Telugu Global
NEWS

ఆలయాల ఘటనల వెనక ఇన్ని దారుణాలా..

పంచాయతీ ఎన్నికల సందడి మొదలు కాక ముందు రాష్ట్రంలో ఆలయాల ఘటనలు హాట్ టాపిక్ గా ఉన్నాయి. ఒకదాని వెంట ఒకటి వరుసగా విగ్రహాలు ధ్వంసం కావడం, అపవిత్ర ఘటనలు జరగడంతో రాష్ట్రం ఒక్కసారిగా అట్టుడికింది. ప్రభుత్వ వైఫల్యమేనంటూ ప్రతిపక్షాలు, ప్రతిపక్షాల కుట్రేనంటూ ప్రభుత్వం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాయి. చివరకు సిట్ విచారణలో వెల్లడవుతున్న వాస్తవాలు చూస్తే రాజకీయ లాభం కోసం కొంతమంది దుర్మార్గులు రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చాలనుకున్నారనే విషయం స్పష్టమవుతోంది. పూజారిదే విధ్వంస రచన.. […]

ఆలయాల ఘటనల వెనక ఇన్ని దారుణాలా..
X

పంచాయతీ ఎన్నికల సందడి మొదలు కాక ముందు రాష్ట్రంలో ఆలయాల ఘటనలు హాట్ టాపిక్ గా ఉన్నాయి. ఒకదాని వెంట ఒకటి వరుసగా విగ్రహాలు ధ్వంసం కావడం, అపవిత్ర ఘటనలు జరగడంతో రాష్ట్రం ఒక్కసారిగా అట్టుడికింది. ప్రభుత్వ వైఫల్యమేనంటూ ప్రతిపక్షాలు, ప్రతిపక్షాల కుట్రేనంటూ ప్రభుత్వం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాయి. చివరకు సిట్ విచారణలో వెల్లడవుతున్న వాస్తవాలు చూస్తే రాజకీయ లాభం కోసం కొంతమంది దుర్మార్గులు రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చాలనుకున్నారనే విషయం స్పష్టమవుతోంది.

పూజారిదే విధ్వంస రచన..
ఇంట్లో దొంగతనం జరిగిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. పోలీసులకు పాత నేరస్తులపై అనుమానం రావడం సహజం. ఇంటి పనివారు, చుట్టుపక్కలవారు.. ఇలా అందరిపైనా అనుమానం వస్తుంది, సమాధానాలు తేడా కొడితే చివరిగా యజమానిపై దృష్టిపెడతారు పోలీసులు. అలాగే గుడిలో దొంగతనం జరిగితే పూజారిపై మొదట ఎవరికీ అనుమానం రాదు. ఈ ఉద్దేశంతోటే ఆలయ పూజారితో కొంతమంది ఈ పాడుపని చక్కబెట్టారు. ఆయనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా తీసుకుని 30వేల రూపాయలు బేరం మాట్లాడుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శ్రీరామ్ ‌నగర్‌ విఘ్నేశ్వరాలయంలో సుబ్రమణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయించారని సిట్ విభాగం అధికారులు తమ ఇన్వెస్టిగేషన్లో తేల్చారు.
అప్పటికే విజయనగరంలో రామతీర్థం ఘటన సంచలనంగా మారగా.. జనవరి 1న జరిగిన రాజమండ్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం దానికి కొనసాగింపుగా మరింత కలకలం సృష్టించింది. ఈ కేసుని ఛాలెంజింగ్ గా తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం మొత్తం 8 టీమ్ లను రంగంలోకి దించి విచారణ చేపట్టింది. ఆలయ పూజారి మర్ల వెంకట మురళీకృష్ణ, మర్ల వెంకటరాజు, దంతులూరి వెంకటపతి రాజు అనే ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు అసలు విషయం రాబట్టారు.

రాజకీయ లబ్ధికోసమే విగ్రహాల ధ్వంసం..
ఆలయాల ఘటనలు రాజకీయ దూషణలకు కారణం కావడంతో పోలీసులు అదే కోణంలో విచారణ మొదలు పెట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది. కేవలం రాజకీయ లబ్ధికోసమే కొంతమంది వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు స్పష్టం చేశారు. ఆలయ పూజారికి 30వేలు ఆశ చూపించి ఆయనచేతే విగ్రహాన్ని ధ్వంసం చేయించారని, ఆయనతోటే పోలీసులకు ఫిర్యాదు ఇప్పించి నాటకాన్ని రక్తి కట్టించారని విచారణలో నిర్థారించారు. పూజారిపై ఎవరికీ అనుమానం రాదు కాబట్టి ఈ పన్నాగం పన్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని ఇతర ఆలయాలలో జరిగిన ఘటనల తాలూకు రహస్యాలు కూడా త్వరలోనే బట్టబయలు కాబోతున్నాయి.

First Published:  1 Feb 2021 2:26 AM IST
Next Story