శశికళ విడుదల.. కానీ..!
తమిళనాట అమ్మ స్థానాన్ని భర్తీ చేయాలని కలలుగన్న చిన్నమ్మ.. ఎట్టకేలకు జైలునుంచి విడుదలయ్యారు. జయలలిత మరణం తర్వాత.. శశికళ ముఖ్యమంత్రి అవుతారనుకున్న క్రమంలో అక్రమాస్తుల కేసులో చిక్కుకుని నాలుగేళ్లపాటు జైలుజీవితం గడిపారామె. 2017 ఫిబ్రవరి నుంచి బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఉన్న ఆమె ఈరోజు విడుదలయ్యారు. విడుదలకు కొన్ని రోజుల ముందే తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె.. కరోనాబారిన కూడా పడ్డారు. ప్రస్తుతం కరోనా నెగెటివ్ అని డాక్టర్లు చెబుతున్నా ఆస్పత్రినుంచి డిశ్చార్జి చేసే అవకాశాలు […]
తమిళనాట అమ్మ స్థానాన్ని భర్తీ చేయాలని కలలుగన్న చిన్నమ్మ.. ఎట్టకేలకు జైలునుంచి విడుదలయ్యారు. జయలలిత మరణం తర్వాత.. శశికళ ముఖ్యమంత్రి అవుతారనుకున్న క్రమంలో అక్రమాస్తుల కేసులో చిక్కుకుని నాలుగేళ్లపాటు జైలుజీవితం గడిపారామె. 2017 ఫిబ్రవరి నుంచి బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఉన్న ఆమె ఈరోజు విడుదలయ్యారు. విడుదలకు కొన్ని రోజుల ముందే తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె.. కరోనాబారిన కూడా పడ్డారు. ప్రస్తుతం కరోనా నెగెటివ్ అని డాక్టర్లు చెబుతున్నా ఆస్పత్రినుంచి డిశ్చార్జి చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. క్వారంటైన్ సమయం పూర్తయ్యే వరకు ఆమెను ఆస్పత్రిలోనే ఉంచుతామంటున్నారు. ఒకవేళ కుటుంబ సభ్యులు కోరితే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తారు.
ఈ నేపథ్యంలో శశికళను బెంగళూరు నుంచి తమిళనాడులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శశికళ జైలు నుంచి విడుదల కాగానే భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఆమె అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరప్పణ అగ్రహార జైలు నుంచి చెన్నై వరకు వెయ్యి వాహనాలతో స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్ మున్నేట్రకళగం అధినేత, ఎమ్మెల్యే దినకరన్ టీమ్ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
శశికళతోపాటు అదే కేసులో శశికళ బంధువులు ఇళవరసి, బి.ఎస్. సుధాకర్ కి కూడా శిక్షపడింది. ఇళవరసిికి కూడా కరోనా సోకింది. కానీ ఎలాంటి లక్షణాలు లేవు. ఆమెను ఫిబ్రవరి మొదటి వారంలో జైలు నుంచి విడుదల చేస్తారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్న సమయంలోనే శశికళ జైలు నుంచి విడుదలవుతున్న నేపథ్యంలో.. అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
శశికళను అధ్యక్షురాలిగా టీటీవి దినకరన్, అమ్మ మక్కల్ మున్నేట్రకళగం అనే పార్టీని స్థాపించి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన దినకరన్ ఆ తర్వాత పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభ సీట్లలో 37 మందిని బరిలో దింపినా ప్రయోజనం లేదు. ఇప్పుడు శశికళ జైలునుంచి విడుదలై.. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని తిరిగి గాడిలో పెడతారా లేదా అనేది తేలాల్సి ఉంది. కానీ శశికళకు మాత్రం తన నెచ్చెలి జయలలిత పార్టీ అన్నాడీఎంకేపైనే మనసుంది. అయితే అలాంటి ఆశలపై సీఎం పళనిస్వామి ఇదివరకే నీళ్లు చల్లారు. శశికలను ఓసారి పార్టీనుంచి బహిష్కరించామని, తిరిగి పార్టీలోకి తీసుకునే అవకాశమే లేదని స్పష్టం చేశారు. అటు శశికళ జైలు జీవితానికి కారణమైందనే అనే అపవాదు మోస్తున్న బీజేపీ, ఆమెను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తోంది. అన్నాడీఎంకేలో శశికళను చేర్చే అవకాశం లేకపోతే.. బీజేపీలో చేర్చుకోవాలని కూడా అనుకుంటున్నారట. ఇవేవీ లేకుండా అమ్మ మక్కల్ పార్టీతోనే శశికళ రాజకీయ పోరాటం ప్రారంభిస్తే మాత్రం తమిళనాడు రాజకీయాలు మరింత రంజుగా మారతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.