Telugu Global
NEWS

ఉక్కు పాపం చంద్రబాబుదే.. మాపై బురదజల్లేందుకు ప్రయత్నం..

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసే కార్యక్రమం చంద్రబాబు హయాంలోనే మొదలైందని, ఇప్పుడు తమపై బురదజల్లేందుకు బాబు ప్రయత్నించడం దారుణం అని విమర్శించారు మంత్రి బొత్స సత్యనారాయణ. 2015లో బాబు హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణపై నిర్ణయం జరిగిందని, కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు ఉన్నప్పుడే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించాలని కోరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని ప్రధాని […]

ఉక్కు పాపం చంద్రబాబుదే.. మాపై బురదజల్లేందుకు ప్రయత్నం..
X

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసే కార్యక్రమం చంద్రబాబు హయాంలోనే మొదలైందని, ఇప్పుడు తమపై బురదజల్లేందుకు బాబు ప్రయత్నించడం దారుణం అని విమర్శించారు మంత్రి బొత్స సత్యనారాయణ. 2015లో బాబు హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణపై నిర్ణయం జరిగిందని, కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు ఉన్నప్పుడే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించాలని కోరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని ప్రధాని మోదీ మన్నించాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. సొంత గనులు కేటాయిస్తే విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాల నుంచి గట్టెక్కుతుందని, ప్రైవేటుకి అప్పగించే అవసరం ఉండదని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తే, దానికి చంద్రబాబే బాధ్యుడు అవుతారని అన్నారు బొత్స.

అనంతపురం జిల్లా ఇన్ చార్జి మంత్రిగా స్థానిక నాయకులతో పంచాయతీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. అనంతపురం జిల్లాలో 90శాతం సీట్లను వైసీపీ బలపరచిన అభ్యర్థులు గెలుచుకుంటారని ధీమా వ్యక్తం చేశారు బొత్స. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను… మారుమూల ఉన్న ప్రతి అర్హుడుకీ అందిస్తున్నామని, అందుకే తమని ప్రజలు ఆదరిస్తారని నమ్ముతున్నట్టు తెలిపారు. శాంతిభద్రతలకు ఇబ్బంది కలగకుండా స్థానిక ఎన్నికలు జరగాలని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని చెప్పారు.

హైకోర్టు మొట్టికాయతో నిమ్మగడ్డలో మార్పు రావాలి..
తొందరపాటు నిర్ణయాలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవస్థలకు చెడ్డపేరు తెస్తున్నారని విమర్శించారు మంత్రి బొత్స సత్యనారాయణ. మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేసేలా నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు రద్దు చేసిందని, ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదని ఆయనకు మొట్టికాయలు వేసిందని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తూ ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలు చాలా బాధాకరం, శోచనీయం అని అన్నారు బొత్స. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని హౌస్ అరెస్ట్ చేయడమంటే ఆయన వ్యక్తిత్వానికి, గౌరవానికి ఎంతో భంగం అని చెప్పారు. హైకోర్టు తీర్పుతో అయినా నిమ్మగడ్డ మారాలని, చిత్తూరు, గుంటూరు జిల్లాల ఏకగ్రీవ ఫలితాలపై విధించిన ఆంక్షలపై పునరాలోచించాలని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధికి తోడ్పడేలా ఎన్నికల కమిషన్‌ కూడా బాధ్యతగా వ్యవహరించాలని, ఎక్కడ అవసరమో అక్కడ ఎన్నికలు జరపాలని కోరారు. మా గ్రామంలో ఎన్నికలు వద్దు, మేమంతా సమైక్యంగా ఉంటాం.. అని చెప్పినా ఏకగ్రీవాలు కాకూడదన్నట్టుగా ఎస్ఈసీ వ్యవహరించడం సమంజసం కాదని అన్నారు బొత్స.

టీడీపీపై అనర్హత వేటు వేయాలి..
పేదలకు బియ్యం పంపిణీ చేసే వాహనాలపై వైసీపీ రంగులు ఉన్నాయంటూ రాద్ధాంతం చేసి అసలు పథకం అమలునే అడ్డుకున్న నిమ్మగడ్డ.. టీడీపీ మేనిఫెస్టోపై చర్యలు తీసుకోకపోవడం దారుణం అని అన్నారు మంత్రి బొత్స. మేనిఫెస్టో రద్దుచేయడం కాదని, టీడీపీ గుర్తింపునే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. లేని అధికారాలతో మంత్రి పెద్దిరెడ్డిపై ఆంక్షలు విధించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ.. తనకు ఉన్న అధికారాలు వినియోగించుకుని టీడీపీ మీద క్రిమినల్ కేసులు పెట్టి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బొత్స.

First Published:  7 Feb 2021 10:47 AM GMT
Next Story