నిమ్మగడ్డకు శీల పరీక్ష..
నీతికి, నిజాయితీకి తాను మారుపేరు అని చెబుతుంటారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. అధికార పార్టీ తనను అపార్థం చేసుకుందని, అప్పుడు ఎన్నికలు వాయిదా వేసినా, ఇప్పుడు జరగాలని పట్టుబడుతున్నా ప్రజా సంక్షేమమే తన ప్రధాన బాధ్యత అని చెప్పుకుంటుంటారు. అలాంటి నిమ్మగడ్డపై చాలానే అపవాదులున్నాయి. కేవలం అధికార పార్టీ ఆరోపించిందని కాదు కానీ, బీజేపీ నేతలతో హోటల్ గదిలో రహస్య సమావేశం, గతంలో హోంశాఖకు ఆయన రాసిన లేఖ ముందుగా టీడీపీ అనుకూల మీడియాలో లీకవడం, […]
నీతికి, నిజాయితీకి తాను మారుపేరు అని చెబుతుంటారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. అధికార పార్టీ తనను అపార్థం చేసుకుందని, అప్పుడు ఎన్నికలు వాయిదా వేసినా, ఇప్పుడు జరగాలని పట్టుబడుతున్నా ప్రజా సంక్షేమమే తన ప్రధాన బాధ్యత అని చెప్పుకుంటుంటారు. అలాంటి నిమ్మగడ్డపై చాలానే అపవాదులున్నాయి. కేవలం అధికార పార్టీ ఆరోపించిందని కాదు కానీ, బీజేపీ నేతలతో హోటల్ గదిలో రహస్య సమావేశం, గతంలో హోంశాఖకు ఆయన రాసిన లేఖ ముందుగా టీడీపీ అనుకూల మీడియాలో లీకవడం, ఎన్నికలకు కోర్టు అనుకూల తీర్పు ఇచ్చిన తర్వాత టీడీపీ శ్రేణులు ఆయనకు సన్మానాలు చేయడం.. ఇలాంటివన్నీ ఆ అపవాదుల్ని, అనుమానాలను బాగానే బలపరిచాయి.
అధికార పార్టీతో ఉప్పు-నిప్పు..
నిమ్మగడ్డ ఏది చేసినా అధికార పార్టీ తప్పుబడుతుంది, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా నిమ్మగడ్డ వారికి సహకరించరు. ఇలా జరుగుతూ ఉంది ప్రస్తుతం వీరి వ్యవహారం. ఇటీవల ఏకగ్రీవాల పేరుతో ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై కూడా ఆయన సమాచార శాఖ వివరణ కోరారు. అదే సమయంలో టీడీపీ ఏకంగా పంచాయతీ ఎన్నికలకోసం మేనిఫెస్టో విడుదల చేయడం, దానిపై నిమ్మగడ్డ మౌనంగానే ఉండటం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ గుర్తింపు రద్దు చేసి నిమ్మగడ్డ తన నిజాయితీ నిరూపించుకోవాలని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. పోనీ అంబటి అధికార పార్టీ మనిషి అనుకున్నా కూడా.. సగటు ఓటరు సోషల్ మీడియా వేదికగా ఇవే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏకగ్రీవాల నజరానా ప్రకటించడం ప్రభుత్వం తప్పు అయితే, పార్టీ ప్రస్తావన లేకుండా జరిగే ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం పెద్ద తప్పే కదా అని లాజిక్ తీస్తున్నారు. చంద్రబాబే స్వయంగా మేనిఫెస్టో విడుదలే చేసి, తన ఫొటో, తన కొడుకు ఫొటోతో ప్రచారం చేసుకుంటున్నా ఎన్నికల కమిషన్ సైలెంట్ గా ఉండటం సరికాదని అంటున్నారు. ఏకగ్రీవాలపై నిముషాల వ్యవధిలో స్పందించిన ఎస్ఈసీ.. మేనిఫెస్టోపై గంటలు గడుస్తున్నా మౌనంగా ఎందుకు ఉన్నారని అడుగుతున్నారు.
నిజాయితీ నిరూపించుకుంటారా..?
పదే పదే తన నిజాయితీ గురించి వల్లెవేసే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఇప్పుడు నిజంగానే తన నిజాయితీ నిరూపించుకునే అవకాశం దొరికింది. కులముద్రను కడిగేసుకునే ఛాన్స్ దక్కింది. మేనిఫెస్టోపై టీడీపీ వివరణ కోరినా, చంద్రబాబుపై చర్యలు తీసుకున్నా.. ఆయన ఏ ఒక్క వర్గానికి చెందినవారు కారు అని ప్రజలు నమ్ముతారు. ఎన్నికల ప్రక్రియపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు ఉండవు. మరి ఈ అవకాశాన్ని నిమ్మగడ్డ ఉపయోగించుకుంటారా..? లేక చంద్రబాబుపై స్వామిభక్తి నిరూపించుకుంటారా..? వేచి చూడాలి.