Telugu Global
National

వ్యవసాయ చట్టాలపై 'సుప్రీం' ఆగ్రహం

నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు, ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఇటు కేంద్రం, అటు రైతుల సంఘాలు మెట్టు దిగడానికి సిద్ధంగా లేవు. కార్పోరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తుండగా, కేంద్రం మాత్రం ఆ ఒక్కటీ అడగొద్దంటోంది. కేంద్రం సానుకూలంగా స్పందించే వరకూ ఆందోళన విరమించేది లేదంటూ రైతు సంఘాలు తేల్చిచెప్పాయి. ఈ నేపథ్యంలో రైతుల డిమాండ్ల పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరిని దేశ సర్వోన్నత […]

వ్యవసాయ చట్టాలపై సుప్రీం ఆగ్రహం
X

నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు, ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఇటు కేంద్రం, అటు రైతుల సంఘాలు మెట్టు దిగడానికి సిద్ధంగా లేవు. కార్పోరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తుండగా, కేంద్రం మాత్రం ఆ ఒక్కటీ అడగొద్దంటోంది. కేంద్రం సానుకూలంగా స్పందించే వరకూ ఆందోళన విరమించేది లేదంటూ రైతు సంఘాలు తేల్చిచెప్పాయి. ఈ నేపథ్యంలో రైతుల డిమాండ్ల పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరిని దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. కేంద్రం తీరు పట్ల నిరాశతో ఉన్నామంటూ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. పరిస్థితులు రోజు రోజుకూ విషమిస్తున్న నేపథ్యంలో చట్టాలను కొంతకాలం నిలిపివేస్తారా? లేదా? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. లేదంటే తమనే ఆపని చేయమంటారా? అని వ్యాఖ్యానించింది. వ్యవసాయ చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య జరుగుతున్న చర్చల పట్ల అసంతృప్తితో ఉన్నట్లు కోర్టు వ్యాఖ్యానించింది. అసలు చర్చల్లో ఏం జరుగుతుందో తెలియట్లేదని, ఆందోళనల్లో పాల్గొంటున్న రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

వ్యవసాయ చట్టాల వల్ల ఉపయోగం ఉందనేందుకు ఒక్క ఉదాహరణ కనిపించడం లేదని కోర్టు అభిప్రాయపడింది. చట్టాల పట్ల దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోందని పేర్కొంది. చట్టాల్ని రద్దు చేయాలని చెప్పడం లేదని, సమస్యకు పరిష్కారం వెతకడమే ఉద్ధేశ్యమని కోర్టు స్పష్టం చేసింది. సమస్య పరిష్కారం కోసం కమిటీని ప్రతిపాధిస్తున్నట్లు తెలిపింది.

మరోవైపు తాజాగా సింఘూ సరిహద్దులో ఆందోళన చేస్తున్న ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్‌కు చెందిన 40 ఏళ్ల అమరీందర్ సింగ్ విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. రైతు ఆత్మహత్యపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. ఎందరు ప్రాణాలు కోల్పోయినా మోదీ ప్రభుత్వానికి రైతు సమస్యలు పట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్రం సుముఖంగా లేకపోవడంతో రైతు సంఘాలు ఆందోళనను ఉధృతం చేయడానికి సిద్ధమయ్యాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ పథ్ లో ట్రాక్టర్ మార్చ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. మొత్తానికి సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికైనా కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందో లేదో చూడాలి. కోర్టు ప్రతిపాధించినట్లు కమిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చినా సమస్య కొంతలో కొంతైన కొలిక్కివచ్చే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  11 Jan 2021 3:27 AM GMT
Next Story