రైతు సంఘాలపై రాజకీయ పార్టీల కన్ను
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దు్ల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలన్నీ ఒకే తాటిపై ఉన్నాయా? రైతు ఆందోళనలో భిన్న వైఖరులున్నాయా? రాజకీయ పార్టీలు రైతు సంఘాల్లో అనైక్యతకు ప్రయత్నిస్తున్నాయా? ఈ ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు లభిస్తున్నాయి. సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ రైతు సంఘాలు మొట్టుదిగడానికి సిద్ధంగా లేవు. దీంతో కేంద్రం రైతు సంఘాల నేతలపై కేసులు బనాయించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు రాజకీయ పార్టీలు రైతు ఉద్యమాన్ని సొమ్ము చేసుకునేందుకు […]
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దు్ల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలన్నీ ఒకే తాటిపై ఉన్నాయా? రైతు ఆందోళనలో భిన్న వైఖరులున్నాయా? రాజకీయ పార్టీలు రైతు సంఘాల్లో అనైక్యతకు ప్రయత్నిస్తున్నాయా? ఈ ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు లభిస్తున్నాయి. సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ రైతు సంఘాలు మొట్టుదిగడానికి సిద్ధంగా లేవు. దీంతో కేంద్రం రైతు సంఘాల నేతలపై కేసులు బనాయించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు రాజకీయ పార్టీలు రైతు ఉద్యమాన్ని సొమ్ము చేసుకునేందుకు యత్నిస్తున్నాయి. ఫలితంగా రైతు సంఘాల మధ్య ఐక్యత దెబ్బతింటోంది. తాజా పరిణామాలే అందుకు నిదర్శనం.
వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం ప్రతిపాధించిన సవరణలను రైతులు ఆమోదించడానికి సిద్ధంగాలేరు. సుప్రీం కోర్టు నియమించిన నలుగురు సభ్యుల కమిటీ ముందుకు రావడానికి కూడా ససేమిరా అంటున్నారు. వ్యవసాయ చట్టాల రద్దు మినహా మరే ప్రత్యా్మ్నాయాన్ని ఆమోదించబోమని తేల్చిచెబుతున్నారు. కేంద్రం ఈ విషయంలో సానుకూలంగా స్పందించకపోతే జనవరి 26న ట్రాక్టర్ మార్చ్ నిర్వహిస్తామని ఇప్పటికే రైతు సంఘాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో రైతు ఉద్యమాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు రాజకీయ పార్టీలు యత్నిస్తున్నట్లు వార్తలు వెలువడడం గమనార్హం. భారత్ కిసాన్ యూనియన్ (బీకేయూ– హర్యానా)కు చెందిన గుర్నమ్ సింగ్ చదూనీ, సర్వ హిందూ రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ (మధ్యప్రదేశ్)కు చెందిన శివ కుమార్ కక్కాజీల మధ్య విభేదాలే అందుకు నిదర్శనం.
హర్యానా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు రూ.10 కోట్లకు ఓ రాజకీయ పార్టీతో చదూనీ ఒప్పందం చేసుకున్నాడని కక్కాజీ చెప్పినట్టు ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కూడా ఇస్తామంటూ ఆ పార్టీ హామీ ఇచ్చినట్లు పేర్కొంది. దీంతో కక్కాజీ ఓ ‘ఆరెస్సెస్ ఏజెంట్’ అని చదూనీ విమర్శించారు. ఈ వివాదంతో రైతు సంఘాల మధ్య దూరం పెరిగింది.
రాజకీయ పార్టీలతో సమావేశమైన మాట వాస్తవమేనని బీకేయూ నేత చదూనీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో అలాంటి సమావేశాలకు హాజరు కానని అన్నారు. కాగా, రైతుల ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి చదూనీని దూరం పెట్టింది. ఆయన సమావేశంతో తమకేం సంబంధం లేదని స్పష్టం చెప్పింది. చదూనీ సమావేశం గురించి అధ్యయనం చేసేందుకు కమిటీ వేసినట్టు వివరించింది. కాగా.. చదూనీపై తాను ఆరోపణలు చేసినట్లు వచ్చిన వార్తలను కక్కాజీ ఖండించారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న 31 సంఘాల్లో ఇప్పటికే భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహాన్) వేరైంది. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ ఆందోళన చేసినందుకు గాను బీకేయూ (ఉగ్రహాన్) సంస్థను అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి దూరం పెట్టింది. రైతు ఉద్యమంలో వామపక్ష తీవ్రవాదులున్నారనే కేంద్రం ఆరోపణల నేపథ్యంలో సమన్వయ సమితి ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా రాజకీయ పార్టీలతో సంబంధాల ఆరోపణలతో మరో సంఘం కూడా దూరమైంది. మొత్తానికి కాగల కార్యం గంధర్వులే నెరవేర్చినట్లు రైతు సంఘాల మధ్య పెరుగుతున్న అనైక్యత కేంద్రానికి కలిసొచ్చేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.