Telugu Global
National

అసోం ప్రతీకారాన్ని యూపీలో తీర్చుకుంటారా..?

దేశ సంకీర్ణ రాజకీయాల్లో మరో పెళ్లి పెటాకులు కాబోతోందా..? వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే.. బీహార్ లో బీజేపీ, జేడీయూ కాపురం సవ్యంగా సాగేట్టు కనపడటంలేదు. అసోంలో మిత్రపక్షం జేడీయూ నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపుని ప్రోత్సహించి బీజేపీ కలహాలకు మూల కారణంగా మారడంతో.. ఉత్తర ప్రదేశ్ లో ప్రతీకారాన్ని తీర్చుకోడానికి జేడీయూ సిద్ధమైంది. వచ్చే ఏడాది జరగాల్సిన యూపీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగి సత్తా చూపుతామంటోంది. సింగిల్ గా వచ్చినా, ఎన్డీఏగా వచ్చినా యూపీలో జేడీయూకి […]

అసోం ప్రతీకారాన్ని యూపీలో తీర్చుకుంటారా..?
X

దేశ సంకీర్ణ రాజకీయాల్లో మరో పెళ్లి పెటాకులు కాబోతోందా..? వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే.. బీహార్ లో బీజేపీ, జేడీయూ కాపురం సవ్యంగా సాగేట్టు కనపడటంలేదు. అసోంలో మిత్రపక్షం జేడీయూ నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపుని ప్రోత్సహించి బీజేపీ కలహాలకు మూల కారణంగా మారడంతో.. ఉత్తర ప్రదేశ్ లో ప్రతీకారాన్ని తీర్చుకోడానికి జేడీయూ సిద్ధమైంది. వచ్చే ఏడాది జరగాల్సిన యూపీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగి సత్తా చూపుతామంటోంది. సింగిల్ గా వచ్చినా, ఎన్డీఏగా వచ్చినా యూపీలో జేడీయూకి పెద్దగా ఒరిగేదేమీ లేదు. కాకపోతే బీజేపీతో తెగతెంపులకోసమే జేడీయూ ఈ ఎత్తువేసిందనే విషయం స్పష్టమవుతోంది.

అసోంలో జరిగిన పరిణామాలతోనే జేడీయూకి జ్ఞానోదయం అయింది. నమ్మకంగా ఉన్న మిత్ర పక్షమే తమ ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడుతున్న విషయాన్ని గ్రహించలేకపోయిన జేడీయూ తీరిగ్గా చేతులు కాలాక ఆకులు పట్టుకుంది. బీహార్ లో జరగాల్సిందంతా జరిగిపోయింది. ముఖ్యమంత్రి పీఠం నితీశ్ కుమార్ కి దక్కినా.. అక్కడ బీజేపీ అధికారమే చలామణిలో ఉంది. దీంతో ఏకంగా పార్టీ అధ్యక్ష పదవికే రాజీనామా చేసి తన అసంతృప్తిని వెళ్లగక్కారు నితీశ్, సీఎంగా కూడా ఉండలేనని అంటున్నారు. వీటన్నిటికీ ప్రతీకారం యూపీ ఎన్నికల్లో తీర్చుకుంటామని పరోక్షంగా బీజేపీకి హెచ్చరికలు జారీ చేశారు.

గతంలో యూపీ ఎన్నికల రణరంగంలో జేడీయూ ఒకటీ అరా స్థానాలతో సంతృప్తి పడుతూ వచ్చింది. ఎన్డీఏతో జట్టు కట్టిన తర్వాత పూర్తిగా ఆ పార్టీకి మద్దతు తెలుపుతూ అస్త్ర సన్యాసం చేశారు జేడీయూ నేతలు. అంతమాత్రాన యూపీలో నితీష్ కి పట్టులేదని కాదు, కానీ తన ఓటుబ్యాంకునంతా బీజేపీవైపు మళ్లించి త్యాగమూర్తిగా మారారాయన, బీహార్ లో అధికారంతో సరిపెట్టుకున్నారు. అయితే 2022లో జరగబోయే యూపీ ఎన్నికల్లో మాత్రం జేడీయూ ఒంటరిగా పోటీ చేస్తుందని, బీజేపీపై కూడా అభ్యర్థుల్ని నిలబెడతామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయం వల్ల బీహార్ లోని తమ సంకీర్ణ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదని ముక్తాయింపునిచ్చారు. జేడీయూ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి చేసిన ఈ ప్రకటన బీజేపీని కలవర పెడుతోంది. యూపీలో పరిస్థితులు రోజు రోజుకీ చేయి దాటుతున్న వేళ, యోగి ఆదిత్యనాథ్ కి రెండోసారి అధికారం దక్కడం అనుమానంగా మారిన వేళ.. జేడీయూ రెబల్ గా మారడం ఆ పార్టీ అధినేతల్ని చికాకు పెడుతోంది. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్.. ముప్పేట దాడితో సతమతం అవుతున్న బీజేపీకి, జేడీయూ కూడా హ్యాండ్ ఇస్తే.. యూపీలో నెగ్గుకు రావడం కష్టమే. అసోంలో చేసిన పాపానికి యూపీలో ప్రతిఫలం అనుభవించబోతోందనమాట బీజేపీ.

First Published:  28 Jan 2021 2:23 AM IST
Next Story