Telugu Global
National

ఒకనాటి కానిస్టేబుల్.. ఇవాల్టి రైతు ఉద్యమ నేత

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఆందోళనలో ఆయనే ప్రధాన ఆకర్షణ. ప్రభుత్వ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు అందరూ ఆయన అభిప్రాయాలను చెవొగ్గి వింటుంటారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల పక్షాన ఆయన ఎప్పటికప్పుడూ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటారు. తాజాగా రిపబ్లిక్ డే పరిణామాల అనంతర ప్రభుత్వ చర్యల పట్ల కలత చెందిన ఆయన ఉద్వేగానికిలోనయ్యారు. ఉద్యమానికి మార్గనిర్దేశం చేసే ఆ నాయకుడు కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ఆ కన్నీళ్లు కసిని రగిల్చాయి. రెట్టించిన ఆగ్రహంతో లక్షలాది మంది […]

ఒకనాటి కానిస్టేబుల్.. ఇవాల్టి రైతు ఉద్యమ నేత
X

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఆందోళనలో ఆయనే ప్రధాన ఆకర్షణ. ప్రభుత్వ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు అందరూ ఆయన అభిప్రాయాలను చెవొగ్గి వింటుంటారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల పక్షాన ఆయన ఎప్పటికప్పుడూ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటారు. తాజాగా రిపబ్లిక్ డే పరిణామాల అనంతర ప్రభుత్వ చర్యల పట్ల కలత చెందిన ఆయన ఉద్వేగానికిలోనయ్యారు. ఉద్యమానికి మార్గనిర్దేశం చేసే ఆ నాయకుడు కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ఆ కన్నీళ్లు కసిని రగిల్చాయి. రెట్టించిన ఆగ్రహంతో లక్షలాది మంది రైతులను మళ్లీ ఢిల్లీ సరిహద్దులకు రప్పించాయి. ఇంతకూ ఎవరా నాయకుడు? ఏంటి ఆయన కథ? ఆయనే భారతీయ కిసాన్ యూనియన్
జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ తికాయత్.

జనవరి 26 ట్రాక్టర్ ర్యాలీలో సంభవించిన అవాంఛనీయ సంఘటనల అనంతరం ప్రభుత్వం రైతు ఉద్యమంపై కన్నెర్రజేసింది. పోలీసులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారనే కారణంతో రైతు సంఘాల నాయకులపై కేసులు నమోదు చేసింది. ఘాజీపూర్ సరిహద్దులో విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేసి, వేలాది మంది పోలీసులను మోహరించి శిబిరాలను తొలగించేందుకు యత్నించింది. సింఘూ సరిహద్దులో స్థానికుల ముసుగులో హిందుత్వ సంస్థలకు చెందిన కొందరు రైతులపై దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ రైతులను హత్య చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని తికాయత్ బోరున విలపించారు. ఆయన కన్నీళ్లు గ్రామాల్లో రైతుల గుండెలను తాకాయి. ఉత్తరప్రదేశ్ లోని పలు గ్రామాల నుంచి లక్షలాది మంది రైతులు రాత్రికి రాత్రి ఘాజీపూర్ బార్డర్ కి వచ్చిచేరారు. ఇంతకూ తికాయత్ పట్ల రైతులకు ఎంతుకంత అభిమానం. ఆయన కన్నీళ్లను చూసి
ఎందుకు అంతగా స్పందించారు? వాళ్ల మనస్సులో ఆయనకు ఆ స్థానం ఎలా లభించింది?

రాకేష్ తికాయత్ ప్రస్థానం రైతు నేతగా మొదలవ్వలేదు. ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా సిసౌలి గ్రామానికి చెందిన తికాయత్ తొలుత ఢిల్లీలో కానిస్టేబుల్ గా జీవితాన్ని ప్రారంభించారు. ఆయన తండ్రి మహేంద్ర సింగ్ తికాయత్ దేశంలోనే పేరొందిన రైతు నాయకుడు. 1980లో బీకేయూ పునర్నిర్మాణంలో మహేంద్ర సింగ్ కీలక పాత్ర పోషించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్, మీరట్ ప్రాంతాల్లో ఆయన నిర్వహించిన పోరాటాలు సంచలనాలుగా మారాయి. ఆయన వారసత్వాన్ని అందుకున్న రాకేష్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదిలి రైతు ఉద్యమంలో భాగమయ్యారు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తికాయత్ చేపట్టిన పోరాటానికి సీనియర్ బీజేపీ నేత రాజనాథ్ సింగ్ మద్దతు ప్రకటించారు. 2014లో ఆయన ఆర్ఎల్ డీ తరుపున అమ్రోహా నుంచి పోటీ చేశారు కూడా.

ప్రస్థుత రైతు ఉద్యమంలో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న బీకేయూ లక్షలాది మంది రైతులను సమీకరించి ఘాజీపూర్ సరిహద్దులో రెండు నెలలుగా నిరసన వ్యక్తం చేస్తోంది. తాజా పరిణామాలతో ఆయన మొత్తం ఉద్యమంలో మెరుపులా మారారు.

ప్రస్తుత రైతు ఉద్యమానికి అధికార ప్రతినిధిగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తికాయత్ పై మొదటి నుంచీ అనేక విమర్శలున్నాయి. డిసెంబర్ 28న తన మద్దతుదారులతో తికాయత్ యూపీ సరిహద్దులోని ఘాజీపూర్ లో బైఠాయించారు. కానీ.. పంజాబ్, హర్యానా రైతులను అదుపు చేసేందుకు ప్రభుత్వం తికాయత్ ను వాడుకుంటోందని కొందరు అభిప్రాయపడ్డారు. అఖిల భారత రైతు సమన్వయ సమితిలోని పలువురు ఆయన నిబద్ధతను శంఖించారు. రాకేష్ పట్ల అనుమానాలకు ఆయన రాజకీయ ఆచరణ కూడా కారణం. కానీ రిపబ్లిక్ డే పరిణామాల తరువాత ఆయన ఒక్కసారిగా హీరో అయిపోయారు.

తికాయత్ మొదటి నుంచీ వివాదాలకు కేరాఫ్ గా ఉంటూ వచ్చారు. గతంలో కన్వర్ యాత్ర (వార్షిక హిందూ తీర్థయాత్ర) సందర్భంగా రైతుల ఆందోళనకు ఆలయ ట్రస్టులు విరాళాలు ఇవ్వాలని కోరారు. నేను బీజేపీకి ఓటు వేశాను కానీ.. ప్రజల నమ్మకాన్ని ప్రభుత్వం ఒమ్ము చేసిందని మాట్లాడారు. రైతులు ర్యాలీకి కర్రలు పట్టుకు రావాలని పిలుపునిచ్చారు. ఆందోళన స్థలంలో కాషాయ రంగు టెంటును వేసుకొని కాషాయం కేవలం అధికార పార్టీ సొంతం కాదని ప్రకటించారు. ఇలా.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండడం ఆయన ప్రత్యేకత.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనను నడిపించడంలో తికాయత్ ప్రత్యేకతను చాటుకున్నారు. ఢిల్లీ – మీరట్ ఎక్స్ ప్రెస్ వేపై ఆయన మద్దతుదారులతో రెండు నెలలుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన ముస్సోరి నుంచి డెహ్రడూన్ వరకు ప్రయాణించారు. స్థానిక రైతులతో సంభాషించారు. రైతు ఆందోళనా స్థలంలో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రైతు సంఘాల మధ్య ఆయన వంతెనలా మారారు. రైతులు గ్రామాల నుంచి తెచ్చుకున్న ట్రాక్టర్ ట్రాలీలనే నివాసాలుగా మార్చుకోవాలని ఆయన సూచించారు. తాజా రైతు ఉద్యమంతో స్థానిక బీజేపీ నాయకులు తమ రాజకీయ పలుకుబడి తగ్గిపోయిందని గ్రహించలేకపోయారు.

జనవరి 28 నాటి తికాయత్ వీడియో దావానంలా వ్యాపించింది. ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్, మథుర మహాపంచాయత్ లు సమూహికంగా రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. తికాయత్ ను పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో తిరుగులేని నేతగా మార్చింది. కానీ ప్రస్థుతం ఉత్తర ప్రదేశ్ లో రైతు ఉద్యమాన్ని జాట్ లకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఘర్షణగా కొందరు అభివ‌ర్ణిస్తున్నారు. ఈ ప్రచారాన్ని తికాయత్ తప్పుబట్టారు. ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు కొందరు ఇది సిక్కులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఘర్షణగా, జాట్ లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఘర్షణగా ప్రచారం చేస్తున్నారని కొట్టిపారేశారు. మొత్తానికి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఆందోళనలో రాకేష్ తియాకత్ ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా మారారు.

First Published:  1 Feb 2021 6:58 AM IST
Next Story