Telugu Global
NEWS

వైసీపీకి హెచ్చరికలు.. టీడీపీకి బుజ్జగింపులు..

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి తొలినుంచీ టీడీపీకి అనుకూలంగా ఉందని, అదే సమయంలో అధికార పార్టీని ఆయన శత్రువుగా చూస్తున్నారనేది వైసీపీని నేతల ఆరోపణ. ఆ ఆరోపణలు రుజువు చేసే విధంగా.. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్యకూ ఎస్ఈసీ అడ్డు తగులుతూనే ఉన్నారు. ప్రభుత్వంపై అలుపెరగని న్యాయపోరాటం చేసి మరీ ఆయన పంచాయతీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. గతంలో అమ్మఒడి ఆపేయాలంటూ పరోక్షంగా సూచనలు జారీ చేశారు, ఇళ్ల పట్టాల పంపిణీకి కూడా […]

వైసీపీకి హెచ్చరికలు.. టీడీపీకి బుజ్జగింపులు..
X

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి తొలినుంచీ టీడీపీకి అనుకూలంగా ఉందని, అదే సమయంలో అధికార పార్టీని ఆయన శత్రువుగా చూస్తున్నారనేది వైసీపీని నేతల ఆరోపణ. ఆ ఆరోపణలు రుజువు చేసే విధంగా.. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్యకూ ఎస్ఈసీ అడ్డు తగులుతూనే ఉన్నారు. ప్రభుత్వంపై అలుపెరగని న్యాయపోరాటం చేసి మరీ ఆయన పంచాయతీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. గతంలో అమ్మఒడి ఆపేయాలంటూ పరోక్షంగా సూచనలు జారీ చేశారు, ఇళ్ల పట్టాల పంపిణీకి కూడా కొర్రీలు వేయాలని చూశారు. వాలంటీర్లను ఎన్నికలకు దూరం పెట్టాలని ఆదేశాలిచ్చారు. తాజాగా గ్రామాల్లో ఇంటి వద్దకు రేషన్ కార్యక్రమాన్ని కూడా అడ్డుకున్నారు. ఇక టీడీపీ విషయానికొస్తే.. వైసీపీ ఆరోపణలు నిజం చేసే విధంగానే ఆయన ప్రవర్తన ఉంటోంది. టీడీపీ మేనిఫెస్టో విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన సందర్భంలో కేవలం ఆయా పత్రాలు ప్రచారంలో వినియోగించొద్దని మాత్రమే సూచించారు నిమ్మగడ్డ.

పంచాయతీ ఎన్నికల్లో పార్టీల ప్రమేయం ఉండకూడదనేది రాజ్యాంగ నిబంధన. పార్టీల ప్రమేయం లేని ఎన్నికలకు టీడీపీ పంచ సూత్రాలంటూ మేనిఫెస్టో విడుదల చేయడం, సాక్షాత్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడే దాన్ని చదివి వినిపించడం, టీడీపీ బలపరచిన అభ్యర్థుల్ని గెలిపిస్తే.. ఫలానా ఫలానా పనులు చేసి పెడతామంటూ సెలవివ్వడం.. అన్నీ నిబంధనలకు విరుద్ధమే. మేనిఫెస్టో విడుదల రోజే దీనిపై వైసీపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది, ఎస్ఈసీకి ఫిర్యాదు చేసింది. అంత మాత్రాన నిమ్మగడ్డ టీడీపీపై చర్యలు తీసుకుంటారనే ఆశ వైసీపీలో లేదు, మేనిఫెస్టోతో తమకు వచ్చే నష్టం ఉంటుందని కూడా వారు భావించలేదు. నిమ్మగడ్డ నిజస్వరూపం తేల్చుదామనే ఉద్దేశంతోటే వైసీపీ నేతలు ఈ ఫిర్యాదు చేశారు. వారి అంచనాలు నిజం చేస్తూ టీడీపీకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మేనిఫెస్టో పత్రాలు బయటకు రానీయొద్దని మాత్రమే ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు. దీన్ని క్రమశిక్షణ చర్య అంటారో లేక ఆ పేరుతో చంద్రబాబుకి నొప్పి తెలియని శిక్ష వేశారో ఎస్ఈసీకే తెలియాలి. మొత్తమ్మీద అటు వైసీపీ ఆరోపణలపై స్పందించినట్టు, ఇటు టీడీపీపై చర్యలు తీసుకుంటున్నట్టు మమ అనిపించారు నిమ్మగడ్డ.

First Published:  5 Feb 2021 2:20 AM IST
Next Story