చిక్కుల్లో అర్నబ్
టెలివిజన్ ఛానల్స్ రేటింగ్స్ ను తారుమారు చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్నబ్ గోస్వామి మరో వివాదానికి కేరాఫ్ గా మారారు. దేశభక్తి గురించి గగ్గోలు పెట్టే అర్నబ్ దేశ రహస్యాలను వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకున్నారని ముంబై పోలీసులు ఆరోపిస్తున్నారు. టీఆర్పీ కుంభకోణం కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది. చార్జ్ షీట్ లో పోలీసులు జతచేసిన అర్నబ్ వాట్సప్ చాట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశ వ్యాప్తంగా సంచలనం […]
టెలివిజన్ ఛానల్స్ రేటింగ్స్ ను తారుమారు చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్నబ్ గోస్వామి మరో వివాదానికి కేరాఫ్ గా మారారు. దేశభక్తి గురించి గగ్గోలు పెట్టే అర్నబ్ దేశ రహస్యాలను వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకున్నారని ముంబై పోలీసులు ఆరోపిస్తున్నారు. టీఆర్పీ కుంభకోణం కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది. చార్జ్ షీట్ లో పోలీసులు జతచేసిన అర్నబ్ వాట్సప్ చాట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణం కేసు కొత్త మలుపు తిరిగింది. కేసును విచారిస్తున్న ముంబై పోలీసులు అర్నబ్ గోస్వామికి వ్యతిరేకంగా 3400 పేజీల అదనపు చార్జ్ షీట్ దాఖలు చేశారు. బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రిసెర్చ్ కౌన్సిల్ (బార్క్)తో కలిసి అర్నబ్ గోస్వామి టెలివిజన్ ఛానల్స్ రేటింగ్ ను తారుమారు చేశారని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, టీఆర్పీ రేటింగ్‌లను మార్చేశారని పేర్కొన్నారు. రిపబ్లిక్ టీవీ అగ్రస్థానానికి చేరుకోవడానికి పార్థోదాస్ సహకరించారని ఆరోపించారు. అందుకోసం అర్నబ్ భారీ మొత్తంలో నగదు చెల్లించారని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జ్ షీట్ లో 500 పేజీలకు పైగా వాట్సప్ సందేశాలుండడం గమనార్హం.
బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్‌కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సాయం చేస్తానంటూ అర్నబ్ గోస్వామి వాట్సప్ చాట్ లో హామీ ఇచ్చారు. మంత్రులంతా మనతోనే ఉన్నారంటూ అర్నబ్ భరోసా ఇచ్చారు కూడా. మరోవైపు వాట్సప్ చాట్ లో ప్రధాన మంత్రి కార్యాలయానికి చెందిన రహస్యాలు సైతం వెలుగుచూశాయి. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ బాలాకోట్‌లోని ఉగ్రస్ధావరాలపై వైమానిక దాడి జరపనుందన్న విషయం అర్నబ్ వాట్సప్ చాట్ లో పార్థోదాస్ తో పంచుకున్నారు. రెండు మూడు రోజుల్లో పెద్ద సంఘటన జరగబోతోందంటూ పార్థోదాస్ కి తెలియజేశారు. బాలాకోట్ దాడి తరువాత పార్థోదాస్ మీరు చెప్పిన సంఘటన ఇదేనా అంటూ అర్నబ్ తో సంభాషించారు. ఈ సంభాషణల్లో భాగంగా ఆ సంఘటన తమకు కలిసొచ్చిందని అర్నబ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
ముంబై పోలీసులు సమర్పించిన చార్జ్ షీట్ ప్రకారం బాలాకోట్ దాడి గురించి అర్నబ్ కు ముందే సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ప్రధాన మంత్రి కార్యాలయంపైనే అందరికీ సందేహాలు మొదలయ్యాయి. దేశ భద్రతకు సంబంధించిన విషయాలు, కనీసం కేబినెట్ కు కూడా సమాచారం లేని రహస్యాలు ఒక టీవీ ఛానెల్ అధినేతకు తెలియజేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి అనధికార ప్రతినిధిగా వ్యవహరించే అర్నబ్ గోస్వామి టీవీ ఛానెల్ లో దేశభక్తి గురించి అందరికీ పాఠాలు చెబుతుంటాడు. అలాంటి వ్యక్తే దేశ రహస్యాలను వ్యాపారం కోసం వాడుకున్నాడనే వాస్తవాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. మరి ఈ విషయంలో కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.