Telugu Global
National

జియో టవర్ల ధ్వంసంపై హేమామాలిని అసహనం

నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతు సంఘాలు, కేంద్రం మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. రైతుల ఆందోళనల నేపథ్యంలో మూడు వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీసుకున్న నిర్ణయం సమస్య పరిష్కారానికి మార్గం చూపేలా కనిపించడం లేదు. సుప్రీం కోర్టు నలుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ విషయంలోనూ ఇరు పక్షాల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కమిటీని ప్రభుత్వం స్వాగతించగా, రైతులు మాత్రం కమిటీ ముందుకు రావడానికి సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో […]

జియో టవర్ల ధ్వంసంపై హేమామాలిని అసహనం
X

నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతు సంఘాలు, కేంద్రం మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. రైతుల ఆందోళనల నేపథ్యంలో మూడు వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీసుకున్న నిర్ణయం సమస్య పరిష్కారానికి మార్గం చూపేలా కనిపించడం లేదు. సుప్రీం కోర్టు నలుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ విషయంలోనూ ఇరు పక్షాల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కమిటీని ప్రభుత్వం స్వాగతించగా, రైతులు మాత్రం కమిటీ ముందుకు రావడానికి సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ, సినీ నటి హేమామాలిని వివాదస్పద వ్యాఖ్యలు చేయడం మరోమారు చర్చనీయాంశంగా మారింది.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తుండడాన్ని ఎంపీ హేమామాలిని తప్పుబట్టారు. రైతులకు మేలు చేసే చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. అసలు రైతులకు ఏం కావాలో వాళ్లకే తెలీదంటూ ఘాటు విమర్శలు చేశారు. వ్యవసాయ చట్టాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన హేమామాలిని, రైతులకు మేలు చేసే చట్టాలను వ్యతిరేకించడం సరైందికాదన్నారు.

చట్టాలపై కోర్టు స్టే విధించడం మంచి పరిణామమని, కోర్టు నిర్ణయంతో పరిస్థితులు సద్దుమణిగే అవకాశముందని హేమామాలిని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ చట్టాల విషయంలో రైతుల అభ్యంతరాలను చర్చించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందని, కానీ ప్రభుత్వ ప్రయత్నాలకు రైతులు సహకరించడం లేదన్నారు. వాస్తవానికి నూతన వ్యవసాయ చట్టాలతో వచ్చే సమస్యలేంటో కూడా రైతులకు తెలీదని, కావాలనే కొందరు రైతులను రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు.

రైతుల ఆందోళనలను తప్పుబట్టిన హేమామాలిని పంజాబ్ రాష్ట్రంలో మొబైల్ టవర్లను ధ్వంస చేయడాన్ని ఖండించారు. సెల్ ఫోన్ టవర్ల విధ్వంసాన్ని సహించలేమన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినా రాకుండా విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హేమామాలిని. సెల్ టవర్ల విధ్వంసం వల్ల కమ్యూనికేషన్ దెబ్బతినడంతో విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

నూతన వ్యవసాయ చట్టాల వల్ల కార్పోరేట్ సంస్థలే లాభపడతాయని ఆరోపిస్తున్న రైతులు అదానీ, అంబానీ ఉత్పత్తుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పంజాబ్ లో గడిచిన నెలరోజుల్లో దాదాపు 1500లకు పైగా జియో టవర్లను స్థానికులు ధ్వంసం చేశారు. ఈ విషయంలో రిలయెన్స్ సంస్థ కోర్టును కూడా ఆశ్రయించింది. ఇప్పుడు హేమామాలిని రైతులను తప్పుబడుతూ, రిలయెన్స్ కు అనుకూలంగా మాట్లాడడం మరోమారు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి వ్యవసాయ చట్టాల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన ఇప్పట్లో వీడేలా కనిపించడంలేదు.

First Published:  14 Jan 2021 3:09 AM IST
Next Story