Telugu Global
NEWS

తెరమీదకు మళ్లీ 'పసుపు' పంచాయితీ

మరోమారు పసుపు బోర్డు పంచాయితీ తెరమీదికొచ్చింది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన తెలంగాణలోనూ అగ్గి రాజేస్తోంది. సుదీర్ఘకాలంగా పసుపు బోర్డు కోసం పోరాడుతున్న నిజామాబాద్ జిల్లా రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి నిర్ణయించుకున్నారు. పసుపు పంటకు రూ.15వేల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ రైతులు ఆందోళనకు దిగారు. 44వ జాతీయ రహదారిపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. పంట చేతికి వచ్చినా మార్కెట్ లో ధరలు లేకపోవడంతో […]

తెరమీదకు మళ్లీ పసుపు పంచాయితీ
X

మరోమారు పసుపు బోర్డు పంచాయితీ తెరమీదికొచ్చింది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన తెలంగాణలోనూ అగ్గి రాజేస్తోంది. సుదీర్ఘకాలంగా పసుపు బోర్డు కోసం పోరాడుతున్న నిజామాబాద్ జిల్లా రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి నిర్ణయించుకున్నారు. పసుపు పంటకు రూ.15వేల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ రైతులు ఆందోళనకు దిగారు. 44వ జాతీయ రహదారిపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు.

పంట చేతికి వచ్చినా మార్కెట్ లో ధరలు లేకపోవడంతో నష్టపోతున్నామని, పసుపు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పంజాబ్ రైతులను ఆదర్శంగా తీసుకొని ఆందోళనను ఉధృతం చేస్తానని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 30వేల ఎకరాలకు పైగా పసుపు పంట సాగు జరుగుతోంది. జిల్లాలో అత్యధికంగా పసుపు దిగుమతి అవుతున్నా రైతులకు మాత్రం కనీస మద్దతు ధర లభించడం లేదు.

గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీజేపీ పసుపు బోర్డును ప్రధాన ప్రచారాస్త్రంగా వినియోగించుకుంది. ఒక రకంగా కల్వకుంట్ల కవిత ఓటమికి పసుపు రైతులే కారణమని చెప్పవచ్చు. తాను నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందితే ఐదురోజుల్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ధర్మపురి అరవింద్ రైతులకు హామీ ఇచ్చారు. బాండ్ పేపర్ పై రాసి ఇచ్చారు కూడా. కానీ ఎంపీగా గెలిచిన తరువాత అరవింద్ పసుపు రైతులను పట్టించుకోలేదు. నేటికీ బోర్డు ఏర్పాటు చేయలేదు. దీంతో సహనం కోల్పోయిన రైతులు ఇప్పుడు రోడ్లమీదికొచ్చారు.

ఎప్పటికప్పుడు తాత్కాలికంగా ధరలు పెంచడం మినహా శాశ్వత పరిష్కారం చూపడంలో ప్రభుత్వాలు వైఫల్యమయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు. పంట వేయక ముందే మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించింది పసుపు పంటకు కనీస మద్దతు ధర చెల్లించాలని కోరుతున్నారు. ప్రతీ సంవత్సరం పెట్టుబడి పెరుగుతుంటే ధరలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపుతో పాటు సన్న ధాన్యానికి రూ.700 బోనస్‌ ఇవ్వాలని, కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ మీద రాసిచ్చి మరీ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రైతుల ఆందోళనకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మద్దతు తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటు వల్ల పసుపు ఆధారిత పరిశ్రమలతో పాటు, ఉపాధి అవకాశాలూ పెరుగుతాయన్నారు ప్రొఫెసర్. మొత్తానికి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన పసుపు బోర్డు డిమాండ్ మరోమారు తెరమీదికొచ్చింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి.

First Published:  10 Jan 2021 12:24 AM GMT
Next Story