Telugu Global
National

మూడ్ ఆఫ్ ది నేషన్ ఎన్డీఏ.. రాష్ట్రాల మూడ్ మాత్రం వేరే..

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దేశవ్యాప్తంగా ఎన్డీఏకి 321 స్థానాలు వస్తాయని, 43శాతం ఓట్లు పడతాయని ‘ఇండియా టుడే – కార్వీ’ సంస్థలు సంయుక్తంగా జరిపిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చి చెప్పింది. గతేడాది ఆగస్ట్ లో చేపట్టిన సర్వేలో ఎన్డీఏకి 316 సీట్లు వస్తాయని ఇదే సర్వే తేల్చగా ఇప్పుడా నెంబర్ పెరగడం గమనార్హం. అంతా బాగానే ఉంది, మూడ్ ఆఫ్ ది నేషన్ ఎన్డీఏ వైపే ఉందని తేలుతోంది. ఈ సర్వేతో సంబరపడితే […]

మూడ్ ఆఫ్ ది నేషన్ ఎన్డీఏ.. రాష్ట్రాల మూడ్ మాత్రం వేరే..
X

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దేశవ్యాప్తంగా ఎన్డీఏకి 321 స్థానాలు వస్తాయని, 43శాతం ఓట్లు పడతాయని ‘ఇండియా టుడే – కార్వీ’ సంస్థలు సంయుక్తంగా జరిపిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చి చెప్పింది. గతేడాది ఆగస్ట్ లో చేపట్టిన సర్వేలో ఎన్డీఏకి 316 సీట్లు వస్తాయని ఇదే సర్వే తేల్చగా ఇప్పుడా నెంబర్ పెరగడం గమనార్హం. అంతా బాగానే ఉంది, మూడ్ ఆఫ్ ది నేషన్ ఎన్డీఏ వైపే ఉందని తేలుతోంది. ఈ సర్వేతో సంబరపడితే అందులో విశేషమేముంది. ఇప్పటిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరగడంలేదు కదా. పోనీ అసెంబ్లీ ఫలితాలపై మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రభావం చూపుతుందా అంటే అదీ లేదు. ఇటీవల వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకోసం జరిగిన సర్వేలలో స్థానిక పార్టీలదే విజయం అని మరోసారి తేలింది.

పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీదే అధికారం అని సర్వేలు చెబుతున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బలం ఎంత పెరిగినా, టీఎంసీ బలగాన్ని ఎంతలా తనలో కలిపేసుకుంటున్నా.. అసెంబ్లీ ఎన్నికల విషయంలో దీదీకి తిరుగే లేదని అంటున్నారు.

ఇక తమిళనాట డీఎంకేదే అధికారం అని ఏబీపీ సీ ఓటర్ సర్వే తేల్చి చెప్పింది. అధికార అన్నాడీఎంకే, కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీతో కలసి పోటీ చేసినా ఫలితం లేదని, రెండు పార్టీలకు కలిపి సెంచరీ కూడా దాటలేవని తెల్చి చెప్పింది. ఇక కాంగ్రెస్ తో కలసి పోటీ చేస్తున్న డీఎంకే.. 163 మార్కు దాటుతుందని, తమిళనాడు నెక్స్ట్ సీఎం స్టాలిన్ అని సర్వే చెబుతోంది.

ఇదే ఏడాది ఎన్నికలు జరగబోతున్న కేరళలో కూడా బీజేపీ సత్తా చూపే అవకాశం లేదని చెబుతున్నాయి సర్వేలు. ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ఫలితాల ప్రకారం కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా లెఫ్ట్ కూటమి విజయం సాధించబోతుందనమాట. మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలోని ఎల్‌డీఎఫ్‌కు 41.6 శాతం ఓట్లతో 81 నుంచి 89 సీట్లు దక్కుతాయని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 36.6 శాతం ఓట్లతో 49 నుంచి 57 సీట్లకు పరిమితం అవుతుందని ఏబీపీ-సీఓటర్ సర్వేలో తేలింది. ఇక బీజేపీ స్కోర్ చెబితే దిమ్మతిరుగుతుంది. ఆ పార్టీకి కేవలం 2 సీట్లు మాత్రమే వస్తాయని చెబుతోంది సర్వే. రాగా పోగా అసోంలో మాత్రమే అధికార బీజేపీ తన పట్టు నిలుపుకుంటుందనే విషయం తేలుతోంది.

అంటే.. దేశవ్యాప్తంగా ఎప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగినా.. ఎన్డీఏకే ఓటు వేస్తామని చెబుతున్న ఓటర్లు.. అసెంబ్లీ విషయానికొచ్చే సరికి స్థానిక పార్టీలకే మొగ్గు చూపుతున్నారు. ఈ చిక్కులనుంచి తప్పించుకోడానికే బీజేపీ జమిలి జపం చేస్తోంది. మూడ్ ఆఫ్ ది నేషన్ ఎలా ఉన్నా.. అసెంబ్లీ మూడ్ ని కూడా ఒడిసిపట్టాలని చూస్తోంది.

First Published:  22 Jan 2021 5:28 AM IST
Next Story