కాంగ్రెస్ పై కన్నేసిన జేడీయూ!
బీహార్ రాజకీయాలు రోజు రోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు కొద్దిపాటి మెజార్టీతో ఎన్డీయే అధికారంలో వచ్చింది. 75 స్థానాలు దక్కించుకొని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. ఎన్డీయే, మహాకూటమి మధ్య కొద్ది పాటి తేడానే ఉండడంతో ఎన్డీయేని ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో మహాకూటమిని బలహీన పర్చేందుకు ప్రతిపక్షాలపై ఆపరేషన్ ఆకర్ష్ ని ప్రయోగిస్తోంది. ఆర్జేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు […]
బీహార్ రాజకీయాలు రోజు రోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు కొద్దిపాటి మెజార్టీతో ఎన్డీయే అధికారంలో వచ్చింది. 75 స్థానాలు దక్కించుకొని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. ఎన్డీయే, మహాకూటమి మధ్య కొద్ది పాటి తేడానే ఉండడంతో ఎన్డీయేని ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో మహాకూటమిని బలహీన పర్చేందుకు ప్రతిపక్షాలపై ఆపరేషన్ ఆకర్ష్ ని ప్రయోగిస్తోంది.
ఆర్జేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారంటూ ఇటీవలి కాలంలో జేడీయూ నేతలు పదే పదే మాట్లాడుతున్నారు. తాజాగా జేడీయూ నేతల మాటలకు బలాన్ని చేకూర్చేలా 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్డీయేలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కాంగ్రెస్ నేత భరత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ కాంగ్రెస్ కు గడ్డుపరిస్థితులు తప్పవంటూ భరత్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పార్టీమారేందుకు సిద్ధంగా ఉన్న 11 మంది ఎమ్మెల్యేల పేర్లను సైతం సీఎల్పీ నేతకు ఇచ్చినట్లు తెలిపారు.
పార్టీ మారే వారిలో బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా కూడా ఉన్నారని భరత్ సింగ్ వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో కూడా బీహార్ కాంగ్రెస్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. పార్టీ మారాలనుకుంటున్న 11 మంది ఎమ్మెల్యేలు డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నారని ఆరోపించారు భరత్ సింగ్. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
గతంలో జేడీయూతో కలిసి కాంగ్రెస్ అధికారాన్ని పంచుకుంది. అప్పట్లో బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అశోక్ చౌదరి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తరువాతి పరిణామాల్లో భాగంగా జేడీయూ బీజేపీతో జట్టుకట్టడంతో అశోక్ చౌదరి కాంగ్రెస్ ని వీడి జేడీలో చేరారు. ప్రస్తుతం జేడీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న అశోక్ చౌదరి విద్యా శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన బాటలోనే ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు కూడా కాంగ్రెస్ ని వీడడానికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఒక దశలో కాంగ్రెస్ వైఫల్యం కారణంగానే ఆర్జేడీ అధికారానికి దూరమైందనే విమర్శలనూ ఎదుర్కోవల్సి వచ్చింది. మొత్తంగా 19 సీట్లను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి 125 సీట్లు స్థానాలతో మెజార్టీని దక్కించుకుంది. అది మ్యాజిక్ కి ఫిగర్ కి కేవలం మూడు స్థానాలు మాత్రమే అదనం. కనుక 110 స్థానాలు దక్కించుకున్న మహాకూటమి నుంచి ఎప్పుడైనా ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే… ముందస్థుగా మహాకూటమిని బలహీన పరిచే వ్యూహాన్ని అమలుచేస్తోంది ఎన్డీయే.
తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ, జేడీయూ మధ్య అంతరాలు మొదలయ్యాయి. మరోవైపు ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన హిందుస్తానీ అవామ్ మోర్చా సైతం తమకు ఒక నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవితో పాటు, మంత్రివర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తోంది. ఒకవేళ ఈ వివాదాలు తారా స్థాయికి చేరి ఆర్జేడీకి అనుకూలంగా మారితే… మహాకూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కాంగ్రెస్ ని వీడితే నష్టపోతామని ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్డీయే చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి మరి.