Telugu Global
National

చిన్నమ్మను వీడని చిక్కులు

అన్నాడీఎంకే బహిషృత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళను కష్టాలు వెంటాడుతున్నాయి. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన శశికళ ఫిబ్రవరి 7న చెన్నై రానుంది. శశికళకు ఘన స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళం సన్నాహాలు చేస్తుండగా.. ఆమె పునరాగమనం అధికార అన్నాడీఎంకే శ్రేణుల్లో కలవరం పుట్టిస్తోంది. శశికళ తమ పార్టీ జెండాను వాడుకుంటుందేమో అనే భయం అన్నాడీఎంకే నేతల్లో మొదలైంది. శశికళ జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో అన్నాడీఎంకే […]

చిన్నమ్మను వీడని చిక్కులు
X

అన్నాడీఎంకే బహిషృత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళను కష్టాలు వెంటాడుతున్నాయి. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన శశికళ ఫిబ్రవరి 7న చెన్నై రానుంది. శశికళకు ఘన స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళం సన్నాహాలు చేస్తుండగా.. ఆమె పునరాగమనం అధికార అన్నాడీఎంకే శ్రేణుల్లో కలవరం పుట్టిస్తోంది. శశికళ తమ పార్టీ జెండాను వాడుకుంటుందేమో అనే భయం అన్నాడీఎంకే నేతల్లో మొదలైంది.

శశికళ జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో అన్నాడీఎంకే జెండా ఉన్న కారులో పయనించడం వివాదానికి దారి తీసింది. దీనిపై ఫిర్యాదులు కూడా హోరెత్తాయి. ఈ నేపథ్యంలో తమ జెండా వాడకుండా చిన్నమ్మను కట్టడిచేయాలనుకుంటోంది అధికార పార్టీ. శశికళను అడ్డుకోవాలని కోరుతూ పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదనన్, సంయుక్త కన్వీనర్లు కేపీ మునుస్వామి, వైద్యలింగం, మంత్రులు సీవీ షణ్ముగం, జయకుమార్, తంగమణి, వేలుమణి డీజీపీ త్రిపాఠికి ఫిర్యాదు చేశారు. తమ పార్టీకి సంబంధం లేని వారు తమ జెండాను ఉపయోగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అన్నాడీఎంకే జెండాను ఉపయోగించే అర్హత పార్టీ కార్యకర్తలు, నాయకులకు మాత్రమే ఉందని కేపీ మునిస్వామి అన్నారు. అన్నాడిఎంకే పార్టీ పన్నీరు సెల్వం, పళని స్వామి నేతృత్వంలోని కమిటీకే చెందుతుందని, ఇప్పటికే ఎన్నికల సంఘం ఈ విషయాన్ని స్పష్టం చేసిందని పేర్కొన్నారు.

కాగా.. శశికళ చెన్నై చేరుకోగానే మెరీనా బీచ్లోని జయలలిత సమాధి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తన రాజకీయ ప్రణాళికను అక్కడి నుంచే ప్రకటించాలనుకున్నారు. జయలలిత సమాధి నుంచి తన కార్యాచరణను ప్రకటించడం ద్వారా సానుభూతిని సొంతం చేసుకోవచ్చనేది చిన్నమ్మ ఆలోచన. కానీ అన్నాడీఎంకే ప్రభుత్వం చిన్నమ్మ ఎత్తుకు పైఎత్తు వేస్తోంది. జయలలిత సమాధి తుది మెరుగులకు సంబంధించిన పనులు కొనసాగుతున్నందున 15 రోజుల పాటు ఎవరినీ అనుమతించబోమంటూ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో శశికళ జయలలిత సమాధి వద్దకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు. అటు జెండా చుట్టూ వివాదం కొనసాగుతూనే ఉంది. మొత్తానికి అధికార పార్టీ శశికళను ఒంటరి చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది.

First Published:  5 Feb 2021 7:13 AM IST
Next Story