మజ్లిస్ సాయంతోనే బీజేపీ గెలుపు !
బీజేపీ, మజ్లిస్ పార్టీలు చూడ్డానికి నిప్పు, ఉప్పులా కనిపిస్తుంటాయి. బీజేపీ హిందుత్వ రాజకీయాలను నమ్ముకుంటే, మజ్లిస్ మాత్రం సెక్యులర్ వాదన వినిపిస్తుంది. రెండు పార్టీలకూ ఏ ఒక్క విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరదు. ఇదంతా పైకి కనిపించేది మాత్రమే. కానీ.. రెండింటి మధ్య సారూప్యత ఉంటుంది. ఇరు పార్టీలూ నమ్ముకున్నది మతరాజకీయాల్నే. మెజార్టీ మతస్తుల ఓట్లను రాబట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే, బీజేపీ వ్యతిరేక ఓట్లను సొమ్ముచేసుకునేందుకు మజ్లిస్ యత్నిస్తుంటుంది. అందుకే ఈ రెండింటి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందనే […]
బీజేపీ, మజ్లిస్ పార్టీలు చూడ్డానికి నిప్పు, ఉప్పులా కనిపిస్తుంటాయి. బీజేపీ హిందుత్వ రాజకీయాలను నమ్ముకుంటే, మజ్లిస్ మాత్రం సెక్యులర్ వాదన వినిపిస్తుంది. రెండు పార్టీలకూ ఏ ఒక్క విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరదు. ఇదంతా పైకి కనిపించేది మాత్రమే. కానీ.. రెండింటి మధ్య సారూప్యత ఉంటుంది. ఇరు పార్టీలూ నమ్ముకున్నది మతరాజకీయాల్నే. మెజార్టీ మతస్తుల ఓట్లను రాబట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే, బీజేపీ వ్యతిరేక ఓట్లను సొమ్ముచేసుకునేందుకు మజ్లిస్ యత్నిస్తుంటుంది. అందుకే ఈ రెండింటి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందనే వాదన పదే పదే వినిపిస్తుంటుంది. ఇప్పుడా అనుమానాలకు బీజేపీ నేతలు తెరదించారు. ఎంఐఎం సహకారం తమకు ఉందంటూ
కుండబద్దలు కొట్టారు.
కేవలం దక్షణాదికే, అందులోనే హైదరాబాద్ కే పరిమితమైన మజ్లిస్ పార్టీ కొంతకాలంగా ఉత్తరాదిన బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా బరిలోకి దిగుతోంది. పెద్దగా సానుకూల ఫలితాలు లేకపోయినా పోటీలో మాత్రం వెనక్కితగ్గడం లేదు. దీంతో మజ్లిస్ ని పోటీకి నిలబెట్టడం వెనక బీజేపీ కుట్రదాగుందనే ఆరోపణలున్నాయి. లౌకిక పార్టీల ఓట్లు చీల్చి, పరోక్షంగా బీజేపీ గెలుపునకు సహకరిస్తోందనే విమర్శలున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ సైతం ఈ విషయాన్ని రూఢీ చేశారు. భవిష్యత్తులోనూ ఎంఐఎం బీజేపికి సహకరిస్తుందని స్పష్టం చేశారు.
తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. మరో పది స్థానాల్లో ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి ఓటమికి కారణమైంది. ప్రతిపక్షం ఓట్లు చీల్చడం ద్వారా ఎన్డీయే గెలుపునకు దోహదపడింది. ఇప్పుడు ఇదే విషయాన్ని ఉన్నవ్ బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ కన్ఫమ్ చేశారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీకి ఎంఐఎం సాయం చేసిందని, భవిష్యత్తులోనూ ఓవైసీ సహాయం ఉంటుందని అన్నారు. త్వరలో జరిగే ఉత్తర ప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మజ్లిస్ సాయం తమకు ఉంటుందన్నారు. సాక్షి మహరాజ్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఉత్తర ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఓంప్రకాష్ రాజ్ భర్ నేతృత్వంలోని సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో కలిసి మజ్లిస్ పార్టీ పోటీ చేస్తోంది. సాక్షి మహరాజ్ వ్యాఖ్యలను బట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీకి బలం చేకూర్చేందుకే మజ్లిస్ బరిలోకి దిగినట్లు అర్థమవుతోంది. బీహార్ ఫలితాల తరువాత ఎంఎంఐ బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తోందంటూ పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సాక్షి మహరాజ్ వ్యాఖ్యలు ఆ వాదనకు బలం చేకూర్చుతున్నాయి. త్వరలో జరగనున్న బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లోనూ మజ్లిస్ ఇలాంటి పాత్రే పోషిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.