Telugu Global
NEWS

షర్మిల గాడ్ ఫాదర్ ఆయన.. కాదు కాదు ఈయన..

తెలంగాణలో పార్టీ పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్టు వైఎస్ షర్మిల ప్రకటించి రెండు రోజులు కూడా కాలేదు.. అప్పుడే అక్కడ అలజడి మొదలైంది. షర్మిల పార్టీ వెనక మీరంటే మీరున్నారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు అన్ని పార్టీల నేతలు. అభిమానుల సమావేశంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా షర్మిల మాట్లాడటంతో.. టీఆర్ఎస్ నేతలు స్పందించారు. అసలు తెలంగాణ పరిస్థితులు తెలుసా అంటూ నిలదీశారు. ఏపీతో పోలిక పెడుతూ.. మంత్రి హరీష్ రావు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను […]

షర్మిల గాడ్ ఫాదర్ ఆయన.. కాదు కాదు ఈయన..
X

తెలంగాణలో పార్టీ పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్టు వైఎస్ షర్మిల ప్రకటించి రెండు రోజులు కూడా కాలేదు.. అప్పుడే అక్కడ అలజడి మొదలైంది. షర్మిల పార్టీ వెనక మీరంటే మీరున్నారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు అన్ని పార్టీల నేతలు. అభిమానుల సమావేశంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా షర్మిల మాట్లాడటంతో.. టీఆర్ఎస్ నేతలు స్పందించారు. అసలు తెలంగాణ పరిస్థితులు తెలుసా అంటూ నిలదీశారు. ఏపీతో పోలిక పెడుతూ.. మంత్రి హరీష్ రావు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ కాస్త ఘాటుగానే స్పందించారు.

బీజేపీయే కారణమంటున్న టీఆర్ఎస్..
తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ వెనక బీజేపీ ఉందనేది టీఆర్ఎస్ వాదన. నేరుగా కీలక నేతలు స్పందించకపోయినా.. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం ఇదే. కేవలం టీఆర్ఎస్ ని దెబ్బకొట్టేందుకు బీజేపీ షర్మిలను రంగంలోకి దించిందని, సెటిలర్ల ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారని అనుమానిస్తున్నారు. పనిలో పనిగా కాంగ్రెస్ బలహీనపడుతుందనే విషయం టీఆర్ఎస్ నేతలకు సంతోషాన్నిస్తున్నా.. షర్మిల అక్కడితో ఆగరని, టీఆర్ఎస్ ఓటుబ్యాంకుని లాగేసుకుంటారనే భయం కూడా వారిలో ఉంది.

ఆ రెండు పార్టీలే కారణమంటున్న కాంగ్రెస్..
తెలంగాణలో కాంగ్రెస్ ని దెబ్బతీసేందుకే షర్మిల పార్టీ పెడుతున్నారని, బీజేపీ, టీఆర్ఎస్ రహస్య ఒప్పందం వల్లే షర్మిల పార్టీ తెరపైకి వస్తోందని, జగన్ ఆశీస్సులు కూడా ఉన్నాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. అటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా.. షర్మిల పార్టీ వెనక కేసీఆర్ హస్తముందని ఈపాటికే సెలవిచ్చారు. కాంగ్రెస్ ని దెబ్బ తీసేందుకు, వలసలతో కాంగ్రెస్ ని ఖాళీ చేయించేందుకే టీఆర్ఎస్ ఈ ఎత్తుగడ వేసిందనేది ఆ పార్టీ నేతల వాదన. బీజేపీ కూడా ఇందులో భాగస్వామి అని కాంగ్రెస్ అనుమానిస్తోంది.

బాబు అనుకూల మీడియాది మరో దారి..
సీఎం జగన్ కి అసలు తెలంగాణలో పార్టీని విస్తరించడమే ఇష్టం లేదని, ఆయన వారించినా షర్మిల తెలంగాణలో రాజకీయం చేయడానికి మొగ్గు చూపారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఈపాటికే క్లారిటీ ఇచ్చారు. అయితే టీడీపీ అనుకూల మీడియా మాత్రం షర్మిల వెనక జగన్ హస్తం ఉందని ప్రచారం మొదలు పెట్టింది. షర్మిలకు జగన్ ప్రయారిటీ ఇవ్వలేదని అందుకే ఆమె పార్టీ పెట్టారని విశ్లేషిస్తూనే.. మరోవైపు షర్మిలతో పార్టీ పెట్టించి తెలంగాణలో కూడా పాగా వేయాలనేది జగన్ ప్లాన్ అన్నట్టు వార్తలిస్తున్నారు.
స్థానిక ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కూడా పరోక్షంగా షర్మిల కొత్త పార్టీ వార్తల్ని ప్రస్తావించారు. ఈవ్యవహారం అంతా జగన్ కనుసన్నల్లోనే జరుగుతున్నట్టుగా మాట్లాడారు చంద్రబాబు. ఢిల్లీలో ఉన్న పవన్ కల్యాణ్ కూడా షర్మిల పార్టీపై స్పందించాల్సి వచ్చింది. రాజకీయాల్లోకి వచ్చే హక్కు ఎవరికైనా ఉందని, ఆ పార్టీ విధి విధానాలు తెలిశాక మాట్లాడతానని చెప్పారు.

మొత్తమ్మీద షర్మిల గాడ్ ఫాదర్ ఎవరు? ఆమె తెలంగాణలో పార్టీ పెట్టాలనుకోవడానికి కారణం ఎవరు? అనే విషయాలపై రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మేథోమధనం జరుగుతోంది. ఒక చిన్న మీటింగ్ తో, రాజన్న రాజ్యం అనే మాటతో.. ఒకేసారి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాక పుట్టించారు షర్మిల.

First Published:  10 Feb 2021 10:01 PM GMT
Next Story