నేడు ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్.. 25న సుప్రీంలో విచారణ
ఏపీ పంచాయతీ ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ శనివారం ఉదయం 10 గంటలకు విడుదల చేయడానికి రంగం సిద్దమైంది. గత కొన్నాళ్లుగా పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వహణను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును గురువారం హైకోర్టు కొట్టేసింది. పంచాయతీ ఎన్నికలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి అవసరమైన సమాచారాన్ని ఎస్ఈసీ నిమ్మిగడ్డ రమేష్ […]
ఏపీ పంచాయతీ ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ శనివారం ఉదయం 10 గంటలకు విడుదల చేయడానికి రంగం సిద్దమైంది. గత కొన్నాళ్లుగా పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వహణను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును గురువారం హైకోర్టు కొట్టేసింది. పంచాయతీ ఎన్నికలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి అవసరమైన సమాచారాన్ని ఎస్ఈసీ నిమ్మిగడ్డ రమేష్ కుమార్ ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి తెప్పించుకున్నారు. శుక్రవారం రాత్రంతా కసరత్తు చేసిన ఎస్ఈసీ శనివారం ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు.
తొలి దశలో 11 జిల్లాలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ 11 జిల్లాల్లోని ఒక్కో డివిజన్ పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. తొలి దశలో గుంటూరు, చిత్తూరు జిల్లాలను మినహాయించారు. కాగా, ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం కోరినా నిమ్మగడ్డ మాత్రం నిర్వహణకే మొగ్గు చూపుతున్నారు. గత మార్చిలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అక్రమాలను, హింసను నివారించడంలో విఫలమయ్యారనే కారణంతో 9 మంది అధికారులను కూడా నిమ్మగడ్డ విధుల నుంచి తప్పించారు. ఇక శనివారం 10 గంటలకు నోటిఫికేషన విడుదల చేస్తుండగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌లకు ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు.
ఇక నోటిఫికేషన్ అనంతరం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికలు జరిగే 11 జిల్లాల పంచాయతీ, పోలీసులు, ఇతర అధికారులు, కలెక్టర్లతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అందరికీ సందేశాలు పంపారు. అయితే ప్రభుత్వం ఎన్నికలకు సిద్దంగా లేని నేపథ్యంలో వీరందరూ ఈ సమావేశంలో పాల్గొంటారా లేదా అనే దానిపై సందిగ్దత నెలకొన్నది.
ఇక ఏపీలో వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో ఎన్నికల నిర్వహణకు సిద్దంగా లేమని ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూనే వస్తున్నది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారమే స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించిన విచారణ జనవరి 25న జరుగనున్నది. ఈ పిటిషన్‌ను జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించనుంది.