Telugu Global
NEWS

వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న టీఆర్ఎస్

తెలంగాణలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మృతితో ఖాళీ అయిన నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాగార్జునసాగర్ స్థానాన్ని దక్కించుకోవాలని పట్టుబడుతున్నాయి. ఆయా పార్టీలు బలమైన అభ్యర్థిని పోటీకి నిల‌బెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు హాలియాలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఉప ఎన్నికకు ముందు కేసీఆర్ పాల్గొంటున్న సభకావడంతో సర్వత్రా ఆసక్తి […]

వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న టీఆర్ఎస్
X

తెలంగాణలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మృతితో ఖాళీ అయిన నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాగార్జునసాగర్ స్థానాన్ని దక్కించుకోవాలని పట్టుబడుతున్నాయి. ఆయా పార్టీలు బలమైన అభ్యర్థిని పోటీకి నిల‌బెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు హాలియాలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఉప ఎన్నికకు ముందు కేసీఆర్ పాల్గొంటున్న సభకావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్ బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి తిరిగి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో మళ్లీ ప్రజల మధ్యకు రానుండడం గమనార్హం. గత ఏడేళ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాధించిన అభివృద్ధిని కేసీఆర్ నివేదించనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్షాల తీరుపై స్పందించే అవకాశం ఉంది. హాలియలో సభ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వారం రోజుల క్రితమే నిర్ణయించారు. అయినప్పటికీ తక్కువ సమయంలోనే జిల్లా మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు సభకు ఏర్పా్ట్లు పూర్తి చేశారు. భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ విప్‌ కర్నె ప్రభాకర్‌ తదితరులు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

హాలియా సభకు నాగార్జున సాగర్ ఉపఎన్నికకు ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నప్పటికీ, ముందస్తుగానే ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు అర్థమవుతోంది. దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ ఫలితాలను దృష్టిలో ఉంచుకొని నాగార్జునసాగర్ ఉపఎన్నిక కోసం టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో కేసీఆర్ ఎక్కడా కనిపించలేదు. అటు జీహెచ్ఎంసీ ఎన్నికలల్లోనూ కేవలం ఒకే ఒక సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. దీంతో మంత్రులు, కింది స్థాయి నాయకులు ప్రజల్ని ఆకట్టుకోలేకపోయారనే విమర్శలూ ఉన్నాయి. తిరిగి అలాంటి ఫలితాలే పునరావృతం కాకుండా ఉండాలంటే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి ఎక్కువ సమయం కేటాయించాలని పార్టీ అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలోనే హాలియా సభను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

చాలాకాలం తరువాత కేసీఆర్ జనం మధ్యకు వస్తుండటంతో ఆయన ఏం మాట్లాడుతారా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ దూకుడు పెంచడంతో ముఖ్యమంత్రి బీజేపీ వైఖరిపై స్పందిస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు రైతు సమస్యలు, షర్మిల కొత్త పార్టీ అంశాలపై కూడా ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉందని చర్చజరుగుతోంది. ముఖ్యంగా సాగర్ ఉప ఎన్నిక అభ్యర్థిని ఇదే వేదిక నుంచి ముఖ్యమంత్రి ప్రకటిస్తారనే ప్రచారమూ జరుగుతోంది. నాగార్జున సాగర్ నుంచి కాంగ్రెస్ తరుపున సీనియర్ నేత జానారెడ్డి బరిలోకి దిగనున్న నేపథ్యంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని అధికార పార్టీ యోచిస్తోంది. మరి పాత సంప్రదాయాన్నే పాటిస్తూ నోముల కుటుంబ సభ్యులకు అవకాశం ఇస్తుందా? లేక మరొకరిని రంగంలోకి దింపుతుందా? అనేది వేచి చూడాలి.

First Published:  10 Feb 2021 4:44 AM IST
Next Story