ఏకగ్రీవాలపై రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయం -మంత్రి పెద్దిరెడ్డి..
చంద్రబాబు తనకి భవిష్యత్ లో ఎమ్మెల్సీ లేదా ఎంపీ పదవి ఇవ్వకపోతారా అనే ఉద్దేశంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయనకు తొత్తులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అయితే చంద్రబాబు వాడుకుని వదిలేసే రకం అని, ఆ విషయం నిమ్మగడ్డ గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను నిలిపివేయాలంటూ నిమ్మగడ్డ ఇచ్చిన ఉత్తర్వుల్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఏకగ్రీవంగా ఎన్నికైనవారికి డిక్లరేషన్ ఇచ్చే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉంటుంందని, వారంతా ఎన్నికల నిబంధనల […]
చంద్రబాబు తనకి భవిష్యత్ లో ఎమ్మెల్సీ లేదా ఎంపీ పదవి ఇవ్వకపోతారా అనే ఉద్దేశంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయనకు తొత్తులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అయితే చంద్రబాబు వాడుకుని వదిలేసే రకం అని, ఆ విషయం నిమ్మగడ్డ గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను నిలిపివేయాలంటూ నిమ్మగడ్డ ఇచ్చిన ఉత్తర్వుల్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఏకగ్రీవంగా ఎన్నికైనవారికి డిక్లరేషన్ ఇచ్చే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉంటుంందని, వారంతా ఎన్నికల నిబంధనల మేరకే పనిచేయాలని సూచించారు. డిక్లరేషన్ ఇచ్చాక దాన్ని తిరస్కరించే అధికారం ఎస్ఈసీకి కూడా లేదని అన్నారు. ఎస్ఈసీ చట్టవిరుద్దంగా ఇచ్చే పిచ్చి ఆదేశాలను రిటర్నింగ్ ఆఫీసర్లు పట్టించుకోవద్దని చెప్పారు పెద్దిరెడ్డి. ఇప్పటికే ఏకగ్రీవాలు అయిన చోట్ల దాదాపు 70 శాతం వరకు డిక్లరేషన్లు తీసుకున్నారని, వాటిని అడ్డుకోవడం అంటే ఆర్వోలను భయపెట్టేందుకు ప్రయత్నించడమేనన్నారు. బెదిరింపులతో జిల్లా కలెక్టర్లను కూడా నిమ్మగడ్డ తన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు పెద్దిరెడ్డి. అహంకారం, బ్లాక్ మెయిలింగ్ నిమ్మగడ్డ నైజం అంటూ ధ్వజమెత్తారు.
2వేల పంచాయతీలు ఏకగ్రీవం..
2013 ఎన్నికల్లో 13 జిల్లాల లెక్క తీస్తే 1980 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయని గుర్తు చేశారు మంత్రి పెద్దిరెడ్డి. రాష్ట్రంలో ఇప్పటికే ఇప్పటికే 513 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని, మిగిలిన మూడు దశలు పూర్తయితే 2వేల పంచాయతీల వరకు ఏకగ్రీవం అవుతాయని అంచనా వేశారు. ప్రతి ఎన్నికల్లో ఇది సహజ ప్రక్రియేనని, ఏకగ్రీవం చట్టవిరుద్ధమని ఏ చట్టం చెబుతుందని ప్రశ్నించారాయన. నిమ్మగడ్డ సొంత జిల్లా గుంటూరు, చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఎక్కువగా ఏకగ్రీవాలు కాకూడదని వారిద్దరూ కలిసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడ్డ ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు తిరిగి ప్రారంభించకుండా.. పంచాయతీలనుంచి మొదలు పెట్టడం వెనక పెద్ద కుట్ర ఉందన్నారు. గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు రెచ్చగొట్టి, అంపశయ్యపై ఉన్న టీడీపీని నిలబెట్టేందుకే ఎస్ఈసీ, చంద్రబాబు కలసి ఆడుతున్న డ్రామా ఇదని విమర్శించారు. పార్టీ రహిత ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో విడుదల చేస్తే, చర్యలు తీసుకోకుండా, 5 రోజుల తరువాత ఆ మేనిఫెస్టోను రద్దు చేస్తున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించడం హాస్యాస్పదంగా వుందని అన్నారు. ప్రభుత్వ పథకాలపై సీఎం సహా ఇతర మంత్రుల బొమ్మలు ఉండకూడదని చెప్పడం సరికాదన్నారు. కనీసం ఓటు ఎలా నమోదు చేసుకోవాలో తెలియని వ్యక్తి ఈ రాష్ట్రానికి ఎన్నికల కమిషనర్ గా వుండటం దురదృష్టకరం అని అన్నారు పెద్దిరెడ్డి.
పాప ప్రక్షాళణకే తీర్థ యాత్రలు..
కేవలం చంద్రబాబు ప్రాపకం కోసం, టీడీపీ మేలుకోసం నిమ్మగడ్డ చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. తాను చేస్తున్న పాపాలు కడుక్కునేందుకే ఆయన పుణ్యక్షేత్రాలకు పోతున్నారని అన్నారు. జిల్లాల పర్యటనల పేరుతో ఆయన వరుసగా పుణ్యక్షేత్రాలు సందర్శించడం వెనక అసలు కారణం ఇదేనన్నారు పెద్దిరెడ్డి. ఇక యాప్ విషయంలో నిమ్మగడ్డకు కోర్టు మొట్టికాయ వేసిందని, ఆయన సిగ్గుతో తలదించుకోవాలని, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.