Telugu Global
NEWS

ప‌వ‌ర్ స్టార్‌కి పవర్ దక్కే రాత లేదా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ఏపీలో పట్టుబిగించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ జనసేనతో జట్టుకట్టి దూకుడు పెంచింది. జనసేనను పెద్దగా పరిగణలోకి తీసుకోకుండానే పొత్తు మాత్రం కొనసాగుతుందని బీజేపీ నేతలు పదే పదే ప్రకటిస్తున్నారు. అదే సమయంలో తమకు పదవులు ముఖ్యం కాదని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ కొంగు వీడడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ఇదంతా తాత్కాలికమే అని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ లో జనసేన పొజిషన్ కి వస్తుందని […]

ప‌వ‌ర్ స్టార్‌కి పవర్ దక్కే రాత లేదా?
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ఏపీలో పట్టుబిగించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ జనసేనతో జట్టుకట్టి దూకుడు పెంచింది. జనసేనను పెద్దగా పరిగణలోకి తీసుకోకుండానే పొత్తు మాత్రం కొనసాగుతుందని బీజేపీ నేతలు పదే పదే ప్రకటిస్తున్నారు. అదే సమయంలో తమకు పదవులు ముఖ్యం కాదని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ కొంగు వీడడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ఇదంతా తాత్కాలికమే అని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ లో జనసేన పొజిషన్ కి వస్తుందని నిన్నా మొన్నటి దాకా ఆ పార్టీ శ్రేణులు నమ్ముతూ వచ్చారు. కానీ తాజా పరిణామాలు అందుకు అవకాశం లేదని స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ప్రకటనే అందుకు నిదర్శనం.

జన సైనికులు తమ అధినేత ముఖ్యమంత్రి కావాలని కాంక్షిస్తుంటే.. వాళ్ల ఆశలపై నీళ్లు చల్లారు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. పార్టీని స్థాపించిన తరువాత తొలి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టీడీపీ జపం చేసింది. తరువాతి ఎన్నికల్లో కమ్యూనిస్టులతో జట్టుకట్టింది. 136 స్థానాల్లో పోటీ చేసిన జనసేనకు 120 చోట్ల డిపాజిట్ కూడా దక్కలేదు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా తమతో ఉన్నాడో లేదో అర్థంకాని స్థితి.

ఘోర వైఫల్యం తరువాత కూడా జన సైనికుల్లో ఆశ చావలేదు. అందుకే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పరువు నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. అందుకోసం ముందుగానే బీజేపీతో దోస్తీ మొదలుపెట్టారు. ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రలోనూ బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తు్న్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేనకు పోటీచేసే అవకాశం కల్పించకపోయినా కాషాయపార్టీకే మా మద్దతు అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఏపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటుబ్యాంకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కలిసొస్తుందని భావిస్తున్న తరుణంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కొత్త అంశాన్ని తెరమీదకు తెచ్చాడు.

తాము అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు సోము వీర్రాజు. అధికార వైసీపీ, టీడీపీలకు ఆ దమ్ము ఉందా? అంటూ ప్రశ్నించారు. పనిలో పనిగా ఎవరినో ఎందుకు సీఎం చేస్తామని కుండ బద్ధలు కొట్టారు. పరోక్షంగా జనసేనకు, పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోమని స్పష్టం చేశారు. బీసీని ముఖ్యమంత్రిని చేసే దమ్ము ఒక్క బీజేపీకే ఉందన్న ఆయన, ఎవర్నో ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ అధికారం కోరుకోవడం లేదన్నారు. వ్యక్తుల కోసం కాదు.. ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ తపిస్తోందన్నారు.

సోము వీర్రాజు వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు కాపు వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆయన భక్తులు కలగంటుంటే.. అందుకు భిన్నంగా బీసీ వాదనను ముందుకు తెచ్చారు వీర్రాజు. దీంతో జనసైనికుల్లో గుబులు మొదలైంది. మొత్తానికి బీజేపీ జనసేనను వాడుకోవాలనుకుంటుంది తప్ప, తగిన ప్రాధాన్యత ఇవ్వాలనుకోవడం లేదని మరోమారు స్పష్టమైంది. చూడబోతే పవర్ స్టార్ కి పవర్ దక్కే అవకాశం కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  5 Feb 2021 6:19 AM IST
Next Story