బతిమాలాలా..? బెదిరించాలా..? వ్యాక్సినేషన్ పై కిం కర్తవ్యం..?
దేశవ్యాప్తంగా రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని వైద్య, ఆరోగ్య సిబ్బందికి టీకాలు ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ మొదలు పెట్టింది. రెవెన్యూ ఉద్యోగులు టీకాలు వేయించుకుంటున్నారు. అయితే తొలి దశలో కనిపించిన ఉత్సాహం కూడా రెండో దశలో లేకపోవడం విశేషం. తొలి దశలో వైద్య సిబ్బంది కూడా అనేక అనుమానాలతో వ్యాక్సినేషన్ కి దూరంగా ఉన్నారు. కనీసం 70శాతం మంది కూడా వ్యాక్సినేషన్ చేయించుకోలేదు. […]
దేశవ్యాప్తంగా రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని వైద్య, ఆరోగ్య సిబ్బందికి టీకాలు ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ మొదలు పెట్టింది. రెవెన్యూ ఉద్యోగులు టీకాలు వేయించుకుంటున్నారు. అయితే తొలి దశలో కనిపించిన ఉత్సాహం కూడా రెండో దశలో లేకపోవడం విశేషం. తొలి దశలో వైద్య సిబ్బంది కూడా అనేక అనుమానాలతో వ్యాక్సినేషన్ కి దూరంగా ఉన్నారు. కనీసం 70శాతం మంది కూడా వ్యాక్సినేషన్ చేయించుకోలేదు. ఇప్పుడు రెండో దశలో మరీ ఘోరం. రెండోదశ తొలిరోజు రెవెన్యూ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు కాగా.. 60శాతం మంది ఏవేవో సాకులతో టీకాలకు దూరంగా ఉండిపోయారట.ఈ దశలో ఉన్నత స్థాయి అధికారులు మాత్రమే వ్యాక్సినేషన్ చేయించుకుని మమ అనిపించారు. హాజరు తక్కువగా ఉండటంతో.. వ్యాక్సినేషన్ కంపల్సరీ అంటూ కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారట. దీంతో రెవెన్యూలో గగ్గోలు మొదలైంది.
అవగాహన పెంచే దారే లేదా..?
కొవిడ్ టీకా కంపల్సరీ కాదని ప్రభుత్వం ఇదివరకే తేల్చి చెప్పింది. అయితే టీకా అనుమతిలో ప్రభుత్వం పారదర్శకత పాటించలేదనే అనుమానంతో ఆదిలోనే అందరిలో సందేహాలు మొదలయ్యాయి. అందులోనూ కొవాక్సిన్ మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకముందే బయటకు రావడం, దాన్ని ఆహా ఓహో అంటూ ప్రభుత్వం ప్రజలకు అందించాలని చూడటం కూడా విమర్శలకు తావిచ్చింది. ఆపరేషన్ చేసే ముందు ఏం జరిగినా బాధ్యత మాదేనంటూ సంతకం పెట్టినట్టు.. కొవాక్సిన్ తీసుకోవాలంటే అలా అంగీకార పత్రం ఇవ్వాలనే రూల్ కూడా మరింతగా అనుమానాలు పెంచింది. ఇక టీకా పంపిణీ తర్వాత అసలు కథ మొదలైంది. టీకా వేయించుకున్న కొంతమంది అస్వస్థత పాలవడం, మరికొన్ని సందర్భాల్లో మరణాలు చోటు చేసుకోవడంతో ప్రజల్లో లేనిపోని భయాందోళనలు పెరిగాయి. ఈ భయంతోనే సగం మంది టీకా వేయించుకున్నాక అస్వస్థత పాలయ్యారని, దుష్ప్రచారాలు ఆపాలని కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. అంతేకానీ ప్రజల్లో అవగాహన పెంచేందుకు పెద్దగా ప్రయత్నాలు చేయలేదు.
రాజకీయ నాయకులు ఎందుకు వెనకాడుతున్నారు..?
గుడిలో ఉదయాన్నే వీఐపీ దర్శనం సహా.. రాజకీయ నాయకులు అన్నిట్లోనూ ముందుండాలనుకుంటారు. అలాంటి నేతలు సైతం.. ప్రజలకోసం టీకాను త్యాగం చేస్తున్నామని, ముందు కొవిడ్ వారియర్స్ వేయించుకోండి అని చెప్పడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది. టీకాతో సర్వం సమసిపోదని, టీకా వేయించుకున్న తర్వాత కూడా మాస్క్ వాడాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, రెండో డోస్ కంపల్సరీ అంటూ కంపెనీలు చేస్తున్న ప్రచారం కూడా పలు కొత్త ప్రశ్నలను ఉత్పన్నం చేసింది. ఈ దశలో సహజంగానే ప్రజలు భయపడ్డారు, టీకాకు దూరంగా ఉన్నారు.
మూడో దశ మరింత కష్టమా..?
తొలి రెండు దశల్లో వైద్య, రెవెన్యూ, పోలీస్.. డిపార్ట్ మెంట్లు సహా ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ కి టీకా ఇవ్వాలని భావిస్తున్న కేంద్రం, మూడో దశలో 50ఏళ్లు దాటిన వారిని లెక్కలోకి తీసుకుంది. వైద్య సిబ్బంది, ఇతర ఉద్యోగులే టీకాకు వెనకాడుతున్న వేళ, సామాన్య ప్రజలు అంత తొందరగా ముందుకొస్తారా అనేది అనుమానమే? మొత్తమ్మీద భారత్ లో అట్టహాసంగా మొదలైన టీకా ప్రక్రియ అవగాహన పెంచే దారిలేక.. అవస్థలు పడుతోంది.