కోవాగ్జిన్ వద్దంటున్న వైద్యులు
ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. శనివారం దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చారు. తొలి విడతలో భాగంగా మూడు కోట్ల మందికి వాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నప్పటికీ ప్రజల మనసుల్లో సందేహాలు మాత్రం తీరడం లేదు. భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ తో పాటు, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ల అత్యవసర వినియోగానికి ప్రభుత్వం […]
ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. శనివారం దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చారు. తొలి విడతలో భాగంగా మూడు కోట్ల మందికి వాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నప్పటికీ ప్రజల మనసుల్లో సందేహాలు మాత్రం తీరడం లేదు.
భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ తో పాటు, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ల అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతించింది. కాగా.. రెండింటిలో ఏ వ్యాక్సిన్ ఎంచుకోవాలనే విషయంలో మాత్రం ఆప్షన్ ఇవ్వలేదు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు సైతం తమకు కావల్సిన వ్యాక్సిన్ ను ఎంచుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులు తమకు కోవాగ్జిన్ వద్దంటూ సూపరింటెండెంట్ కు లేఖ రాశారు.
రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి చెందిన రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ సామర్థ్యం పట్ల సందేహాలు వ్యక్తం చేస్తోంది. తమకు సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే ఇవ్వాలంటూ సూపరింటెండెంట్ కు వైద్యులు లేఖ రాశారు. కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ పూర్తి కానందున తాము ఆ వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధంగా లేమని వైద్యులు లేఖలో పేర్కొన్నారు. కాగా.. లోహియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మాత్రం వైద్యుల అభిప్రాయాలకు భిన్నంగా కోవ్యాగ్జిన్ టీకానే వేయించుకోవడం గమనార్హం.
కోవ్యాగ్జిన్ విషయంలో ఓవైపు ఆందోళనలు వ్యక్తమవుతుంటే ప్రభుత్వం మాత్రం ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం అనుమతించిన రెండు వ్యాక్సిన్లూ పూర్తి సురక్షితమైనవని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవ్వడానికి ముందే రెండు వేల మంది వాలెంటీర్లపై వ్యాక్సిన్ ను ప్రయోగించామని, దుష్పరిణామాలు పెద్దగా లేవని నీతి ఆయోగ్ సభ్యుడు వికే పౌల్ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆరంభమైన ఏ దేశంలోనూ ఆప్షన్ ఇవ్వలేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ గతంలోనే వెల్లడించారు. కేంద్రం ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ప్రజలను మాత్రం సందేహాలు వీడడం లేదు.
పరిహారం చెల్లిస్తాం
మరోవైపు.. కోవాగ్జిన్ సామర్థ్యంపై భారత్ బయోటెక్ సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది. తమ వ్యాక్సిన్ సురిక్షితమైందని వెల్లడించింది. కోవాగ్జిన్ వేసుకున్న వారికి ఎవరికైనా దుష్పరిణామాలు ఎదురైతే నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. వ్యాక్సిన్ తో సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కలిగితే తగిన పరిహారం చెల్లిస్తామంది. కాకపోతే.. ఆ దుష్పరిణామాలు తమ వ్యాక్సిన్ వల్లే అని నిరూపితం కావాలంది. అందుకోసం వ్యాక్సిన్ తీసుకునే వారి నుంచి అంగీకార పత్రంపై సంతకం చేయించుకోవాలని నిర్ణయించినట్లు వివరించింది.