Telugu Global
NEWS

తిరుపతి ఫలితం డిసైడ్ అయినట్టేనా..?

తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీకి గట్టి పోటీ ఇవ్వాలని, వీలైతే విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ, జనసేనకు రోజు రోజుకీ పరిస్థితి క్లిష్టంగా తయారవుతోంది. రాష్ట్రంలో ఆలయాల ఘటనలు జరుగుతున్నసమయంలో ఆ వివాదాలను బూచిగా చూపి, హిందువులలో ఒకరకమైన అభద్రతా భావాన్ని రేకెత్తించి, వైసీపీని హిందూ ద్వేషిగా ముద్రించి లాభపడాలనుకుంది బీజేపీ. జనసేన కూడా అదే దారిలో వెళ్లాలనుకుంది. యాత్రలు, తీర్థయాత్రలు, నిరసన యాత్రలంటూ టీడీపీ సహా అందరూ మత రాజకీయాలకు సిద్ధమైన వేళ, పంచాయతీ ఎన్నికలు […]

తిరుపతి ఫలితం డిసైడ్ అయినట్టేనా..?
X

తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీకి గట్టి పోటీ ఇవ్వాలని, వీలైతే విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ, జనసేనకు రోజు రోజుకీ పరిస్థితి క్లిష్టంగా తయారవుతోంది. రాష్ట్రంలో ఆలయాల ఘటనలు జరుగుతున్నసమయంలో ఆ వివాదాలను బూచిగా చూపి, హిందువులలో ఒకరకమైన అభద్రతా భావాన్ని రేకెత్తించి, వైసీపీని హిందూ ద్వేషిగా ముద్రించి లాభపడాలనుకుంది బీజేపీ. జనసేన కూడా అదే దారిలో వెళ్లాలనుకుంది. యాత్రలు, తీర్థయాత్రలు, నిరసన యాత్రలంటూ టీడీపీ సహా అందరూ మత రాజకీయాలకు సిద్ధమైన వేళ, పంచాయతీ ఎన్నికలు అందరి కళ్లు తెరిపించాయి, వాస్తవాలను కళ్లకుకట్టాయి. రాష్ట్రంలో వైసీపీకి ప్రజాబలం తగ్గలేదని, కనీసం అభ్యర్థుల్ని నిలబెట్టేందుకు సైతం టీడీపీ, బీజేపీ దగ్గర మనుషులు లేరనే విషయం తేలిపోయింది. రెండు దశలకే టీడీపీకి జ్ఞానోదయం అయిన వేళ.. మిగతా రెండు దశల తర్వాత పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉంది.

బడ్జెట్ తో షాక్..
ఇక కేంద్ర బడ్జెట్ మరో పిడుగుపాటు లాంటి వ్యవహారం. వివిధ కారణాలతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు కేంద్ర బడ్జెట్ ని సరిగ్గా విమర్శించలేదు కానీ.. ఏపీతోపాటు కేంద్రం మొండిచేయి చూపించిన ఇతర రాష్ట్రాలు మాత్రం బడ్జెట్ ని ఏకిపారేశాయి. అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగాల్సిన పశ్చిమబెంగాల్, తమిళనాడు.. లాంటి రాష్ట్రాలకు తాయిలాలు ప్రకటించిన కేంద్రం.. పూర్తిగా ఏపీని నిర్లక్ష్యం చేసింది. దీంతో బీజేపీపై ప్రజల్లో ఇప్పటి వరకూ లేని వ్యతిరేకత కొత్తగా వచ్చి చేరింది.

విశాఖ ఉక్కు.. కేంద్రం తుక్కు..
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం మెయిన్ విలన్. అలాగని ఈపోరాటంలో ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు హీరోలు అనుకోడానికి లేదు. తమలోతాము పోట్లాడుకుంటూనే కేంద్రంతో యుద్ధానికి సిద్ధమయ్యారు అధికార, విపక్ష నేతలు. కలసికట్టుగా పోరాటం చేయాల్సిన సమయంలో కూడా విడివిడిగా రాజకీయాలు చేస్తూ చివరిగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయంలో జనసేన విన్నపాలతోనే సరిపెడుతోంది, బీజేపీ అసలు నోరే మెదపడంలేదు. సరిగ్గా ఈ సమయంలో తిరుపతి నోటిఫికేషన్ విడుదలైతే.. ప్రజల్లో ఉన్న కసి విశాఖ నుంచి తిరుపతికి ట్రాన్స్ ఫర్ కావడానికి ఎంతో సమయం పట్టదు. ఏపీ దెబ్బ, కేంద్రం అబ్బ అనాలంటే తిరుపతిలో బీజేపీకి, బీజేపీ మద్దతుతో బరిలో దిగితే జనసేనకు.. డిపాజిట్ దక్కకుండా చేయాలనే పట్టుదల ప్రజల్లోనూ వస్తుంది. కేవలం తిరుపతి స్థానం కోసం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వాయిదా వేయడం కానీ, విరమించుకోవడం కానీ కేంద్రం చేయదు. అంటే ఇప్పటికిప్పుడు తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలై ఎన్నికలు జరిగితే వైసీపీకి ఘన విజయం ఖాయమనే చెప్పాలి. సంస్థాగతంగా పట్టు కోల్పోతున్న టీడీపీ, బడ్జెట్, విశాఖ ఉక్కు వ్యవహారంతో పూర్తిగా వ్యతిరేకత కొని తెచ్చుకున్న బీజేపీ, జనసేనకు.. తిరుపతి ఉప ఎన్నిక పెద్ద అగ్నిపరీక్ష లాంటిది. విజయం కోసం కాకపోయినా.. రెండో స్థానం కోసం, వీలైతే డిపాజిట్ కోసం.. ఆయా పార్టీలు, నేతలు, అభ్యర్థులు చెమటోడ్చాల్సిందే.

First Published:  14 Feb 2021 3:05 AM IST
Next Story