Telugu Global
National

ఆందోళనలపై వేసెయ్ విదేశీ ముసుగు..

ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలపై ప్రతిపక్షాల కుట్ర అంటూ ముద్రవేయడం అధికార పార్టీలకు అలవాటే. అయితే ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఆందోళనలను ప్రతిపక్ష ప్రేరేపిత కుట్రగా తిప్పికొట్టేందుకు అధికార బీజేపీకి అవకాశం దొరకలేదు. అసలు ఏ పార్టీని తమ దగ్గరకు రానివ్వకుండా కేవలం రైతు సంఘాలే ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపి, ఆందోళనకారులతో చేయి కలిపితే ఈ పాటికే రైతు ఉద్యమం నీరుగారిపోయేదేమో. అలాంటి నిర్ణయాల జోలికి వెళ్లకుండా రైతు […]

ఆందోళనలపై వేసెయ్ విదేశీ ముసుగు..
X

ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలపై ప్రతిపక్షాల కుట్ర అంటూ ముద్రవేయడం అధికార పార్టీలకు అలవాటే. అయితే ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఆందోళనలను ప్రతిపక్ష ప్రేరేపిత కుట్రగా తిప్పికొట్టేందుకు అధికార బీజేపీకి అవకాశం దొరకలేదు. అసలు ఏ పార్టీని తమ దగ్గరకు రానివ్వకుండా కేవలం రైతు సంఘాలే ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపి, ఆందోళనకారులతో చేయి కలిపితే ఈ పాటికే రైతు ఉద్యమం నీరుగారిపోయేదేమో. అలాంటి నిర్ణయాల జోలికి వెళ్లకుండా రైతు సంఘాలు కేంద్రం మెడపై కత్తి పెట్టాయి. మొదట్లో మార్పులకి ససేమిరా అన్న కేంద్ర ప్రభుత్వం, ఏడాదిన్నరనుంచి రెండేళ్లపాటు సాగు చట్టాల అమలుని ఆపేద్దాం అనే స్థాయికి కూడా వచ్చింది. అయితే ఆ తర్వాతే మోదీ ఇగో బాగా హర్ట్ అయినట్టు అర్థమవుతోంది. చట్టాల రద్దు తప్ప మాకింకేమీ వద్దని రైతు సంఘాలు పట్టుబట్టడంతో మోదీలోని రెండో మనిషి నిద్రలేచాడు. రైతుల ఆందోళనలను విదేశీ కుట్రగా అభివర్ణిస్తూ గుడ్డ కాల్చి రైతుల మొహాన పారేశారు.

చట్టాలను రద్దు చేస్తే తన ఇమేజీ భారీగా డ్యామేజీ అవుతుందని భావిస్తున్నారు మోదీ. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశం ఆర్థికంగా తలకిందులై సామాన్యులు గగ్గోలు పెడితేనే అదంతా మామూలేనంటూ లైట్ తీసుకున్న వ్యక్తి మోదీ. అలాంటిది రైతుల ఉద్యమానికి అంత తేలిగ్గా తలొగ్గుతారా అనేది అనుమానాస్పదమే. అందుకే ఆయన తన పంథా మార్చారు.

ఎర్రకోట-దేశద్రోహం..
ఓ దశలో రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన అల్లర్లతో రైతు ఉద్యమం పలుచబడుతుందని అనుకున్నారంతా. కేంద్రం కూడా కేసులు పెట్టి భయపెట్టాలని చూసింది, అల్లర్లను సాకుగా చూపి, దేశద్రోహానికి పాల్పడుతున్నారంటూ పెద్ద పెద్ద నిందలే వేసింది. కానీ రైతు సంఘాలు ఎక్కడా వెనక్కి తగ్గకపోవడం, అల్లర్లు అంతటితో ఆగిపోయి ఉద్యమం తిరిగి శాంతియుతంగా మారడంతో కేంద్రానికి ఏం చేయాలో పాలుపోలేదు. ప్రస్తుతానికి చర్చల సంగతి పక్కనపెట్టి, రైతుల సహనానికే పరీక్ష పెట్టారు ప్రధాని మోదీ.

విదేశీ కుట్ర..
ప్రతిపక్షాల కుట్ర అనే అవకాశం రాకపోవడంతో.. రైతు ఉద్యమంపై విదేశీ కుట్ర అనే ముద్రవేయడానికి బీజేపీ నేతలు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. విదేశీయుల ట్వీట్ల వెనక ఖలిస్థాన్ ఉగ్రవాదుల ప్రమేయం ఉందని, రైతు ఉద్యమం విదేశీ విధ్వంస కారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని సరికొత్త వాదన తెరపైకి తెచ్చారు. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుందనుకుంటున్న సమయంలో.. దేశ సార్వభౌమత్వాన్ని తెరపైకి తెచ్చి ట్విట్టర్ వార్ నడిపించారు. తాజాగా పార్లమెంట్ లో ప్రధాని చేసిన ప్రసంగంతో కేంద్రం మనసులో ఏముందనే విషయం మరోసారి రుజువైంది. సాగు చట్టాల రద్దు అనేది సాధ్యం కాదని ప్రధాని మోదీ తేల్చేశారు. అదే సమయంలో రైతుల ఆందోళను ఆయన విదేశీ విధ్వంస కుట్రగా అభివర్ణించారు.
“నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నవారి వెనక కొంతమంది ఉన్నారు. వాళ్లంతా దేశంలో కొత్తగా పుట్టుకొచ్చిన ‘ఆందోళన జీవి’ జాతికి చెందినవారు. ఆందోళన చేపట్టకుండా వారు బతకలేరు. కొత్తరకం ‘విదేశీ విధ్వంస భావజాలం’ (ఫారిన్‌ డిస్ట్రక్టివ్‌ ఐడియాలజీ-ఎఫ్‌డీఐ) కూడా దేశంలోకి ప్రవేశించింది. దీని నుంచి దేశాన్ని రక్షించడానికి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి.” పార్లమెంట్ లో ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశం ఇది.

హరిత విప్లవంతో పోలిక..
ఎన్డీఏ తీసుకొచ్చిన సాగు సంస్కరణలను హరిత విప్లవంతో పోల్చి అందరికీ షాకిచ్చారు ప్రధాని మోదీ. హరిత విప్లవ సమయంలో కూడా ఇలాంటి అనుమానాలు, ఆందోళనలే వ్యక్తమయ్యాయని, ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నిర్ణయాలను ఇతర మంత్రులు, చివరకు ప్రణాళిక సంఘం కూడా వ్యతిరేకించిందని, అమెరికా ఏజెంట్లుగా కాంగ్రెస్ నేతల్నివామపక్షాలు అభివర్ణించాయని గుర్తు చేశారు. హరిత విప్లవస సత్ఫలితాలను ఇప్పుడు అందరం అనుభవిస్తున్నామని, అలాగే సాగు చట్టాలతో కూడా మున్ముందు భారత్ లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకొచ్చారు. తమను సంప్రదించకుండా, హడావిడిగా చట్టాలు చేశారంటూ గతంలో ప్రతిపక్షాలు మాట్లాడేవని, రైతుల ఆందోళన తర్వాత కాంగ్రెస్ యూ టర్న్ తీసుకుందని ఎద్దేవా చేశారు మోదీ. మొత్తమ్మీద సాగు చట్టాల రద్దు సాధ్యం కాదని గట్టిగా చెబుతూనే.. రండి తలుపులు తెరిచే ఉన్నాయంటూ రైతు సంఘాల నేతలకు స్వాగతం పలికారు. చట్టాల రద్దుపై తన మనసులో మాటని పార్లమెంట్ సాక్షిగా కుండబద్దలు కొట్టారు.

First Published:  8 Feb 2021 8:42 PM GMT
Next Story