అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాధికా శరత్ కుమార్
తమిళ రాజకీయాల్లోకి సినీతారాగణం క్యూకడుతోంది. ఆది నుంచీ తమిళ రాజకీయాలకు సినీ రంగంతో విడదీయరాని బంధం ఉంది. దిగ్గజ నేతలందరూ సినీ నేపథ్యం నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. తమిళనాడు తొలి ముఖ్యమంత్రి అన్నాదురై నుంచి జయలలిత వరకు ఎందరో సినీ తారలు తమ భవితవ్యాన్ని రాజకీయాల్లో పరీక్షించుకున్నారు. జయలలిత మరణం తరువాత రాష్ట్రంలో ఏర్పడ్డ శూన్యతను భర్తీ చేసేందుకు పలువురు నటీనటులు ప్రయత్నించారు. కమల్ హాసన్ కొత్త పార్టీని ప్రారంభించారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి […]
తమిళ రాజకీయాల్లోకి సినీతారాగణం క్యూకడుతోంది. ఆది నుంచీ తమిళ రాజకీయాలకు సినీ రంగంతో విడదీయరాని బంధం ఉంది. దిగ్గజ నేతలందరూ సినీ నేపథ్యం నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. తమిళనాడు తొలి ముఖ్యమంత్రి అన్నాదురై నుంచి జయలలిత వరకు ఎందరో సినీ తారలు తమ భవితవ్యాన్ని రాజకీయాల్లో పరీక్షించుకున్నారు. జయలలిత మరణం తరువాత రాష్ట్రంలో ఏర్పడ్డ శూన్యతను భర్తీ చేసేందుకు పలువురు నటీనటులు ప్రయత్నించారు. కమల్ హాసన్ కొత్త పార్టీని ప్రారంభించారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి ప్రయత్నించి చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. యువ హీరోలు విజయ్, విశాల్ సైతం రాజకీయ తెరంగేట్రం వైపు చూస్తున్నారు. ఇప్పుడు మరో సీనియర్ నటి ఎన్నికల బరిలోకి దిగనుంది.
త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నటి రాధిక పోటీ చేయనుందని ఆమె భర్త, సమత్తువ మక్కల్ కట్చి అధినేత శరత్ కుమార్ స్పష్టం చేశారు. హీరోయిన్ గా అటు సిల్వర్ స్ర్కీన్ పైన, నటిగా ఇటు బుల్లితెర మీద దశాబ్దాలుగా ప్రేక్షకుల మనసు దోచుకున్న రాధిక ప్రస్తుతం సమత్తువ మక్కల్ కట్చి మహిళా విభాగానికి ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్నారు.
శరత్ కుమార్ పార్టీ ప్రస్తుతం అధికార అన్నాడీఎంకే కూటమిలో భాగంగా ఉంది. మంచి నటుడిగా గుర్తింపు పొందిన శరత్ కుమార్ పార్టీని స్థాపించి రాష్ట్రంలో అన్ని చోట్ల నుంచి పోటీచేయాలనుకున్నారు. కానీ.. ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకుంటూ ఒకటి రెండు చోట్ల నుంచి పోటీచేస్తూ వస్తున్నారు. గతంలో అన్నాడీఎంకేతో కలిసి పోటీచేసి తాను శాసన సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. ఆ తరువాత మళ్లీ ఆయనను గెలుపు వరించలేదు.
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సమత్తువ మక్కల్ కట్చి అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకుంది. కాకపోతే… గతం కంటే ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలనుకుంటోంది. అందులో భాగంగానే రాధికను ఎన్నికల్లో పోటీకి నిలబెట్టే ఆలోచనలో ఉన్నారు శరత్ కుమార్. మొత్తానికి తమిళ రాజకీయాల్లో సినీతారల సందడి పెరుగుతోంది. తమ అభిమాన తారలకోసం థియేటర్ల ముందు క్యూకట్టే జనం పోలింగ్ బూత్ ల ముందు క్యూకడతారో లేదో చూడాలి మరి.