నిమ్మగడ్డపై బాబు అసంతృప్తి.. దేనికి సంకేతం..?
ప్రత్యక్షంగా అయినా, పరోక్షంగా అయినా..ఇప్పటి వరకూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలన్నిటికీ చంద్రబాబు వత్తాసు పలికారు. ముఖ్యంగా నిమ్మగడ్డ నిర్ణయాలను వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సమయంలో.. బాబు ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో చంద్రబాబు, నిమ్మగడ్డ ఒకటేనంటూ వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. అందుకు తగిన సాక్ష్యాధారాలను కూడా సేకరించింది. తన హయాంలో ఎస్ఈసీగా నియమించబడిన నిమ్మగడ్డపై చంద్రబాబు ఎప్పుడూ ఆరోపణలు చేయలేదు, ఏకగ్రీవాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కరోనా సాకు చూపి […]
ప్రత్యక్షంగా అయినా, పరోక్షంగా అయినా..ఇప్పటి వరకూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలన్నిటికీ చంద్రబాబు వత్తాసు పలికారు. ముఖ్యంగా నిమ్మగడ్డ నిర్ణయాలను వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సమయంలో.. బాబు ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో చంద్రబాబు, నిమ్మగడ్డ ఒకటేనంటూ వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. అందుకు తగిన సాక్ష్యాధారాలను కూడా సేకరించింది. తన హయాంలో ఎస్ఈసీగా నియమించబడిన నిమ్మగడ్డపై చంద్రబాబు ఎప్పుడూ ఆరోపణలు చేయలేదు, ఏకగ్రీవాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కరోనా సాకు చూపి ఎన్నికలను ఆపినప్పుడు ఆయన నిర్ణయాన్ని ప్రశంసించారు. కరోనా తగ్గిపోయిందని ఎన్నికలు జరపాలని, కోర్టులకెక్కినప్పుడు కూడా మద్దతుగా నిలిచారు. పనిలో పనిగా టీడీపీ తరపున కూడా కేసులు వేయించారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు భిన్నంగా.. సుప్రీంకోర్టు పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని ప్రజాస్వామ్య విజయంగా ప్రకటించుకున్నారు చంద్రబాబు. కట్ చేస్తే.. ఇప్పుడు అదే నిమ్మగడ్డపై బాబు పరోక్షంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని అన్నారు బాబు. ఎస్‌ఈసీ తన అధికారాలను పూర్తిగా వినియోగించలేదని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ మద్దతుదారులపై కేసులు పెడుతున్నారని, పెద్ద ఎత్తున నామినేషన్లు తిరస్కరిస్తున్నారని, అడ్డగోలుగా ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని అన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు చంద్రబాబు. రాష్ట్రపతి, కేంద్రహోంమంత్రికి కూడా వివరాలు పంపుతున్నామని, ఎన్నికలు అప్రజాస్వామికంగా జరుగుతున్నాయని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థను నియంత్రించాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉందని, వ్యవస్థ పటిష్ఠానికి ఎవరు అడ్డొచ్చినా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అభ్యర్థులకు రక్షణ కావాలని ఎస్‌ఈసీని కోరామని, ఎన్నికల నిర్వహణలో ఎస్‌ఈసీ విఫలమైనందుకే హైకోర్టును ఆశ్రయిస్తున్నట్టు చెప్పారు.
గుంటూరు, చిత్తూరు ఏకగ్రీవాలపై అలక..
తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ తర్వాత గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాల ప్రకటనపై ఎస్ఈసీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకే కలెక్టర్లనుంచి నివేదిక తెప్పించుకుని అన్ని ఏకగ్రీవాలు సక్రమమైనవేనని సర్టిఫికెట్ ఇచ్చారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. దీంతో చంద్రబాబు అహం దెబ్బతిన్నదని, తన సొంత జిల్లాలోనే వైసీపీకి అత్యథిక ఏకగ్రీవాలు రావడంతో ఆయనకు ఏంచేయాలో పాలుపోలేదని అంటున్నారు. ఏకగ్రీవాలను ఒప్పుకున్నప్పటి నుంచి ఎస్ఈసీపై ఆయన రగిలిపోతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తొలి విడత ఫలితాల తర్వాత ఏకంగా ఎస్ఈసీ విఫలం అయ్యారని తీవ్ర ఆరోపణలు చేశారు బాబు.
నిమ్మగడ్డ వ్యవహార శైలి మారిందా..?
చంద్రబాబు నియమిత ఎస్ఈసీ నిమ్మగడ్డ.. వ్యవహార శైలిలో ఇటీవల మార్పులొస్తున్నమాట వాస్తవమే. ఈవాచ్ యాప్ సహా, మంత్రి పెద్దిరెడ్డిపై విధించిన ఆంక్షల విషయంలో కూడా కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడంతో.. ఆయన కొంత సర్దుకున్నారు. మొదట్లో అధికారులతో ఘర్షణాత్మక వాతావరణంలో పనిచేసిన ఆయన, ఇప్పుడు సయోధ్యగా మసలుతున్నారు. ఒకరకంగా ఇది శుభపరిణామమే అయినా, మరో మూడు దశల్లో ఎన్నికలు మిగిలిఉండగా.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈలోగా చంద్రబాబు ఎస్ఈసీపై ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. పంచాయతీల్లో ఓటమిని, అధికార పక్షం దౌర్జన్యంగా చిత్రీకరించడం మామూలే, ఇప్పుడు ఎస్ఈసీ వైఫల్యంకూడా ఉందని మరో కారణాన్ని వెదికి పట్టుకొచ్చారు చంద్రబాబు. నిమ్మగడ్డ రమేష్ కుమార్.. చంద్రబాబుకి ఏజెంట్ అంటూ వైసీపీ విమర్శలు చేసినప్పుడు కూడా స్పందించని బాబు.. ఇప్పుడు ఏకంగా ఆయన విఫలం అయ్యారంటూ విమర్శించడం ఎవరికీ మింగుడు పడని అంశంలా మారింది. బాబు వ్యాఖ్యల వెనక మర్మం ఏదో ఉందని శంకిస్తోంది అధికార వైసీపీ.