నా నిర్ణయాన్ని మార్చుకోలేను.. దయచేసి ఇబ్బంది పెట్టొద్దు.. అభిమానులకు తలైవా లేఖ
రాజకీయాల్లోకి రావడం లేదని ఇప్పటికే స్వయంగా ప్రకటించానని, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని, అభిమానులు అర్థం చేసుకోవాలని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన అభిమానులకు ఓ లేఖ విడుదల చేశారు. డిసెంబర్ 31న కొత్త పార్టీ పెడుతున్నట్లు రజనీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆలోగా పెండింగ్ లో ఉన్న తన తాజా సినిమా అన్నాత్తే షూటింగ్ కంప్లీట్ చేసేందుకు రజినీ హైదరాబాద్ వచ్చారు. సెట్స్ లో నలుగురు […]
రాజకీయాల్లోకి రావడం లేదని ఇప్పటికే స్వయంగా ప్రకటించానని, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని, అభిమానులు అర్థం చేసుకోవాలని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన అభిమానులకు ఓ లేఖ విడుదల చేశారు. డిసెంబర్ 31న కొత్త పార్టీ పెడుతున్నట్లు రజనీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆలోగా పెండింగ్ లో ఉన్న తన తాజా సినిమా అన్నాత్తే షూటింగ్ కంప్లీట్ చేసేందుకు రజినీ హైదరాబాద్ వచ్చారు. సెట్స్ లో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో రజినీ ఐసోలేషన్ కే పరిమితం అయ్యారు. ఆ తర్వాత ఆయన హైబీపీ కారణంగా అపోలో హాస్పిటల్లో చేరారు.
కరోనా పరిస్థితులతో పాటు ఆరోగ్యం సరిగా లేని సమయంలో రాజకీయ పార్టీ పెట్టక పోవడమే మేలని వైద్యులు ఆయనకు సూచించారు. రజినీ కుటుంబసభ్యులు కూడా ఆయన కొత్త పార్టీ పెట్టడం ఇష్టపడలేదు. దీంతో రజినీకాంత్ పది రోజుల కిందట అభిమానులను ఉద్దేశించి ఓ లేఖ రాశారు. తాను రాజకీయ పార్టీ పెట్టడం లేదని అభిమానులు తన పరిస్థితిని అర్థం చేసుకొని క్షమించాలని కోరారు.
అయితే రజినీకాంత్ రాజకీయాల్లోకి రానని ప్రకటించడంతో అభిమానులు నైరాశ్యంలో మునిగిపోయారు. ఆయన ప్రకటన చేసిన రోజు రాత్రే రజినీ ఇంటి ముందుకు భారీగా చేరుకున్నారు. చేసిన ప్రకటన వెనక్కి తీసుకొని రాజకీయాల్లోకి రావాలంటూ ధర్నా చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో రజినీ రాజకీయాల్లోకి రావాలని ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
తాజాగా చెన్నై లో రజినీ అభిమానులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజకీయాల్లోకి రావాలని రజినీకి విన్నవించారు. చివరికి దివ్యాంగులు కూడా ఆందోళన స్థలికి చేరుకొని రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరారు.
పది రోజులు దాటినా అభిమానులు ఆందోళనలు నిర్వహించడం ఆపకపోవడంతో తాజాగా రజినీ కాంత్ అభిమానులకు మరో లేఖ రాశారు. ‘తాను రాజకీయాల్లోకి రానని ఇప్పటికే ప్రకటించాను. తన నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. అభిమానులు దయచేసి నా నిర్ణయాన్ని గౌరవించాలి. రాజకీయ పార్టీని ప్రారంభించాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించడం వంటి కార్యక్రమాలను అభిమానులు చేపట్టవద్దు’ అని రజినీకాంత్ తన లేఖలో పేర్కొన్నారు.
రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని పది రోజులుగా అభిమానులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మరోసారి రజినీ రాజకీయాలపై మరోసారి క్లారిటీ ఇవ్వడంతో ఇకనైనా అభిమానులు ఆందోళనలు చేయడం ఆపివేస్తారేమో చూడాలి.