Telugu Global
NEWS

చక్రబంధంలో కేసీఆర్..

కేసీఆర్ చక్రబంధంలో చిక్కుకుపోయారా..? కేసీఆర్ నిర్ణయాలను ఆహా ఓహో అంటూ పొగిడేవారే.. ఇప్పుడు ఆయన తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తున్నారా..? రెండో దఫా అధికారం చేపట్టిన తర్వాత కేసీఆర్ కి అన్నీ ప్రతికూలతలే ఎదురవుతున్నాయా..? తెలంగాణలో జరుగుతున్న వరుస పరిణామాలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఎన్నికలలో ఎదురు దెబ్బలు.. సింపతితో గెలవాల్సిన దుబ్బాక చేజారింది. సెంచరీ కొడతామంటూ బీరాలు పలికిన జీహెచ్ఎంసీలో ఘోర పరాభవం ఎదురైంది. ఈ రెండిటికంటే ఎక్కువ కేసీఆర్ ని ఆందోళన పెట్టే విషయం […]

చక్రబంధంలో కేసీఆర్..
X

కేసీఆర్ చక్రబంధంలో చిక్కుకుపోయారా..? కేసీఆర్ నిర్ణయాలను ఆహా ఓహో అంటూ పొగిడేవారే.. ఇప్పుడు ఆయన తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తున్నారా..? రెండో దఫా అధికారం చేపట్టిన తర్వాత కేసీఆర్ కి అన్నీ ప్రతికూలతలే ఎదురవుతున్నాయా..? తెలంగాణలో జరుగుతున్న వరుస పరిణామాలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి.

ఎన్నికలలో ఎదురు దెబ్బలు..
సింపతితో గెలవాల్సిన దుబ్బాక చేజారింది. సెంచరీ కొడతామంటూ బీరాలు పలికిన జీహెచ్ఎంసీలో ఘోర పరాభవం ఎదురైంది. ఈ రెండిటికంటే ఎక్కువ కేసీఆర్ ని ఆందోళన పెట్టే విషయం తెలంగాణలో బీజేపీ బలపడటం. దుబ్బాక, గ్రేటర్ ఫలితాలతో బీజేపీ బలం పుంజుకోవడం కేసీఆర్ ని కలవర పెడుతోంది.

నై మోదీ నుంచి జై మోదీ వరకు..
రైతు చట్టాలను సమర్థించేది లేదని చెప్పిన కేసీఆర్, ఢిల్లీ పర్యటన తర్వాత పూర్తిగా మెత్తబడ్డారనే విషయం స్పష్టమైంది. రైతుల తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చంటూ కేసీఆర్ గేట్లు ఎత్తేసి పరోక్షంగా కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు మద్దతు పలికారు. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా ఒకరోజు ధర్నాలో వీరవిహారం చేసిన కేసీఆర్ ఆ తర్వాత పూర్తిగా మారిపోయారు. అంతెందుకు కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ అమలుని తెలంగాణలో అడ్డుకున్న ఆయనే.. ఆ తర్వాతి కాలంలో ఆ పథకాన్ని పొగడ్తల్లో ముంచెత్తడం, తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ కు రెడ్ కార్పెట్ పరవడం మరింత విశేషం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకోసం కేంద్రం తీసుకొచ్చిన 10శాతం రిజర్వేషన్ల అమలులో కూడా కేసీఆర్ వెనకడుగే వేశారు. రాష్ట్రాల నిర్ణయాధికారం ప్రకారం ఇన్నాళ్లూ ఆ రిజర్వేషన్ల అమలుని తొక్కిపట్టిన ఆయన.. హడావిడిగా వాటిని తెలంగాణలో అమలు చేశారు.

ఉద్యోగుల్లో తగ్గుతున్న పట్టు..
తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ కి ఉద్యోగులో పెద్దబలం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా కేసీఆర్ కి ఉద్యోగులు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు. ఆర్టీసీ వ్యవహారంలో కొంత వ్యతిరేకత వచ్చినా.. అందర్నీ ఇంటికి పిలిచి భోజనం పెట్టి మరీ అసంతృప్తి జ్వాలల్ని చల్లార్చిన చాణక్యుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ ఇప్పుడు పీఆర్సీ ఫిట్ మెంట్ వ్యవహారంతో ఇరుకున పడ్డారు. ఉద్యోగులు అడిగింది కొండంత అయితే కేసీఆర్ ఇచ్చింది గోరంత. ఈరెండిటి మధ్య తేడా ఎక్కువగా ఉండటంతో ఉద్యోగ సంఘాలన్నీ పార్టీలకతీతంగా ఏకమయ్యాయి. కేసీఆర్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. 7.5శాతానికి ఒప్పుకునేదే లేదని తేల్చి చెబుతున్నాయి.

చికాకు పుట్టిస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు..
ముదిరాజ్ లకు చెరువులు, చేపలపై పూర్తి హక్కులుంటాయని మంత్రి తలసాని చేసిన కామెంట్స్ కొన్నిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. మత్స్యకార వర్గానికి చెందినవారు మంత్రి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆయన క్షమాపణ చెప్పినా వినడంలేదు, రాజీనామాకోసం పట్టుబడుతున్నారు. తలసాని వ్యాఖ్యలపై ఇతర రాష్ట్రాల్లో కూడా బెస్తవారు నిరసనలు తెలుపుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఇక రసమయి బాలకిషన్ లాంటి ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వాన్ని లిమిటెడ్ కంపెనీతో పోల్చడం, తమ చేతులు కట్టేశారని అనడంతో భేదాభిప్రాయాలు బైటపడుతున్నాయి. ఉద్యమ సమయంలో చూసిన కేసీఆర్ వేరు, ఇప్పుడు సీఎంగా చూస్తున్న కేసీఆర్ వేరు.. అంటూ చాలామంది ఇప్పటికే పార్టీని వీడారు. మరికొంతమంది చేజారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దశలో యువరాజు పట్టాభిషేకానికి కేసీఆర్ మహూర్తాలు పెట్టడం ఒక్కటే టీఆర్ఎస్ శ్రేణుల్లో కాస్త ఉత్సాహం నింపే కార్యక్రమంగా తెలుస్తోంది. మొత్తమ్మీద అధికార పార్టీ నేతలతో సహా ఏ వర్గం ప్రజలు కూడా రెండో దఫా కేసీఆర్ పాలనపై సంతృప్తిగా లేరనే విషయం స్పష్టమవుతోంది.

First Published:  27 Jan 2021 11:52 PM GMT
Next Story