కర్నూలే కీలకం.. హోదాపై ఆగని సమరం..
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఒకరోజు పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని కలసిన ఆయన.. వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు. దాదాపు 85నిమిషాలపాటు సాగిన ఈ భేటీలో కర్నూలుకు హైకోర్టుని తరలించడం, ప్రత్యేక హోదా డిమాండ్.. రెండూ కీలకంగా మారాయి. మీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.. అమలుచేయండి.. రాజధాని ప్రాంతాల వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి చట్టం-2020లో భాగంగా.. న్యాయ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని భావించామని దానికి సంబంధించిన కార్యాచరణకు సహకరించాలని […]
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఒకరోజు పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని కలసిన ఆయన.. వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు. దాదాపు 85నిమిషాలపాటు సాగిన ఈ భేటీలో కర్నూలుకు హైకోర్టుని తరలించడం, ప్రత్యేక హోదా డిమాండ్.. రెండూ కీలకంగా మారాయి.
మీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.. అమలుచేయండి..
రాజధాని ప్రాంతాల వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి చట్టం-2020లో భాగంగా.. న్యాయ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని భావించామని దానికి సంబంధించిన కార్యాచరణకు సహకరించాలని అమిత్ షా ని కోరారు సీఎం జగన్. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్ జారీ చేయాలని విజ్ఞప్తి చేసిన జగన్, 2019 ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పొందుపరిచారని మరోసారి గుర్తు చేశారు. న్యాయరాజధాని విషయంలో బీజేపీని మరోసారి అలా లాక్ చేశారు.
ప్రత్యేక హోదాపై ఆగని పోరు..
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పుడే తేల్చి చెప్పారు, ప్యాకేజీతో సరిపెట్టుకున్నారు. వైసీపీ మినహా ఏపీలోని ఇంకే పార్టీ కూడా ప్రత్యేక హోదాపై మాట్లాడటంలేదు. దాదాపుగా ప్రజలు కూడా హోదా ఇక రాదు అనుకుంటున్న టైమ్ లో సీఎం జగన్ పర్యటన మరోసారి ఆశలు చిగురింపజేసింది. ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న ఏపీలాంటి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అవసరం చాలా ఉందని, ప్రత్యేక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కారణంగా కేంద్రం నుంచి గ్రాంట్లు లభిస్తే, ఆర్థిక భారం క్రమంగా తగ్గుతుందని, కొత్త పరిశ్రమలు, ఉద్యోగావకాశాలు లభిస్తాయని, అందుకే ప్రత్యేక హోదా ఇవ్వాలని అమిత్ షా ని కోరారు జగన్.
మిగతా అంశాలివే..
– పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ కాస్ట్ కమిటీ సిఫార్సు మేరకు ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55,656.87 కోట్లుగా ఆమోదించాలని సీఎం జగన్ కోరారు.
– విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటుకి సహకరించాలన్నారు. విజయనగరం జిల్లా సాలూరులో ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటుకి రాష్ట్ర ప్రభుత్వం 250 ఎకరాలను గుర్తించిందని దీనిపై తదుపరి కార్యాచరణకు సహకరించాలని కోరారు.
– 2014–15 నాటికి నివేదించిన రెవెన్యూ లోటులో రూ.18830.87 కోట్ల బకాయిలను విడుదల చేయాలని హోం మంత్రికి విజ్ఞప్తి చేశారు జగన్.
– ఏపీలో జరుగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ పై అమిత్ షా కి సవివర నివేదిక ఇచ్చిన జగన్.. ఏపీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలకు సంబంధించి, అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను మంజూరుచేయాలని కోరారు.
– ధాన్యం కొనుగోలు బకాయిలు, ఉపాధి హామీ పథకంలో ఆగిపోయిన నిధులు, నివర్ తుపాను నష్టపరిహారం, విద్యుత్ రంగానికి చేయూత అందించాలని కోరారు. దిశ బిల్లు, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు కోరారు. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన మేరకు స్థానిక సంస్థలకు విడుదలచేయాల్సిన రూ. 529.95 కోట్ల రూపాయలను విడుదల చేయాలని కూడా అమిత్ షా కి విజ్ఞప్తి చేశారు జగన్.
– గతేడాది డిసెంబర్ 15న కేంద్రమంత్రి అమిత్ షా తో భేటీ అయిన జగన్.. నెలరోజుల వ్యవధిలో.. మరోసారి ఆయనతో సమావేశం కావడం ఆసక్తిగా మారింది. కర్నూలుకి హైకోర్టు తరలింపు, ప్రత్యేక హోదా.. ఈ దఫా చర్చల్లో కీలక అంశాలుగా మారాయి.