Telugu Global
NEWS

షర్మిల పార్టీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడానికి సిద్ధమయ్యారనే విషయం తేలిపోయింది. సీఎం జగన్ తో విభేదాలున్నాయని కొంతమంది అంటున్నా.. ఏపీలో షర్మిల పార్టీ పెట్టడంలేదు కాబట్టి దాన్ని ధృవీకరించడానికి వీలు లేదు. ఇక తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ, రాజన్న రాజ్యం అంటున్నారు, పరోక్షంగా టీఆర్ఎస్ పాలనపై సునిశిత విమర్శలు చేశారు. పిల్లలకు ఫీజు బకాయిలు అందడంలేదని, రైతులు సంతోషంగా లేరని.. పలు కారణాలను కూడా ప్రస్తావించారు షర్మిల. […]

షర్మిల పార్టీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
X

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడానికి సిద్ధమయ్యారనే విషయం తేలిపోయింది. సీఎం జగన్ తో విభేదాలున్నాయని కొంతమంది అంటున్నా.. ఏపీలో షర్మిల పార్టీ పెట్టడంలేదు కాబట్టి దాన్ని ధృవీకరించడానికి వీలు లేదు. ఇక తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ, రాజన్న రాజ్యం అంటున్నారు, పరోక్షంగా టీఆర్ఎస్ పాలనపై సునిశిత విమర్శలు చేశారు. పిల్లలకు ఫీజు బకాయిలు అందడంలేదని, రైతులు సంతోషంగా లేరని.. పలు కారణాలను కూడా ప్రస్తావించారు షర్మిల. అందుకే రాజన్న రాజ్యం అంటున్నారు.

షర్మిల పార్టీతో టీఆర్ఎస్ కి నష్టమా? లాభమా?
తెలంగాణలో షర్మిల పార్టీ పెడుతుందన్న వార్తలు వచ్చిన వెంటనే.. చాలామంది దీని వెనక కేసీఆర్ హస్తం ఉందని ఊహాగానాలు చేశారు. జగన్ సూచనతో, కేసీఆర్ అండదండలతో తెలంగాణలో షర్మిల పార్టీ పెడుతోందని, బీజేపీ, కాంగ్రెస్ ని దెబ్బకొడుతుందని అన్నారు. అయితే తొలిరోజే షర్మిల అధికార పక్షంపై చేసిన విమర్శలతో ఆ వాదన తప్పని తేలిపోయింది. కొత్తగా పార్టీ పెడుతన్నవారెవరైనా.. అధికార పార్టీని టార్గెట్ చేయడం అనివార్యం. అంటే రేపు షర్మిల టీఆర్ఎస్ పై, కేసీఆర్ పాలనపై విమర్శల డోసు పెంచాల్సిన పరిస్థితి రావొచ్చు. ప్రతి విమర్శలకు కూడా ఆమె సిద్ధపడాల్సిందే. కచ్చితంగా ఈ రాజకీయ క్రీడలో లోకల్, నాన్ లోకల్ అనే ఫీలింగ్ తీసుకొస్తుంది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ కి లాభమా, నష్టమా అని అంచనా వేయడం కష్టం కానీ.. టీఆర్ఎస్ కి పడుతున్న ఆంధ్రా ప్రాంత ఓట్లకు మాత్రం కచ్చితంగా గండిపడే అవకాశం కనిపిస్తోంది.

కాంగ్రెస్ పరిస్థితి ఏంటి..?
బతికున్నంత వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడిగానే ఉన్నారు. ఆయన మరణానంతరం కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన్ను తమ నాయకుడిగానే చెప్పుకుంటోంది. ఏపీ నాయకులు మొహమాట పడ్డా, తెలంగాణలో మాత్రం వైఎస్ఆర్ ని కాంగ్రెస్ నాయకుడిగానే అటు నేతలు, ఇటు కార్యకర్తలు భావిస్తారు. ఇప్పుడు వైఎస్సార్ కుమార్తె షర్మిల పార్టీ పెడితే.. కాంగ్రెస్ నుంచి వలసలు మొదలవుతాయనే వాదన కూడా ఉంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ ను వీడి, షర్మిలతో కలిసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆ లెక్కన చూసుకుంటే.. నాయకుల వలసలు మొదలైతే.. షర్మిల పార్టీతో కాంగ్రెస్ కి కష్టకాలం మొదలయినట్టే చెప్పుకోవాలి. షర్మిల సమావేశం తర్వాత స్పందించిన నాయకుల్లో ఎక్కువమంది కాంగ్రెస్ వారే ఉండటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.

షర్మిల పార్టీతో బీజేపీకి లాభమా..?
తెలంగాణలో అధికార పార్టీని దెబ్బకొట్టి అధికారం చేజిక్కించుకోడానికి బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. కాంగ్రెస్ బలహీన పడటం, ఇతర పార్టీలకు అంత సీన్ లేకపోవడం బీజేపీకి కలసి వచ్చే అంశం. అయితే ఈ క్రమంలో షర్మిల పార్టీ పెట్టడం బీజేపీకి పరోక్షంగా లాభం చేకూర్చే అంశం అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నుంచి నాయకులు బయటకు వస్తే ఆ పార్టీ బలహీన పడుతుందని, ఎలాగూ తమకు దక్కని మైనార్టీ, ఎస్సీ సామాజిక ఓట్లలో షర్మిల పార్టీతో చీలిక తేవచ్చనేది బీజేపీ ఆలోచనగా కనపడుతోంది. మొత్తమ్మీద ప్రతి రాష్ట్రంలోనూ ప్లాన్-బి ని అమలు చేస్తున్న బీజేపీ.. తెలంగాణలో షర్మిల పార్టీని ప్లాన్-బి గా తెరపైకి తెస్తోందనే వాదన వినపడుతోంది. తెలంగాణలో షర్మిల పార్టీ ప్రకటన రోజే రాజకీయ వర్గాల్లో కలకలం మొదలైంది. వలసలతో బలం పెంచుకుని, స్థానికంగా ప్రజలకు భరోసా ఇవ్వగలిగితే.. అసెంబ్లీ ఎన్నికల నాటికి షర్మిల పార్టీ తెలంగాణలో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగే అవకాశం ఉంది.

First Published:  10 Feb 2021 5:03 AM IST
Next Story