అమ్మఒడి.. అటా..? ఇటా..??
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో అమ్మఒడి పథకం అమలుపై పీటముడి పడింది. ఓవైపు ఎన్నికల వ్యవహారాన్ని కోర్టులో తేల్చుకోడానికి ఏపీ సర్కారు సిద్ధమైనా.. అమ్మఒడి ఈనెల 11న అమలు చేసే టైమ్ కి కోర్టు నుంచి ఆదేశాలు వెలువడే అవకాశం కనిపించడంలేదు. ప్రభుత్వం ధీమాగానే ఉన్నా లబ్ధిదారుల్లో మాత్రం ఎక్కడలేని టెన్షన్ నెలకొంది. నెల్లూరులో ఈనెల 11న బహిరంగ సభ వేదికపైనుంచి అమ్మఒడి రెండో విడత నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు సీఎం జగన్. రాష్ట్రంలో […]
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో అమ్మఒడి పథకం అమలుపై పీటముడి పడింది. ఓవైపు ఎన్నికల వ్యవహారాన్ని కోర్టులో తేల్చుకోడానికి ఏపీ సర్కారు సిద్ధమైనా.. అమ్మఒడి ఈనెల 11న అమలు చేసే టైమ్ కి కోర్టు నుంచి ఆదేశాలు వెలువడే అవకాశం కనిపించడంలేదు. ప్రభుత్వం ధీమాగానే ఉన్నా లబ్ధిదారుల్లో మాత్రం ఎక్కడలేని టెన్షన్ నెలకొంది.
నెల్లూరులో ఈనెల 11న బహిరంగ సభ వేదికపైనుంచి అమ్మఒడి రెండో విడత నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు సీఎం జగన్. రాష్ట్రంలో ఉన్న కోడ్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించింది కాబట్టి.. సీఎం సభ జరిగే ప్రాంతం అర్బన్ ఏరియా కాబట్టి.. సభకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అడ్డు రాదని అధికారులు అంటున్నారు. సీఎం సభ ఎక్కడ జరిగినా.. అమ్మఒడి లబ్ధిదారులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి.. అలాంటి సంక్షేమ కార్యక్రమాలు జరపొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో పరోక్షంగా ప్రస్తావించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఒకవేళ సీఎం సభకు అమ్మఒడికి సంబంధం లేదని ప్రకటించి, నేరుగా లబ్ధిదారులకు అధికారులే నిధులు విడుదల చేసినా కూడా కోడ్ ఉల్లంఘనేనంటున్నాయి ప్రతిపక్షాలు. ఈ నేపథ్యంలో అమ్మఒడి లబ్ధిదారులలో ఆందోళన నెలకొంది.
మరోవైపు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాత్రం ఆరు నూరైనా అమ్మఒడి ఆపేది లేదని స్పష్టం చేసారు. గతేడాది కంటే ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. వెయ్యి రూపాయలు మరుగుదొడ్ల నిర్వహణకు మినహాయించుకుని 14వేల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తామని చెబుతున్నారు. అటు నెల్లూరులో సీఎం టూర్ కి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తమ్మీద అమ్మఒడిపై ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల కోడ్ పేరుతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటే మాత్రం కచ్చితంగా అది స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందని, ప్రతిపక్షాలకు చెంప పెట్టులా మారుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
ఎన్నికల సంఘం వద్దంటోంది, ప్రభుత్వం కుదరదంటోంది.. ఈ సంశయంలో అమ్మఒడి లబ్ధిదారుల్లో కలవరం మొదలైంది. గతేడాది కూడా సంక్రాంతి సీజన్లో అమ్మఒడి నిధులు విడుదల చేయడంతో.. ఏపీలో పండగ వ్యాపారానికి కళ వచ్చింది. పేదల ఇళ్లలో సంక్రాంతి నిజమైన పండగగా మారింది. ఈ దఫా డబ్బులు పడవేమోనని అనుమానం అందరినీ పట్టి పీడిస్తోంది. అమ్మఒడి అటా.. ఇటా అనే విషయం తేలాలంటే సోమవారం వరకు వేచి చూడాల్సిందే.