Telugu Global
NEWS

కేసీఆర్ మనసును ఆవిష్కరించిన ఈటల

ఏడాదికి ముందు తామే గులాబీ జెండా ఓనర్లమని ప్రకటించుకున్న తెలంగాణ వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పుడు అధినేతే సర్వసం అంటున్నారు. కేసీఆర్ ను రైతు పక్షపాతిగా అభివర్ణించడమే కాదు.. ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచీ కేసీఆర్ తోనే ఉన్న ఈటల ‘ఆయన మనసు నాకు తెలుసు’ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో తనకు ఇరవై ఏళ్ల అనుబంధం ఉందని, తనమీద ఆయనకు అజమాయిషీ ఉందని అన్నారు. […]

కేసీఆర్ మనసును ఆవిష్కరించిన ఈటల
X

ఏడాదికి ముందు తామే గులాబీ జెండా ఓనర్లమని ప్రకటించుకున్న తెలంగాణ వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పుడు అధినేతే సర్వసం అంటున్నారు. కేసీఆర్ ను రైతు పక్షపాతిగా అభివర్ణించడమే కాదు.. ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచీ కేసీఆర్ తోనే ఉన్న ఈటల ‘ఆయన మనసు నాకు తెలుసు’ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో తనకు ఇరవై ఏళ్ల అనుబంధం ఉందని, తనమీద ఆయనకు అజమాయిషీ ఉందని అన్నారు. కేసీఆర్ పై కూడా తనకు అజమాయిషీ ఉందని వెల్లడించారు.

జమ్మికుంట మండలంలో రైతు చైతన్య వేదికను ప్రారంభించిన ఆయన ముఖ్యమంత్రి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రైతు వేదికను పవిత్రమైన స్థలంగా భావించాలని, ఈ వేదికపై రైతును రాజును చేసే చర్చ జరగాలన్నారు. పంటలు, విక్రయాలకు సంబంధించిన చర్చలు చేయాలన్నారు.

కేసీఆర్ మోనార్క్ లా వ్యవహరిస్తారని కొందరు అనుకుంటారని, ఆయన తనకు నచ్చని విషయం ఎవరు చెప్పినా వినరని, తనకు నచ్చిన పనిని ఎవరు చెప్పినా వెంటనే చేస్తారని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రైతుల కోసం ఎంతో చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ కృషి ఫలితాలు ఇప్పుడు కళ్లముందు కనిపిస్తున్నాయన్నారు. రైతు ఏడిస్తే కేసీఆర్ తట్టుకోలేరని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కరెంటు కష్టాలు తీర్చారని అన్నారు. ఒకప్పుడు కనీసం పశువులకు తాగడానికి కూడా నీళ్లు దొరికేవి కావని, మిషన్ కాకతీయతో ఇప్పుడు తెలంగాణలో నీటికి కొరత లేదన్నారు మంత్రి. తెలంగాణ ప్రభుత్వానికి మానవీయ కోణం ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ మనస్తత్వం తనకు తెలుసని, వ్యవసాయ రంగంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉండాలనేది ముఖ్యమంత్రి కోరిక అని వెల్లడించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకున్నా, తాను మంత్రి లేకున్నా రైతుల కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి ముఖ్యమంత్రి పట్ల విధేయతను మాత్రమే కాదు.. ఎప్పటికీ ఆయన వెంటే నేనని చెప్పకనే చెప్పుకున్నారు ఈటల.

First Published:  3 Feb 2021 5:20 AM IST
Next Story