్రోల్ లో పెట్టాలనుకోవడంలేదు. ఎందుకంటే అది స్థానిక సమస్య కానే కాదనేది వారి అభిప్రాయం. అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ స్థానిక సమస్యలే ప్రధాన భూమిక పోషిస్తాయి. అందుకే పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లకు గేటులెత్తేసింది కేంద్రం.

వ్యతిరేకత తప్పదా..?
కరోనా కష్టకాలంలో దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిన్నదనే విషయం వాస్తవం. అదే సమయంలో దేశంలోని ధనవంతుల ఆస్తులు మాత్రం భారీగా పెరిగాయి. అంబానీలు, అదానీలపై కరోనా ప్రభావం పనిచేయలేదు, వారి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు మాత్రం కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడ్డారు. ఈ విచిత్ర పరిస్థితులు భారత్ లో తప్ప ఇంకెక్కడా కనిపించవు. దీనికి ప్రత్యక్ష కారణం ప్రభుత్వం అని ఎవరూ చెప్పరు కానీ, పేదలపై భారం పెరుగుతోందంటే, కేంద్రంపై వ్యతిరేకతా పెరుగుతుందనే అర్థం చేసుకోవాలి. అంతర్జాతీయ మార్కెట్ కి అనుగుణంగా చమురు రేట్లు తగ్గినప్పుడు భారత్ లో దానికి అనుగుణంగా పది పైసలు కూడా తగ్గలేదు. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా బ్యారెల్ రేట్లు పెరుగుతునన కారణంగా భారత్ లో రేట్లు పెరిగిపోతున్నాయి. బలహీన ప్రతిపక్షాల కారణంగా వీటిపై ఆందోళనలు, ఉద్యమాలు ఎక్కడా మొదలు కాకపోవడమే ఇప్పుడు అసలు సమస్య. కేంద్రం తనకు తాను తప్పు తెలుసుకుని పేద, మధ్యతరగతి వర్గాల గురించి పట్టించుకోవడం మినహా ఈ సమస్యకు పరిష్కారం లేదు. నిజంగానే కేంద్రం పేదలను పట్టించుకోకపోతే మాత్రం సార్వత్రిక ఎన్నికల వరకూ వేచి చూడాల్సిన అవసరం లేదు, అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీకి, దానితో అంటకాగిన స్థానిక పార్టీలకు కూడా ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం.

First Published:  15 Feb 2021 4:32 AM IST
Next Story