Telugu Global
NEWS

మళ్లీ నిప్పు రాజేసిన నిమ్మగడ్డ

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు మరోమారు చర్చనీయాంశంగా మారాయి. పంచాయతీ ఎన్నికల షెడ్యూలును రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 వరకు నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. శనివారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. నిమ్మగడ్డ నిర్ణయంతో ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య కొనసాగుతున్న వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఎస్ఈసీ ప్రకటనకు ముందు నిమ్మగడ్డతో […]

మళ్లీ నిప్పు రాజేసిన నిమ్మగడ్డ
X

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు మరోమారు చర్చనీయాంశంగా మారాయి. పంచాయతీ ఎన్నికల షెడ్యూలును రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 వరకు నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. శనివారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. నిమ్మగడ్డ నిర్ణయంతో ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య కొనసాగుతున్న వివాదం కొత్త మలుపు తీసుకుంది.

ఎస్ఈసీ ప్రకటనకు ముందు నిమ్మగడ్డతో భేటీ అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఇది ఎన్నికల నిర్వహణకు సరైన సమయం కాదంటూ తేల్చిచెప్పారు. కొత్త స్ట్రెయిన్ ముప్పు పొంచి ఉందని, వ్యాక్సిన్ వినియోగానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని తెలిపారు. కానీ.. భేటీ ముగిసిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వ అభిప్రాయానికి భిన్నంగా ఎస్ఈసీ అడుగులు ముందుకు వేసింది. దీంతో నిమ్మగడ్డ, ప్రభుత్వం మధ్య మళ్లీ వార్ మొదలైంది.

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మొదటి నుంచీ వివాదం కొనసాగుతూనే ఉంది. గత సంవత్సరం ఎలక్షన్ కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఎంపీపీ, జెడ్పీటీసీ ఏకగ్రీవాల్లో అక్రమాలు జరిగాయంటూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీంతో ఏకగ్రీవాలు చెల్లవంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తేల్చారు. ఫలితంగా ఎస్ఈసీ తీరు పట్ల ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిమ్మగడ్డ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది.

అదే సమయంలో దేశంలో కరోనా విజృంభించడంతో ఎన్నికలు వాయిదా వేస్తూ నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వానికి, ఎస్ఈసీకి మధ్య చిచ్చు రగిల్చింది. ఎస్ఈసీ పై ఏపీ ప్రభుత్వం గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని ప్రశ్నించింది. ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో అనూహ్య పరిణామాల మధ్య నిమ్మగడ్డ పదవి నుంచి తప్పుకోవల్సి వచ్చింది. చివరకు కోర్టు జోక్యంతో తిరిగి నిమ్మగడ్డ ఎస్ఈసీ బాధ్యతలు చేపట్టారు.

రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ గా నిమ్మగడ్డ తిరిగి బాధ్యతలు చేపట్టిన నాటినుంచీ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రయత్నిస్తున్నారు. కానీ కరోనా ఉదృత్తి తగ్గకపోవడంతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సుముఖంగా లేదు. అయినా నిమ్మగడ్డ మాత్రం పట్టు వీడడం లేదు. గతంలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కోసం ప్రయత్నించారు. కానీ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దీంతో నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయంలో ముగ్గురు చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు ఎలక్షన్ కమిషన్ తో చర్చంచి నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.

హైకోర్టు సూచనల ప్రకారం శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌తో సమావేశమయ్యారు. కరోనా ఉదృతి ఇంకా తగ్గలేదని, ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదంటూ తేల్చిచెప్పారు. కానీ సమావేశం ముగిసిన కాసేపటికే ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అభిప్రాయాన్ని బేఖాతరు చేస్తూ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసింది.

First Published:  9 Jan 2021 4:06 AM IST
Next Story